ఐఎస్ ఐఎస్ః అస‌లోడి క‌థ తేలింది

Update: 2015-11-13 06:39 GMT
ఐఎస్ ఐఎస్..ఈ పేరు వింటే చాలు ప్ర‌పంచం వ‌ణికిపోతోంది. అత్యంత రాక్ష‌స‌త్వానికి పెట్టింది పేరు అయిన ఈ ఇస్లాం తీవ్ర‌వాదులు చేసే దుశ్చ‌ర్య‌లు ఒళ్లు గ‌గుర్పొడిచే విధంగా ఉంటాయి. మ‌నుషులా పశువులా అన్నట్లుగా ప్రవర్తిస్తూ అత్యంత క్రూరంగా ప్రాణాలు తీసుకోవడంలో ఐఎస్ ఐఎస్ పెట్టింది పేరు. ఇటీవ‌లే 200 మంది ముస్లిం చిన్నారుల‌ను కూడా పొట్ట‌న‌పెట్టుకున్నారు. ఇంత క్రూరంగా వ్య‌వ‌హరించే ఐఎస్ ఐఎస్ లో అస‌లు రాక్ష‌సుడి అంతు తేల్చే ఆప‌రేష‌న్ స్టార్ట‌యింది. ఏంటి నిజ‌మా? ఎవ‌రు మొద‌లుపెట్టారు అనుకుంటున్నారా? ఇంకెవ్వ‌రూ ప్ర‌పంచ‌ పెద్ద‌న్న అమెరికానే.

కువైట్ లో జన్మించిన మ‌హ్మ‌ద్‌ ఎమ్వాజీ లండన్ లో కంప్యూటర్ ప్రోగ్రామర్. అయితే జీహాద్‌ పై పిచ్చి పుట్టి ఐఎస్ ఐఎస్‌ లో చేరిపోయాడు. ఈ క్ర‌మంలో త‌న పేరు కూడా జీహాదీ జాన్‌ గా మార్చేసుకొని ప్రపంచంలోనే  అతి క్రూరమైన ఉగ్రవాదిగా మారాడు. ఐఎస్ ఐఎస్ క్రూరంగా చంపే కార్య‌క్ర‌మాల్లో జిహాదీ జాన్ ఒక దేశం అని కాకుండా అన్ని దేశాలకు చెందిన బందీలను పశువులను వధించినట్లు వధించాడు. వీడెంత రాక్ష‌సుడో తెలుసుకునేందుకు ఇలాంటి ఉదాహ‌ర‌ణ‌లు ఎన్నో ఉన్నాయి.

అయితే వీడి అంతు చూసేందుకు అమెరికా మిలటరీ సేనలు దాడులు మొద‌లెట్టాయి. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ప్రభావం అధికంగా ఉండే రఖా అనే ప్రాంతంలో జిహాదీ జాన్ ఉన్నట్లుగా భావించి ఆయా ప్రాంతాల్లో అమెరికా వైమానిక సంస్థ దాడులు జరిపింది. అయితే, ఈ దాడుల్లో జీహాదీ జాన్ చనిపోయాడా లేదా అనే విషయంపై మాత్రం అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

అమెరికా ర‌క్ష‌ణ అత్యున్న‌త సంస్థ పెంటాగ‌న్ దీనిపై స్పందిస్తూ...దాడులు జ‌రిపింది నిజ‌మేన‌ని తెలిపింది. జిహాదీ జాన్ మృతిపై ఇంకా వివరాలు తెలియలేద‌ని పరిస్థితిని స‌మీక్షిస్తున్నామ‌ని వివ‌రించింది. జాన్ మృతిపై త‌మ‌కు స‌మాచారం వ‌చ్చిన వెంట‌నే ప్ర‌పంచానికి తాము స‌మాచారం ఇస్తామ‌న్నారు.
Tags:    

Similar News