బీజేపీలో ఆధిపత్య పోరుందా..?: ఎమ్మెల్యే రఘునందన్ రావు ఏమన్నారు..?

Update: 2022-06-27 08:30 GMT
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో దాదాపుగా బీజేపీ జెండా రెపరెపలాడుతోంది. ఈ తరుణంలో దక్షిణాది వైపు కమలనం నాయకులు దృష్టి పెట్టారు. సౌత్ లో కర్ణాటకలో మాత్రమే అధికారంలో ఉన్న బీజేపీకి ఇప్పుడు తెలంగాణను చేజిక్కించుకోవడానికి తహతహలాడుతోంది. ఇందు కోసం మోదీ, షాలు  పదే పదే పర్యటనలు చేస్తూ కేడర్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం అని చెబుతూ నాయకుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. తెలంగాణ రాష్ట్ర నాయకులు సైతం అంతే దూకుడుతో ప్రజల్లోకి వెళుతున్నారు.

అయితే తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కొందరు నాయకులతో విభేదాలున్నాయని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యే కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీల్లో ఎలాంటి విభేదాలు లేవని అన్నారు. కానీ ‘నిప్పులేనిదే పొగరాదుగా..’ అని కొందరు ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారు.

తెలంగాణలో ప్రస్తుతం టీఆర్ఎస్ అధికారంలో ఉంది. సార్వత్రిక ఎన్నికలకు కొద్ది నెలలే సమయం ఉండడంతో బీజేపీ స్పీడు పెంచింది. పాదయాత్రలు, తదితర కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళుతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపుతూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.  మిగతా పార్టీల్లోలాగా తమ పార్టీల్లో ఎలాంటి గ్రూపు విభేదాలు లేవని, అంతా కలిసే పనిచేస్తామని బీజేపీ నాయకులు పలు సందర్బాల్లో పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు , ఎమ్మెల్యే రఘునందన రావుకు పొసగడం లేదని కొన్ని వార్తలు వెలువడుతున్నాయి. వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోందని అంటున్నారు.

అయితే ఈ వార్తలపై ఎమ్మెల్యే రఘునందన్ రావు స్పందించారు. తమ పార్టీలో ఎలాంటి  ఆధిపత్య పోరు లేదని స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్షుడి ఆదేశాలనుశారం నడుచుకుంటామని అన్నారు. బీజేపీలో మొదటి నుంచి ఉన్నవాళ్లకు మాత్రమే పదవులు ఉంటాయని కొందరు అంటున్నారని, అలాంటిదేమీ లేదని అన్నారు.

ఈరోజు పార్టీలో చేరి రేపే పదవి కావాలంటే ఏ పార్టీలో కుదరన్నారు. అంతకుముందు తెలంగాణ కోసం టీఆర్ఎస్ లో పనిచేశానని, ఇప్పుడు దేశం కోసం పనిచేయడానికి తనకు బీజేపీలో అవకాశం ఇచ్చారని అన్నారు.  ఆధిపత్య పోరుపై వస్తున్న వార్తలు అవాస్తవని, అయితే కొన్ని విషయాల్లో కమ్యూనికేషన్ గ్యాప్ ఉండడం నిజమేనన్నారు.

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆధిపత్య పోరుపై స్పష్టత ఇచ్చినా ‘నిప్పు లేనిదే పొగ రాదు’ అని కొందరు వాపోతున్నారు. ఎందుకంటే గతంలో పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తమను పట్టించుకోవడం లేదని ఆయన సొంత నియోజకవర్గం కరీంనగర్ నుంచే అసమ్మతి రాగం వినిపించింది. ఆ పార్టీకి చెందిన కొందరు సీనియర్ నాయకులు ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి నిరసన తెలిపారు. అయితే ఆధిష్టాన పెద్దలు జోక్యం చేసుకోవడంతో ఈ సమస్య తగ్గిందనుకున్నారు.

ఈ తరుణంలో ఇప్పుడు ఎమ్మెల్యే రఘునందన్ రావు విషయంలో మరోసారి వార్తలు గుప్పుమంటున్నారు. కొన్ని నెలల నుంచి రఘునందన్ రావు పార్టీ మారుతారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా అధ్యక్షుడు బండి సంజయ్ తోనే ఆయనకు విభేదాలున్నాయని అంటున్నారు. కానీ ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలతో క్లారిటీ వచ్చినా ఎన్నికల సమయానికి పరిస్థితి ఎలా ఉంటుందోనని పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది.
Tags:    

Similar News