గాంధీని కాపాడేందుకు అమెరికా ప్రయత్నించిందా?

Update: 2017-10-02 09:41 GMT
జాతిపిత మ‌హాత్మ‌గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా సంచ‌ల‌న విష‌యం ఒక‌టి వెలుగులోకి వ‌చ్చింది. అమెరికా తన నిఘా సంస్థతో మహాత్మాగాంధీని కాపాడేందుకు ప్రయత్నించిందని ఓ చ‌రిత్ర‌కారుడు కోర్టును ఆశ్ర‌యించాడు.గాంధీ హత్యను చర్రితలోనే అతిపెద్ద వక్రీకరణగా అభినవ భారత్ సంస్థకు ట్రస్టీగా వ్యవహరిస్తున్న పంకజ్ ఫడ్నవీస్ అనే పరిశోధకుడు తన పిటిషన్‌ లో పేర్కొన్నాడు. మహాత్మాగాంధీ హత్యపై పునర్విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన ఓ పిటిషన్ లేవనెత్తిన పలు సందేహాల్లో ఇదీ ఒకటి. రెండవ ప్రపంచ యుద్ధం నాటి అమెరికా నిఘా సంస్థ ఆఫీస్ ఆఫ్ స్ట్రాటజిక్ సర్వీసెస్ (ఓఎస్‌ ఎస్) మహాత్మాగాంధీని కాపాడేందుకు ప్రయత్నించిందన్నది పంకజ్ ఫడ్నవీస్ వాదన.

1948 జనవరి 30న రాత్రి 8గంటల సమయంలో ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం నుంచి పంపిన టెలిగ్రామ్ సందేశంలో హెర్బర్ట్ టామ్ రీనర్ గాంధీ హత్య గురించి ప్రస్తావించారని పిటిషన్‌ దారు పేర్కొన్నారు. గాంధీ హత్య జరిగినప్పుడు కేవలం ఐదు అడుగుల దూరంలోనే రీనర్ ఉన్నారని - కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులతో కలిసి ఆయన పట్టుకున్నారని పంకజ్ చెబుతున్నారు. ఆరోజు ఘటనపై రీనర్ అమెరికా రాయబార కార్యాలయం నుంచి వాషింగ్టన్‌ కు టెలిగ్రాముల ద్వారా చేరవేశారని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ సంవత్సరం మే నెలలో తాను అమెరికాలోని మేరీలాండ్‌ లో ఉన్న నేషనల్ ఆర్కివ్స్ అండ్ రీసర్చ్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాన్ని సందర్శించినప్పుడు ఈ టెలిగ్రామ్ విషయం తెలిసిందని పంక‌జ్ ఫ‌డ్న‌వీస్ చెప్తున్నారు.

అమెరికాలో అమల్లో ఉన్న స్వేచ్ఛాసమాచార చట్టం (ఎఫ్‌ వోఐఏ) కింద దానిని బహిర్గత పరచాలని కోరుతూ తాను అక్కడి ప్రభుత్వానికి దరఖాస్తు కూడా చేసుకున్నానని తెలిపారు. మొత్తం మూడు టెలిగ్రాములకు గాను రెండింటిని అమెరికా అందజేసిందని, కానీ రహస్య ప్రతిగా ఉన్న మూడో టెలిగ్రామ్‌ను ఇవ్వడానికి అక్కడి ప్రభుత్వం నిరాకరించిందని పంకజ్ వివరించారు. మూడో టెలిగ్రామ్‌లో ఏమున్నది అనేది 70 ఏళ్ల‌ తర్వాత కూడా మిస్టరీగా మిగిలిందని, దానిని బహిర్గత పరిచి విశ్లేషించాలని కోరుతూ పంకజ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పంకజ్ దాఖలు చేసిన పిటిషన్ భారత అత్యున్నత న్యాయస్థానంలో ఈనెల 6న విచారణకు రానుంది. ఈ అంశం తీర్పు ఆధారంగా మ‌హాత్ముడి హ‌త్య ఉదంతంలో కీల‌క అంశాలు తెర‌మీద‌కు వ‌స్తాయ‌ని అంచ‌నావేస్తున్నారు.
Tags:    

Similar News