చైనా విమానాలకు అమెరికా నో చెప్పింది ఎందుకో తెలుసా?

Update: 2020-06-04 05:30 GMT
మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో.. మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరమన్న నానుడి చాలా పాతది. అగ్రరాజ్యం అమెరికాకు.. డ్రాగన్ చైనాకు మధ్య ఇటీవల కాలంలో సరైన టర్మ్స్ లేకపోవటం తెలిసిందే. చైనాకు షాకిచ్చేలా అమెరికా వ్యవహరిస్తే.. దానికే మాత్రం తగ్గని రీతిలో చైనా ఇచ్చే షాకులతో అమెరికా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. తాజాగా.. అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్న అమెరికా వెంటనే రియాక్ట్ అయి చైనాకు చెక్ పెట్టేలా పావులు కదిపింది.

అయితే.. ఈ వ్యవహారంలో అమెరికా ఇమేజ్ పెంచేలా వార్తలు వస్తున్నాయే తప్పించి.. దిక్కు తోచని స్థితిలో చేసిన పనిని గొప్పగా ప్రచారం చేసుకోవటం అగ్రరాజ్యానికే చెల్లిందనుకోవాలి. తాజాగా చైనా విమానాల్ని అమెరికాలో అనుమతించట్లేదంటూ ట్రంప్ సర్కారు గొప్పలు చెప్పుకోవటం కనిపిస్తుంది. అసలు నిజం ఏమంటే.. లాక్ డౌన్ కు చెక్ చెబుతూ అన్ లాక్ లో బాగంగా అమెరికాలోని ప్రముఖ విమానయాన సంస్థలైన యునైటెడ్ ఎయిర్ లైన్స్.. డెల్టా ఎయిర్ లైన్స్ లు తమ సర్వీసుల్ని షురూ చేశారు.

ఇందులో భాగంగా తమ దేశంలోకి అమెరికాకు చెందిన విమాన సర్వీసులు వచ్చేందుకు అవసరమైన అనుమతుల్ని చైనా ఇవ్వలేదు. దీంతో.. కంగుతిన్న అమెరికా దానికి సంబంధించి ప్రతి చర్య తీసుకోవాలని డిసైడ్ అయ్యింది. తమ దేశంలోకి వచ్చే చైనా విమానాల్ని అనుమతించమని తేల్చింది. చైనాకు చెందిన నాలుగు విమానయాన సంస్థల్ని అమెరికాలోకి అనుమతించకూడదని నిర్ణయించారు.

అయితే.. ఇదంతా చైనా నిర్ణయం తర్వాతనే అమెరికా తీసుకోవటం ఒక ఇష్యూ అయితే.. మీడియాలోనూ.. బయటా చైనీయులకు అమెరికా షాకిచ్చేలా నిర్ణయం తీసుకున్నట్లుగా వస్తున్న వార్తల్ని చూస్తే.. అవాక్కు అవ్వాల్సిందే. చైనా విమానాలకు చెక్ పెట్టటం ద్వారా.. వారికి నష్టం వాటిల్లటమేకాదు.. దాన్ని పూడ్చుకునేందుకు తమతో చర్చలకు వస్తారన్నది అమెరికా ఆలోచనగా చెబుతున్నారు. మరి.. అగ్రరాజ్యం తీసుకున్న నిర్ణయంపై చైనీయులు ఏ రీతిలో స్పందిస్తారో చూడాలి.
Tags:    

Similar News