గ్రీన్ కార్డ్ గుడ్ న్యూస్‌..ఇక నిరీక్ష‌ణ అక్క‌ర్లేదు!

Update: 2019-07-10 01:30 GMT
అగ్రరాజ్యం అమెరికా నుంచి ఊహించ‌ని తీపిక‌బురు. అమెరికా క‌ల‌ల‌ను నెర‌వేర్చుకోవ‌డంలో కీల‌క‌మైన గ్రీన్‌ కార్డ్ దారుల‌కు గ‌తంలో వ‌లే సుదీర్ఘ నిరీక్ష‌ణ లేకుండా...దేశానికి కొన్ని గ్రీన్‌కార్డులు మాత్ర‌మే కేటాయించడం అనే ప‌రిమితి తొల‌గించే బిల్లును ఆ దేశ చ‌ట్ట‌స‌భ‌ల్లో ప్ర‌వేశ‌పెట్టారు. రిప‌బ్లికన్లు మ‌రియు డెమోక్రాట్లు పెద్ద ఎత్తున మ‌ద్ద‌తు ఇస్తున్న నేప‌థ్యంలో...ఈ బిల్లు ఆమోదం పొంద‌డం సుల‌భ‌మేన‌ని భావిస్తున్నారు.

ప్రపంచంలోనే అత్యంత వృత్తి నిపుణులుగా ఖ్యాతిపొందుతున్న భారతీయులు ప్రధానంగా హెచ్-1బీ వర్క్ వీసాలతో అమెరికాకు వెళ్తున్నారు. అమెరికాలో గత ఏడాది నాటికి ఉపాధి ఆధారిత ప్రాధాన్య క్యాటగిరీలో దాదాపు 4 ల‌క్ష‌ల‌ మంది విదేశీయులు గ్రీన్‌ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారని - వీరిలో భారతీయులే 3,06,601 మంది ఉన్నారని యూఎస్‌ సీఐఎస్ వెల్లడించింది. ఈ జాబితాలో భారత్ తర్వాత చైనా 67,031 మందితో ద్వితీయ స్థానంలో ఉంది. ఇక మిగిలిన ఏ దేశానికి చెందిన వారు కూడా 10 వేల మందికి మించి లేరని యూఎస్‌ సీఐఎస్ వివరించింది. అమెరికాలో ప్రస్తుతమున్న చట్టం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో జారీచేసే మొత్తం గ్రీన్‌ కార్డుల్లో ఏ దేశానికి చెందిన వారికైనా 7 శాతం కంటే ఎక్కువ మంజూరు చేయడానికి వీల్లేదు. దీని వలన భారతీయులకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గ్రీన్‌ కార్డుల కోసం ఏళ్ల‌ తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. అయితే 7 శాతం పరిమితి నిబంధన వలన అమెరికాలో శాశ్వత నివాస హోదాను పొందేందుకు భారతీయులు సుదీర్ఘ కాలం పాటు (25 నుంచి 92 ఏళ్ల‌ వరకూ) నిరీక్షించాల్సి వస్తోందని కొద్దికాలం కింద‌ట వెలువ‌డిన ఓ నివేదిక‌లో తేలింది.

కాగా, ఒక దేశానికి ఏడు శాతం గ్రీన్‌ కార్డులు మాత్రమే జారీ చేయాలనే నిబంధన వల్ల భారతీయులు శాశ్వత నివాసం కోసం కొన్నేళ్ల‌ పాటు ఎదురుచూడాల్సి వస్తుందనీ... ఈ పరిస్థితిలో మార్పు రావాల్సి ఉందని యూఎస్‌ కు చెందిన కొందరు కాంగ్రెస్‌ నేతలు ఇప్పటికే ట్రంప్‌ ప్రభుత్వాన్ని కోరారు. గ్రీన్‌కార్డుల కోసం ఏళ్ల‌ తరబడి ఎదురుచూస్తున్న విధానంలో మార్పులు చేయాల్సిందిగా కోరుతూ పలువురు భారతీయులు ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆందోళ‌న‌లు వాస్త‌వాలు ఫ‌లించిన‌ట్లుగా తాజాగా ఆ దేశ చ‌ట్ట‌స‌భ‌ల్లో బిల్లు పెట్టారు. మొత్తం 435 మంది స‌భ్యులున్న హౌస్ ఆఫ్ రిప్రంజేటివ్స్‌ లో 310 మంది రిప‌బ్లిక‌న్లు మ‌రియు డెమోక్రాట్లు ఈ బిల్లుకు మ‌ద్ద‌తుగా నిలిచారు.


Tags:    

Similar News