ఉక్రెయిన్ కు రక్షా కవచం.. రష్యాకు కొరకరాని కొయ్య.. ఆ భూగర్భ నగరం

Update: 2022-04-22 12:30 GMT
ఉక్రెయిన్ తీర నగరం మారియుపోల్ ను హస్తగతం చేసుకున్నట్లు రష్యా ఇప్పటికే ప్రకటించింది. దీనికోసం భీకర  యుద్ధమే చేసింది. 20 వేల మందిని చంపింది. మరెన్నో దాడులు చేసింది. వీధుల్లో శవాల గుట్టలు.. షాపింగ్ మాల్ శవాలు భద్రం.. సంచార దహన వాటిక వాహనాలతో అంత్యక్రియలు.. ఒక విధంగా చెప్పాలంటే మారియుపోల్ ఇప్పుడు మరుభూమి.. అలాంటి మారియుపోల్ ను దాదాపు రెండు నెలల యుద్ధం తర్వాత రష్యా గుప్పిట పట్టింది. అలాంటిచోట ఇన్నాళ్లూ రష్యాను ప్రతిఘటించింది ఉక్రెయిన్ సైన్యం కాదు.. మెరైన్ దళాలు. వారు చాలామంది యుద్ధంలో మరణించడంతో సంఖ్య తగ్గిపోయింది. దీంతో మారియుపోల్ రష్యా వశమైంది. అయితే, ఇదే నగరంలోని అజోవ్‌స్తల్‌ స్టీల్‌ ప్లాంట్‌ మాత్రం ఇంకా తమ ఆధీనంలోకి రాలేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ అంగీకరించారు. దాని నుంచి ఈగ కూడా బయటకు వెళ్లలేనంత చుట్టుముట్టాలని దళాలను ఆదేశించారు. దాదాపు నాలుగుమైళ్ల వైశాల్యంలో విస్తరించిన ఈ ప్లాంట్‌ మాత్రమే ఉక్రెయిన్‌ సేనలకు చివరి స్థావరంగా నిలిచింది.భారీ ఉక్కు కర్మాగారం..వినేందుకు ఊరి పేరులా ఉన్నా.. అజోవ్ స్తల్ అనేది ఓ ఉక్కు కర్మాగారం. వేలాది ఉద్యోగులున్నఈ భారీ పరిశ్రమ యూరప్ లోనే అతిపెద్దది. ఏటా 40 లక్షల టన్నుల ముడి ఇనుము ఉత్పత్తి అవుతుంది. సోవియట్ యూనియన్ హయాంలో స్థాపితమై.. 1933 నుంచి ఉత్పత్తి ప్రారంభమైంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జర్మన్‌ నాజీలు 1941 నుంచి 1943 వరకు అజోవ్ స్తల్ నుఆక్రమించారు.

సోవియట్‌ సేనలు తిరిగి స్వాధీనం చేసుకొని సముద్రం ఒడ్డున నాలుగు మైళ్ల పొడవునా కర్మాగారం విభాగాలను నిర్మించాయి. దీన్ని చూస్తే మారియుపొల్‌ అడుగున మరో నగరం ఉన్నట్లు కనిపిస్తుంది. 11 చదరపు కిలోమీటర్లలో విస్తీర్ణంలోని ఈ నగరం రైలు లైన్లు, గోదాములు, బొగ్గు కొలిమిలు,కర్మాగారాలు, చిమ్నీలు, సొరంగాలతో నిండి ఉంటుంది. ఇందులో దాదాపు 24 కిలోమీటర్లు పొడవైన సొరంగాలున్నాయి. సేనలు వేగంగా పొజిషన్లు మార్చుకొనేలా ఇవి సహకరిస్తాయి. పట్టణ ప్రాంత యుద్ధానికి  అత్యంత అనుకూలమైన వాతావరణం ఇది. దీనికి తోడు యుద్ధం మొదలు కావడానికి ముందే ఉక్రెయిన్‌ ఇక్కడికి నిత్యావసరాలు, మందుగుండు భారీ ఎత్తున తరలించింది. దీంతో ఉక్రెయిన్‌కు చెందిన 36వ మెరైన్‌ గ్రూప్‌, అజోవ్‌ బ్రిగేడ్‌లు వీటిల్లో దాక్కుని రోజుల  కొద్దీ యుద్ధం చేశాయి. తమ దళాలు మొండిగా ఈ భూభాగంలో ముందుకు వెళితే భారీగా నష్టపోతాయని పుతిన్‌ గ్రహించారు. అందుకే..  ముట్టడించి సమయం కోసం ఎదురు చూడాలని ఆదేశించారు.

దాడి చేయొద్దు.. దాక్కుని ఉందాం..అజోవ్‌స్తల్‌'పై దాడులు చేయవద్దు.. దానిని ముట్టడించి కూర్చోండి.. పురుగు కూడా లోపలికి వెళ్లడానికి వీల్లేదు' ఇదీ రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగుకు అధ్యక్షుడు పుతిన్‌ ఇచ్చిన ఆదేశం..! ఉక్రెయిన్‌ పారిశ్రామిక మణిహారాల్లో అజోవ్‌స్తల్‌ ఒకటన్న విషయం పుతిన్‌కు తెలుసు. అందుకే.. రష్యా దళాలు దానిని ధ్వంసం చేయకుండా నిలువరించారు. ఉక్రెయిన్‌ దళాలు ఈ కర్మాగారంలోని కిలోమీటర్ల కొద్దీ సొరంగాలను కవచంగా చేసుకొని రష్యా దళాలను ఎదుర్కొంటున్నాయి. దీంతో ప్రపంచం దృష్టి మొత్తం మేరియుపొల్‌ భూగర్భనగరంగా పేరుపడిన 'అజోవ్‌స్తల్'పై పడింది. ఉక్రెయిన్‌లోనే అత్యంత సంపన్నుడు, సంపన్న వ్యాపారి (ఒలిగార్క్‌) రినాత్‌ అక్మితోవ్‌కు చెందిన మెట్‌ ఇన్వెస్ట్‌ గ్రూప్‌. అజోవ్ స్తల్ ను కొనుగోలు చేసింది. రినాత్‌కు రష్యాతో  మంచి సంబంధాలు ఉన్నాయి.2014లో వేర్పాటు వాదంతో రినాత్‌ ఉక్రెయిన్‌ వైపు మొగ్గారు. తాజాగా ఉక్రెయిన్‌పై రష్యా దాడిని కూడా రినాత్‌ ఖండించారు.

ఉక్రెయిన్ వ్యూహాత్మక మౌనం అజోవ్‌స్తల్‌లో పోరాటం చేస్తోన్న వారి వివరాలు వెల్లడించే విషయంలో ఉక్రెయిన్‌ అత్యంత అప్రమత్తంగా ఉంటోంది. అక్కడ ఎంతమంది ఉన్నారన్న విషయాన్ని అస్సలు వెల్లడించడంలేదు. ఎందుకంటే పుతిన్‌ ప్రధాన లక్ష్యాల్లో ఒకటైన 'అజోవ్‌ రెజిమెంట్‌'కూడా ఈ ఉక్కు కర్మాగారంలోనే ఉంది. ఒకప్పుడు అజోవ్‌ రెజిమెంట్‌ వ్యవస్థాపకుడు ఆండ్రీ బిలెన్స్కీ  ఈ కర్మాగారాన్ని తమ దళానికి కోటగా అభివర్ణించాడు. ఇక గురువారం పుతిన్‌ ప్రకటనను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు అజోవ్‌స్తల్‌ను రష్యా దళాలు స్వాధీనం చేసుకోలేకపోయాయన్నారు. మరోపక్క ఈ  స్టీల్‌ ప్లాంట్‌లో ఉన్న దళాలు ఆయుధాలు, ఆహారం, ఔషధాల కొరతను ఎదుర్కొంటున్నట్లు పలు వీడియోలు బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అజోవ్‌స్తల్‌ బయట వేచి ఉన్న రష్యా దళాలు ఫ్యాక్టరీని పూర్తిగా చుట్టుముట్టి విజయం కోసం వేచి చూస్తున్నాయి.  మే9న మాస్కో సేనలు.. నాజీ జర్మనీపై సాధించిన విజయానికి గుర్తుగా 'విక్టరీడే' జరుపుకొంటాయి. నాటి కల్లా పుతిన్‌ నియోనాజీలుగా అభివర్ణించిన అజోవ్‌ రెజిమెంట్‌ను ఓడించాలన్నది రష్యా లక్ష్యంగా కనిపిస్తోంది.

ఫైటర్లు ఎవరు..?అజోవ్‌స్తల్‌ స్టీల్‌ ప్లాంట్‌లోపల 36వ మెరైన్‌ బ్రిగేడ్‌ సైనికులు ఉన్నారు. బుధవారం దీని కమాండర్‌ మేజర్‌ షెర్హీవ్‌ వోల్యన్‌. తమ దళాలు ఏమాత్రం లొంగిపోవని పేర్కొన్నారు. కానీ, తమ వద్ద గాయపడిన 500 మంది సైనికులకు సాయం అందజేయాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరారు. దీంతోపాటు వందల మంది పిల్లలు, మహిళలు ఈ ప్లాంట్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఉక్రెయిన్‌ తరపున మేరియుపొల్‌ రక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న అడెన్‌ అస్లైన్‌, సహున్‌ పిన్నర్‌లను గత వారం రష్యా దళాలు అదుపులోకి తీసుకొన్నాయి. వీరుకూడా ఈ బ్రిగేడ్‌లోని సభ్యులే.  

అజోవ్‌ బ్రిగేడ్‌ కూడా ఇక్కడే..ఈ స్టీల్‌ ప్లాంట్‌లో మిగిలిన మరో దళం అజోవ్‌ బ్రిగేడ్‌. ఈ బ్రిగేడ్‌ను అజోవ్‌ సముద్రం పేరుతో ఏర్పాటు చేశారు. వీరిని పుతిన్‌ నియో నాజీలుగా అభివర్ణించారు. దాదాపు 900 మంది అతివాదులు దీనిలో ఉన్నారు. మెరైన్‌ బ్రిగేడ్‌ బృందం గత వారం నుంచి వీరితో కలిసి  రష్యాపై పోరు జరుపుతోంది.
Tags:    

Similar News