మునుగోడులో ప్రచారం ముగిసింది.. ఇక పంచుడే మిగిలింది!

Update: 2022-11-02 06:23 GMT
మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారం నిన్న సాయంత్రం 6 గంటల వరకే ముగిసింది. అధికార టీఆర్ఎస్ నుంచి మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు ర్యాలీలు, రోడ్ షోలతో హోరెత్తించారు. ఇక బీజేపీ నుంచి బండి సంజయ్ , ఈటెల రాజేందర్ లు చివరి రోజు గట్టిగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా క్లాష్ వచ్చి ఎదురుపడి ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ కార్యకర్తల రాళ్లదాడి జరిగింది. ప్రచారం సాయంత్రం ముగియడంతో మునుగోడుకు సంబంధం లేని నేతలంతా ఆ నియోజకవర్గాలను ఖాళీ చేయాలని ఎన్నికల అధికారులు హుకూం జారీ చేశారు. లాడ్జీలు, హోటల్స్ తనిఖీ చేసి మరీ వారిని పంపించివేశారు.

నిన్న సాయంత్రం ప్రచారం ముగియడంతో ఇక డబ్బుల పంపిణీ మొదలైంది. డబ్బుల పంపిణీ రాత్రంతా కొనసాగింది. ప్రధాన రాజకీయ పార్టీల నేతలంతా ఇదే మందు, విందులు, డబ్బులు, గిఫ్ట్ ల పంపిణీలో మునిగిపోయారు.

ఒక పార్టీ తాజాగా మునుగోడులో ఓటుకు రూ.3వేలు, క్వార్టర్ మద్యం పంపిణీ చేసినట్టు తెలిసింది. ఇక మరో పార్టీ ఓటుకు రూ.4వేలు చొప్పున ఇచ్చినట్టు పలు గ్రామాల్లో టాక్ నడుస్తోంది. మొదట రూ.3వేలు పంచిన ఒక పార్టీ మళ్లీ ఈఱోజు రెండో దఫా కూడా ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.

నియోజకవర్గానికి బయట ఉన్న హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారిని వాహనాల్లో డబ్బులు, ప్రత్యేక ఏర్పాట్లు చేసి మరీ రప్పిస్తున్నారు. ఒక్కో ఓటుకు రూ.5వేల నుంచి రూ.10వేల వరకూ కొన్ని పార్టీలు వెచ్చిస్తున్నారు. ఇక ఎక్కువ ఓట్లు ఉన్న కుటుంబాలకు బంగారం కూడా ఇస్తున్నారని ప్రచారం సాగుతోంది.

ప్రధానంగా మునుగోడులో రెండు పార్టీల నుంచి డబ్బులు అందాయని ప్రజలు ఆఫ్ ది రికార్డ్ గా చెబుతున్నారు. ఓట్ల కోసం కోట్ల రూపాయలు రాత్రికి రాత్రి పంచుతున్నారని ప్రచారం సాగుతోంది. డబ్బు, మద్యం పంపిణీ యథేచ్ఛగా విచ్చలవిడిగా పంచుతున్నారని తెలుస్తోంది.

సోమవారం రాత్రి నుంచి పంపకాలు మొదలుపెట్టిన ఒక పార్టీ మంగళవారం పొద్దుపోయే వరకూ దాదాపు పంపిణీ లక్ష్యం పూర్తి చేశారట.. ప్రత్యర్థి పార్టీల పంపకాలు చేయకుండా కట్టడి చేస్తూ వ్యూహాలు పన్నుతున్నారట.. తమ ఓటర్ల వద్దకు మిగతా ప్రత్యర్థి ప్రత్యర్థులు రాకుండా శ్రేణులతో కలిసి గ్రామాల్లో తిష్ట వేస్తున్నట్టు సమాచారం.

ఇక ర్యాలీలు, రోడ్ షోలకు వచ్చిన జనాలకు రూ.500 డబ్బుతోపాటు లీటర్ పెట్రోల్, బిర్యానీ ప్యాకెట్ ఇచ్చినట్టు సమాచారం. ఇంత భారీగా పంచినా కూడా ఓటు ఎటువైపు వేస్తారు? ఎవరిని గెలిపిస్తారన్నది మాత్రం గుంభనంగా ఉంది. రేపు తర్వాత గెలుపు ఎవరిదన్నది తేలే అవకాశం ఉంది. ఎగ్జిట్ పోల్స్ తో అంచనా బయటపడవచ్చు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News