జీవో-1 కొంత అతి..మ‌రింత డ్యామేజీ!

Update: 2023-01-13 04:30 GMT
ఏపీ ప్ర‌భుత్వం ఈ ఏడాది ఆదిలోనే అత్యుత్సాహంతో తీసుకువ‌చ్చిన జీవో 1/2023 మ‌రోసారి హైకోర్టు ముందు నిల‌వ‌లేక‌పోయింది. ఈ జీవోను తాత్కాలికంగా స‌స్పెండ్ చేస్తూ.. హైకోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది. అయితే..ఈ సంద‌ర్భంగా కోర్టు చేసిన వ్యాఖ్య‌లు.. ప్ర‌భుత్వ తీరును తీవ్రంగా త‌ప్పుబ‌ట్టాయి. 1861 నాటి బ్రిటీష్ చ‌ట్టం ప్ర‌కారం.. దీనిని తీసుకువ‌చ్చామ‌న్న‌. ప్ర‌భుత్వ వాద‌న‌ను హైకోర్టు మ‌రింత‌గా దునుమాడింది.

ఇదే చ‌ట్టాన్ని బ్రిటీష‌ర్లు కూడా అనుస‌రించలేదుక‌దా.. అలా అనుస‌రించి ఉంటే దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చి ఉండేదా?  అని నిల‌దీసింది. ఇది నిజంగానే ప్ర‌భుత్వాన్ని.. స‌ర్కారును స‌మ‌ర్ధిస్తున్న‌వారిని కూడా డిఫెన్స్‌లో ప‌డేసింది.

అయితే.. ఇక్క‌డ అస‌లు ఏం జ‌రిగింది?  ఈ జీవో రావ‌డం .. వెనుక అస‌లు ఎవ‌రి పాత్ర ఉందనేది చ‌ర్చ‌కు వ‌చ్చింది. సీఎం జ‌గ‌న్ మెప్పు పొందాల‌నే ఉద్దేశంతోనే.. లేక ఆయ‌న క‌రుణ కోసం త‌పిస్తున్న‌వారి అత్యుత్సాహం వ‌ల్లో ఈ జీవో పురుడు పోసుకుంద‌నేది స్ప‌ష్టం అవుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

నిజానికి అటు కేంద్రప్రభుత్వం బూజు ప‌ట్టిన పాత చ‌ట్టాల‌ను తొల‌గిస్తోంది. అదేస‌మ‌యంలో క‌ఠిన నిబం ధ‌న‌లు ప్ర‌జ‌ల‌కు నిరుప‌యోగంగా, వారి స్వేచ్ఛ‌కు, రాజ్యాంగ హ‌క్కుల‌కు భంగం క‌లిగిస్తున్న చ‌ట్టాల‌ను గుండుగుత్తుగా ఏరేస్తోంది.

ఇలాంటి కీల‌క  స‌మ‌యంలో బ్రిటీష్ రాజ్ నాటి చ‌ట్టానికి దుమ్ముదులిపి.. కొత్త జీవో ఇవ్వ‌డం ద్వారా.. ప్ర‌భుత్వం ల‌క్ష్యం మంచిదే అయినా.. విమ‌ర్శ‌ల‌కు.. నిల‌వ‌డ‌మే కాకుండా.. న్యాయ‌వ్య‌వ‌స్థ ముందు చేతులు క‌ట్టుకునే ప‌రిస్థితి వ‌చ్చింది.

జ‌గ‌న్ సానుకూల దృక్కుల కోసం.. కొంద‌రు చేస్తున్న అతి.. ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శ‌ల పాల్జేస్తోంది. గ‌తంలో నూ ప్ర‌భుత్వ కార్యాల‌యాలు, వాహ‌నాల‌కు వైసీపీ జెండా రంగుల విష‌యంలో స‌ర్కారు లేనిపోని అవ‌మానాలు ఎదుర్కొన్నది.  ఆ ప‌రిణామాల నేప‌థ్యంలో అయినా..జీవో 1/2023 విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకుని.. స‌రైన విధానాలు రూపొందించి ఉంటే.. బాగుండేద‌నే అభిప్రాయం వ్య‌క్తమ‌వుతోంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News