వాటే బీజేపీ గేమ్...?

Update: 2022-06-11 14:30 GMT
దేశంలో రెండుసార్లు మోడీ నాయకత్వంలో బీజేపీకి కేంద్రంలో పూర్తి మెజారిటీ వచ్చింది. ఈ రెండు సార్ల పాల‌నలో బీజేపీ దేశ ప్రజలకు ఎనభై లక్షల కోట్ల రూపాయల అప్పును మిగిలించింది కానీ  ఒక్క కొత్త ప్రాజెక్టుని కూడా తీసుకురాలేకపోయింది అని మేధావులు అంటున్నారు. ఇక బీజేపీ ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలూ తప్పులు కాబట్టే ఈ రోజు దేశంలో డాలర్ కి రూపాయి విలువ  77.80 పైసలుగా తగ్గిపోయింది. మరి ఈ రకంగా లెక్కలు ఉంటే బీజేపీది  ఏమి ప్రభుత్వమని, ఏమి పాలన చేస్తోంది అని ఎవరైనా అనుకుంటే పొరపాటు ఉంటుందా అన్నదే ప్రశ్న.

ఇక కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ రోజుల్లో సోనియా గాంధీ హయాంలో సీబీఐ ఈడీలను ప్రయోగించిందని కాంగ్రెస్ తన ఎన్నికల ప్రచారంలో చెప్పుకుంటూ వచ్చింది. అధికార దుర్వినియోగం చేస్తూ రాజకీయ స్వార్ధ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ నాడు వ్యవస్థలను తనకు అనుకూలంగా మార్చుకుందని కూడా ఆరోపిస్తూ వచ్చింది. ఇక ఆంధ్రాలో జగన్ అరెస్ట్ తరువాత అప్పట్లో అది అతి పెద్ద ప్రచారంగా దేశవ్యాప్తంగా కూడా మారుమోగింది.

ఒక విధంగా చూస్తే అది బీజేపీకి రాజకీయంగా లాభం చేసింది అని చెప్పాలి. ఇక దేశంలో ఇప్పటికి వరసగా రెండు సార్లు బీజేపీ అధికారంలోకి వచ్చినా కూడా కాంగ్రెస్ కి ఒక్కసారి కూడా అధికారం ఇవ్వాలని అంటున్న వారు ఈ నాటికీ లేరు అంటే దానికి కారణం బలమైన నాయకత్వం కాంగ్రెస్ కి లేకపోవడమే.

ఈ నేపధ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను తగ్గించుకునేందుకు హిందూత్వ కార్డుని మరోమారు విరివిగా వాడేసేందుకు బీజేపీ రెడీ అవుతోంది అని అంటున్నారు. హిందువులు అంతా ఒక వైపునకు వచ్చి బీజేపీకి ఓటు వేసే విధంగా రాజకీయాన్ని టర్న్ చేయాలన్నది బీజేపీ ఆలోచనగా ఉంది. ఇక నుపూర్ శర్మ, నవీన్ కుమార్ లను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం అనే ఎపిసోడ్ లో ఇంతదాకా ప్రధాని నరేంద్ర మోడీ కానీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కానీ ఈ తీవ్రమైన  ఇష్యూ మీద ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం నిజంగా రాజకీయంగా ఆలోచించాల్సిన విషయంగానే భావిస్తున్నారు.

అంటే బీజేపీ నేతలను సస్పెండ్ అయితే చేశారు అంటే అది కేవలం నామమత్రమేనా అన్న మాట కూడా వినిపిస్తోంది.  ఇంత పెద్ద ఇష్యూ జరిగాక బాధ్యత గలిగిన ఇద్దరు నాయకులు అంతలా మాట విసిరేసి ఒక వర్గం మీద అగ్గి రాజేశాక కూడా కేంద్ర పెద్దలు బీజేపీ పెద్దలు మాట్లాడం కానీ ఖండించకపోవడం కానీ చేయలేదు అంటే ఇది బీజేపీ గేమ్ ప్లాన్ లో భాగమా అని అంటున్న వారూ ఉన్నారు.

ఇది నిజంగా బీజేపీ రాజకీయ క్రీడలో భాగమే అని మేధావులు కూడా అనుమానిస్తున్నారు. ఇక ఒక వైపు చూస్తే దేశంలో నానాటికీ రూపాయి విలువ దారుణంగా పడిపోతోంది, ఇంకో వైపు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వడ్డీల రేట్లు పెంచేస్తున్నారు. నిత్యావసరాల ధరలు కూడా పెంచేస్తున్నారు. ఇక చూస్తే ఉపాధి అవకాశాలు లేకపోవడం వంటివి జరుగుతున్నాయి.

అదే విధంగా చూస్తే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ ల నుంచి తెలంగాణాకు ఢిల్లీకి విపరీతంగా వలసలు పెరిగిపోతున్నాయి. ఇవన్నీ చూస్తూంటే రాబోయే రోజులలో బీజేపీకి ఎదురీత తప్పదు అన్న బెంగ భయాలతోనే ఆ పార్టీ నేతలు విపరేత వ్యాఖ్యలు చేస్తున్నారా అన్న డౌట్లు వస్తున్నాయి. దేశంలో అన్ని సమస్యలకు ఒక్కటే మంత్ర అదే హిందూత్వ మంత్ర అన్న దాన్నే నమ్ముకుని బీజేపీ ఈ రోజు ఈ రకమైన రాజకీయ క్రీడలకు తెర తీసిందా అన్న చర్చ అయితే సాగుతోంది.

అయితే సమస్యను సమస్యగా చూసి పరిష్కరించాల్సి ఉంటుంది. ఒక సమస్యకు మరో సమస్య  ఎపుడూ పరిష్కారం కాదు, రాజకీయాల్లో పెద్ద గీతలు గీసి చిన్న గీతను తగ్గించాలనుకుంటే కొన్ని సార్లు విజయం దక్కినా అది పులి మీద స్వారీగానే అవుతుంది. పైగా మతం కార్డు తో అన్ని సార్లు సక్సెస్ అవుతారని ఎవరైనా అనుకుంటే అంతకంటే పొరపాటు ఉండదని అంటున్నారు.
Tags:    

Similar News