మోడీ అస‌లు రూపం చూపించిన మాజీ మిత్రుడు

Update: 2018-12-11 04:11 GMT
అనూహ్య రీతిలో బీహార్‌ కు చెందిన రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ అధినేత ఉపేంద్ర కుష్వాహా త‌న మంత్రి ప‌ద‌వికి గుడ్ బై చెప్పిన సంగ‌తి తెలిసిందే. కేంద్ర మానవ వనరుల శాఖామంత్రిగా ఉన్న ఉపేంద్ర కుష్వాహా తన మంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ వ‌చ్చే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో.. త‌మ పార్టీతో సీట్ల పంప‌కం స‌రిగా జ‌ర‌గ‌లేద‌ని ఆయ‌న ఆరోపించారు. అయిదేళ్ల క్రితం ఎన్డీఏలో క‌లిశామ‌ని - ఎన్నో ఆశ‌ల‌తో చేరామ‌ని - బీహార్ ప్ర‌జ‌ల‌కు ఎన్నో హామీలు ఇచ్చారు - కానీ వాటిని అమ‌లు చేయ‌లేక‌పోయార‌ని మీడియాతో వ్యాఖ్యానించారు.

విలేక‌రుల స‌మావేశానికి తోడుగా  ప్రధాని మోడీకి ఓ లేఖను కూడా రాశారు. కుష్వాహా రాసిన లేఖలో తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో తాను పూర్తిగా మోసపోయాననీ..రాజ్యాంగ బద్ధంగా నిర్వహించాల్సిన విధులను కూడా వ్యవస్థను మోదీ నాశనం చేస్తున్నారంటూ తీవ్రంగా విమర్శించారు. కేబినెట్ ను రబ్బర్ స్టాంప్ స్థాయికి దిగజారనీ..మంత్రులు సొంత నిర్ణయాలు తీసుకోకుండా కట్టడి చేస్తు..ప్రధాని మోడీ తన నిర్ణయాలను మాత్రమే అమలు చేసేలా చేశారనీ..మంత్రులు - ఉన్నతాధికారులను నిస్సహాయులుగా మోడీ మార్చేశారని ఉపేంద్ర తన లెటర్ లో పేర్కొన్నారు.  అన్ని నిర్ణయాలను ప్రధాని, ప్రధాని కార్యాలయమే నిర్ణయిస్తుందనీ..ఈ నిర్ణయాలలో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ప్రధానంగా ఉంటారని..పేదలు - అణగారిన వర్గాల కోసం కాకుండా ప్రత్యర్థులను నిర్వీర్యం చేయడం కోసమే పని చేస్తున్నారని ప్రధానికి రాసిన లేఖలో కుష్వాహా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

బీహార్‌ లోని రాష్ట్రీయ లోక్ స‌మ‌తా పార్టీకి చెందిన ఉపేంద్ర మోడీ ప్ర‌భుత్వ వ్య‌వ‌హార‌శైలిపై గ‌త కొంత‌కాలంగా ఆగ్ర‌హంతో ఉన్నారు. డిసెంబర్ 10 ఉదయం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో సమావేశమైన తర్వాత ఆయన తన రాజీనామా లేఖను ప్రధాని మోడీకి పంపించారు. అనంతరం ప్రధాని మోదీకి రాసిన లేఖలో పలు ఘాటు విమర్శలను కుష్వాహా సంధించారు.  మరోవైపు, జాతీయ స్థాయిలో ఏర్పాటు కాబోతున్న మహాకూటమిలో ఆయన చేరే అవకాశం ఉంది. బీజేపీయేతర పక్షాలు సోమవారం ఢిల్లీలో సమావేశం నిర్వహించగా - దానికి ఉపేంద్ర హాజ‌ర‌య్యారు.


Tags:    

Similar News