మోడీ సారూ.. మీరు జగన్ మాదిరి లేట్ చేస్తే ఎలా?

Update: 2022-05-10 07:56 GMT
తియ్యటి మాటలు విన్నప్పుడు కలిగే సంతోషం.. ఆనందం అంతా ఇంతా కాదు. భవిష్యత్తులో జరిగే వాటి గురించి వర్తమానంలో చెప్పినా.. బోలెడంత హ్యాపీగా ఉంటుంది. ఆ తియ్యటి మాటలు చేతల్లోకి వచ్చేసరికి ఎంత ఆలస్యమవుతుందన్న విషయం అర్థమయ్యే కొద్దీ ఆవేశం..ఆగ్రహం తన్నుకొస్తూ ఉంటుంది.

ఏపీలో జగన్ సర్కారు మాదిరే కేంద్రంలోని మోడీ సర్కారు తయారైందన్న మాట లబ్థిదారుల నోటి నుంచి వస్తోంది. పీఎం కిసాన్ 11వ విడత డబ్బులు విడుదల కావాల్సిన దాని కంటే ఆలస్యమవుతుందన్న ఆగ్రహం రైతుల్లో కలుగుతోంది.

2022 జనవరి 1న ప్రధానమంత్రి కిసాన్ పదో విడత నిధులను కేంద్రం  విడుదల చేసింది. అనంతరం రెండో విడత నిధుల్ని ఏప్రిల్ లో విడుదల చేయాల్సి ఉంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ.2వేల చొప్పున ప్రతి ఏడాది రూ.6 వేలను రైతుల ఖాతాల్లో జమ చేస్తుంటారు. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ లో విడుదల కావాల్సిన రూ.2 వేల మొత్తం మే మధ్యలోకి వస్తున్నా ఇప్పటికి విడుదల కాలేదు.

ఇలాంటి వేళ.. రైతుల కంగుతినే మాటను అధికారులు చెబుతున్నారు. దాని ప్రకారం పీఎం కిసాన్ ఈకేవైసీను నిర్వహించటానికి మే 31 చివరి తేదీగా చెబుతున్నారు. ఒకవేళ ఈ కేవైసీ లేకుంటే తదుపరి విడత సొమ్ము రైతు ఖాతాలోకి పడటం అనుమానమనే చెబుతున్నారు.

పీఎం కిసాన్ పథకానికి ఈ కేవైసీని తప్పనిసరి చేశారు. దీనికి మే 31 చివరి తేదీగా నిర్ణయించారు. సరిగ్గా రైతుల చేతికి డబ్బులు అందే సమయంలో ఈ కేవైసీ.. లాంటి మాటలు చెప్పి ఆలస్యం చేయటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

ఒకవేళ ఈకేవైసీ తప్పనిసరి అయినప్పడు.. దానికి తగినంత సమయం ఇవ్వాలి. అంతవరకు ఎప్పటిలానే రైతుల ఖాతాలో నిధులు వారికి ఇవ్వాల్సిన మొత్తాన్ని క్రెడిట్ చేస్తే సరిపోతుందంటున్నారు. ఇప్పటికే రైతులతో పాటు వివిధ వర్గాలకు అందించాల్సిన పథకాల సొమ్ము కోసం ఏపీ ప్రభుత్వం ఆలస్యం చేస్తున్న తరహాలోనే మోడీ సర్కారు అడుగులు వేయటం ఏమిటో?
Tags:    

Similar News