కళ్లు బైర్లు కమ్మే ఐఫోన్ రేట్ల వెనుక చేదునిజం ఇదే!

Update: 2022-09-09 05:25 GMT
కొనాలనిపిస్తుంది కానీ కొనలేని పరిస్థితి కొన్నింటి విషయాల్లో ఉంటుంది. అంత ఇష్టమైనవి ఏదోలా చేసి కొనేయాలని అనుకున్నా సాధ్యం కాని వాటిల్లో ఐఫోన్ ఒకటి. నెలకు రూ.లక్ష సంపాదించే వారు సైతం ఎప్పటికప్పుడు మారే ఐఫోన్ ను కొనుగోలు చేయటం తాహతుకు మించిందే అవుతుంది. దీని కారణం.. దీని ధరే. విన్నంతనే కళ్లు బైర్లు కమ్మేలా ఉండే.. ఈ ధరను చూసిన తర్వాత.. అంత మొత్తాన్ని ఫోన్ కు పెట్టాలనిపించదు.

తాజాగా మార్కెట్లోకి విడుదల కానున్న ఐఫోన్ 14 ధరలు ఎప్పటిలానే వామ్మో అనేలా ఉన్నాయి. మరో అడుగు ముందుకేసి.. కళ్లు బైర్లు కమ్మే పరిస్థితి. దీనికి కారణం వాటి ధరలే. ఐఫోన్ 14 సిరీస్ లో ప్రొ.. నాన్ ప్రో మోడళ్ల విషయానికి వస్తే.. నాన్ ప్రో మోడళ్ల ధరలు కాస్త కొనే పరిధిలో ఉన్నాయని చెప్పాలి. కానీ.. ప్రో మోడళ్లు మాత్రం విన్నంతనే గుండె గుభేల్ అనేలా ఉన్నాయని చెప్పాలి. ప్రోమోడల్స్ ధరలు రూ.10 వేల చొప్పున కంపెనీనే పెంచింది.

ఐఫోన్ 14 సిరీస్ లో ఎంట్రీ లెవల్ ఫోన్ ధర మన దేశంలో రూ.79,900గా ఉంటే.. అమెరికా మార్కెట్ లో ఇదే ఫోన్ ధర 829 డాలర్లుగా ఉంది. దానికి టాక్సులు అదనం. అంటే.. మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.66వేలు. మరి.. మనకు.. అమెరికాకు మధ్య దగ్గర దగ్గర రూ.14వేల వరకు ధర వత్యాసం ఎందుకు ఉంది? అన్న ప్రశ్న వేసుకుంటే.. మన దేశంలో వడ్డించే పన్నులే ఇందుకు కారణంగా చెప్పాలి.

ఐఫోన్ 14 మోడల్స్ ను విదేశాల నుంచి భారత్ కు దిగుమతి చేసుకోవాల్సిందే. అందుకు మన దేశంలోని పన్నులతో పాటు.. సుంకాలు అదనంగా తోడై.. వాచిపోయే ధరకు చేరే పరిస్థితి. అమెరికాలోనూ రాష్ట్రాల వారీగా పన్నుల ధరలు ఉంటాయి. మన దేశంలో మాదిరి ఒక దేశం ఒక పన్ను లాంటివి లేవనే చెప్పాలి. ఐఫోన్ 14 ధర రూ.79,900 ఉంటే.. అందులో రూ.12,788 వరకు జీఎస్టీనే ఉండటం గమనార్హం.

ఇక.. ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ రిటైల్ ధర రూ.1,39,900లు ఉంటే అందులో సుంకాలు.. పన్నులే రూ.42వేలకు పైనే ఉన్నట్లుగా లెక్కలు వేసి చెబుతున్నారు. అదే.. ఐఫోన్ 14ను మన దేశంలోనే తయారు చేసి ఉంటే.. సుంకాల పోటు లేకుండా ఉండేది.

మనసుకు నచ్చిన ఐఫోన్ 14ను సొంతం చేసుకోవాలంటే పన్నులు భారీగా కట్టి.. లకారాలు సమర్పించే బ్యాచ్ కు తప్పించి.. ఎగువ మధ్యతరగతి జీవికి సైతం ఐఫోన్ అందని ద్రాక్షనే బాస్.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News