గ్రీన్‌ కార్డ్‌ - హెచ్‌1బీ...అమెరికా తాజా దుర్వార్త‌

Update: 2018-09-13 16:47 GMT
అగ్రరాజ్యంలో ఉద్యోగం చేయాలని కలలు గనే విదేశీయుల‌ను ప్ర‌ధానంగా భార‌తీయుల‌ను ఇబ్బందిపెట్టే విధాన నిర్ణయాలు తాజాగా అమల్లోకి వచ్చాయి. ఆగస్టు 9 నుంచి ఈ కొత్త కఠినతరమైన ని‘బంధనాలు’ అమలు చేయాలని అమెరికా పౌరసత్వం - వలసవాదుల సేవలు(యూఎస్‌ సీఐఎస్‌) ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణ‌యం అటు గ్రీన్‌ కార్డ్‌ దారుల‌కు మ‌రోవైపు హెచ్‌1బీ వీసాదారుల‌కు షాక్‌ గా మార‌నుంది. ఈ ప్ర‌కారం వీసా ద‌ర‌ఖాస్తులో కొన్ని త‌ప్పులు దొర్లినా వారిపై చ‌ర్య‌లు తీసుకోనున్నారు. అయితే ఈ నిబంధ‌న‌లు విజిటింగ్ వీసాలు - వ్యాపార‌వేత్త‌ల వీసాల విష‌యంలో వ‌ర్తించ‌ద‌ని తెలిపింది.

ప్రపంచంలోనే అత్యంత వృత్తి నిపుణులుగా ఖ్యాతి పొందుతున్న భారతీయులు ప్రధానంగా హెచ్-1బీ వర్క్ వీసాలతో అమెరికాకు వస్తున్నారు. 2016లో అమెరికా ప్రభుత్వం జారీచేసిన మొత్తం హెచ్-1బీ వీసాల్లో 74.2 శాతం వీసాలు భారతీయ ఐటీ నిపుణులే దక్కించుకున్నారు. 2017లో ఈ సంఖ్య మరింత పెరిగి 75.6 శాతానికి చేరుకుంది. అమెరికా పౌరసత్వ - వలస సేవల సంస్థ (యూఎస్‌ సీఐఎస్) ఈ మేర‌కు ఇటీవ‌ల గ‌ణాంకాలు వెల్ల‌డించింది. ఇంత భారీ స్థాయిలో ఉన్న వారి వెన్నులో వ‌ణుకుపుట్టేలా అమెరికా ఇమ్మిగ్రేషన్‌ డిపార్ట్‌ మెంట్ సెప్టెంబ‌ర్ 128న విడుద‌ల చేసిన పాలసీ మెమొరాండం మారింది. త‌ప్పుడు ప‌త్రాలు స‌మ‌ర్పించి గ్రీన్ కార్డ్ లేదా హెచ్‌1బీ ద్వారా అమెరికాలో నివ‌సిస్తున్న వారు త‌మ నివాసిత అర్హ‌త‌ను కోల్పోతార‌ని హిందూస్తాన్ టైమ్స్ క‌థ‌నం స్ప‌ష్టం చేసింది.

అమెరికా పౌరసత్వం - వలసవాదుల సేవలు(యూఎస్‌ సీఐఎస్‌) అధికార ప్ర‌తినిధి మైకెల్ బార్స్ స్పందిస్తూ వీసాల జారీ ప్ర‌క్రియ‌లో మ‌రింత పార‌ద‌ర్శ‌క‌త‌ను పెంపొందించేందుకు - నిజ‌మైన అర్హుల‌కు అవ‌కాశాలు క‌ల్పించేందుకు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించారు. గ‌తంలో రూపొందించిన నిబంధ‌న‌ల వ‌ల్ల అన‌ర్హుల‌కు అవ‌కాశం ద‌క్కింద‌నింద‌ని...దాన్ని తొల‌గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్న‌ట్లు వివ‌రించారు.అర్హుల‌కు వీసాల విష‌యంలో ఎలాంటి న‌ష్టం ఉండ‌ద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.
Tags:    

Similar News