అమెరికా నోట‌..చైనా మాట‌.. త‌మ‌కు పోటీదార‌ని కామెంట్‌

Update: 2022-10-14 00:30 GMT
క‌మ్యూనిస్టు చైనాపై నిప్పులు చెరిగే.. అగ్ర‌రాజ్యం అమెరికా.. తాజాగా.. చైనా గురించి చేసిన వ్యాఖ్య‌లు విస్తు పోయేలా ఉన్నాయి. డ్రాగ‌న్ కంట్రీని అన్ని విష‌యాల్లోనూ విభేదించే.. అమెరికా.. క‌రోనా స‌మ‌యంలో తీవ్ర‌స్థాయిలో ఉతికి ఆరేసింది. అప్ప‌టి ట్రంప్ స‌ర్కారు.. తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డింది. చైనాపై నిషేధం విధించాల‌ని.. అంత‌ర్జాతీయ ఒత్తిడి తీసుకురావాల‌ని గ‌ళం వినిపించిన అమెరికా.. ఇప్పుడు యూట‌ర్న్ తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.

ఎందుకో తెలియ‌దు కానీ.. అనూహ్యంగా చైనాపై అమెరికా చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి. చైనానే త‌మ‌కు  ప్రధాన పోటీదారని అమెరికా పేర్కొంది. కొత్త రక్షణ వ్యూహంలో  బైడెన్ యంత్రాంగం ఇలా పేర్కొన‌డం ఆస‌క్తిగా మారింది.  అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ స్యుల్లివన్  మాట్లాడుతూ.. నిర్ణయాత్మక దశాబ్దం ప్రారంభంలో అమెరికా ఉందని, చైనాతోనే  త‌మ‌కు ప్ర‌ధాన పోటీ ఉంటుంద‌ని అన్నారు.  

''స్వదేశం, విదేశాలలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా దృఢత్వం.. పశ్చిమ దేశాలతో పోటీగా ఆర్థిక, రాజకీయ, రక్షణ, సాంకేతిక రంగాలలో అసమాన దృష్టితో ముందుకు వెళుతోంది'' అని జేక్‌ అన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కారణంగా అమెరికా జాతీయ వ్యూహం నివేదిక విడుదలలో జాప్యం చోటుచేసుకుంది.  

ఉక్రెయిన్‌పై ర‌ష్యా యుద్ధాన్ని తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్న‌ట్టు చెప్పిన ఆయ‌న.. భ‌విష్య‌త్తులో ఇది మ‌రింత తీవ్ర‌త‌రం కాద‌ని వ్యాఖ్యానించారు. చైనా, రష్యాలు ఒకదానితో ఒకటి పోటీ ప‌డుతున్న‌ట్టు క‌నిపిస్తోంద‌ని అయితే, రెండు దేశాలు విభిన్న సవాళ్లను ఎదుర్కొంటున్నాయ‌ని నివేదికలో పేర్కొన్నారు. ''అంతర్జాతీయంగా ప్ర‌పంచాన్ని పునర్నిర్మించాలనేది అమెరికా వ్యూహం. అయితే..  ఆర్థిక, దౌత్య, సైనిక, సాంకేతిక శక్తి తో చైనాను ఏకైక పోటీదారుగా భావిస్తున్నాం. రష్యాను నిలువరించ‌డం, అత్యంత ప్రమాదకరమైన శక్తులను అడ్డుకోవడం.. వంటివి ల‌క్ష్యాలుగా ఉన్నాయ‌ని పేర్కొన్నారు.  

జాతీయ భద్రత వ్యూహం నివేదిక విడుదల విషయంలో మాజీ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పోల్చితే జో బైడెన్ తీవ్ర జాప్యం చేశారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే జాతీయ వ్యూహాన్ని ఆయన బృందం విడుదల చేసింది. కానీ, బైడెన్ అధికారంలోకి వచ్చిన 20 నెలల తర్వాత నివేదికను విడుదల చేయడం గమనార్హం. అయితే.. క‌రోనా నేప‌థ్యంలో కొంత ఆల‌స్య‌మైన‌ట్టు వైట్ హౌస్ వ‌ర్గాలు పేర్కొన్నాయి.

ఇదిలావుంటే.. ట్రంప్ హ‌యాంలో ఇచ్చిన నివేదిక‌కు.. తాజాగా బైడెన్ నివేదిక‌కు మ‌ధ్య చాలా వ్య‌త్యాసం ఉన్న‌ట్టు తెలుస్తోంది. అమెరికా ప్రాబల్యానికి, పలుకుబడికి చైనా, రష్యాల నుంచి ముప్పు ఉందని ట్రంప్ నివేదిక పేర్కొంది. కానీ, ఇప్పుడు దీనికి భిన్నంగా బైడెన్ వ్యూహం ఉన్న‌ట్టు తెలుస్తోంది.

తాజా వ్యూహం ప్రకారం.. 2030ల నాటికి మొదటిసారి రెండు ప్రధాన అణు శక్తులను అమెరికా నిరోధించాల్సి ఉంటుంది. ''మేము ఎదుర్కొనే ముప్పునకు అణు నిరోధక ఒప్పందం ప్రతిస్పందిస్తుందని నిర్ధారించడానికి అణు దళాన్ని ఆధునీకరించాం.. అలాగే మా మిత్రదేశాలను బలోపేతం చేయడానికి వీటిని విస్తరిస్తున్నాం'' అని తాజాగా నివేదిక స్పష్టం చేసింది.

చైనా విషయానికి వస్తే బైడెన్ యంత్రాంగం పోటీదారుగా చూస్తోంది కానీ సంఘర్షణకు కాదు. గ‌తంలో ట్రంప్‌.. చైనాను శ‌తృవుగా ప‌రిగ‌ణించారు. కానీ.. ఇప్పుడు బైడెన్ ఏదో వ్యూహం మార్చుకున్నార‌నే సంకేతాలు పంపించారు. కొత్త ప్రచ్ఛన్న యుద్ధం కోసం ప్రయత్నించడం లేదని పరోక్షంగా చెబుతున్నారు.  

నెల రోజుల్లోనే మధ్యంతర ఎన్నికలు జరగనుండగా.. ప్రపంచ భద్రతకు ముప్పుగా ఉన్న ద్రవ్యోల్భణం గురించి ప్రస్తావించారు. వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో సెనేట్‌‌లో తన బలాన్ని బైడెన్ పెంచుకుంటారో? లేదో? తెలిపోనుంది.

అమెరికా జాతీయ భద్రతా వ్యూహాన్ని కాంగ్రెస్‌(చ‌ట్ట‌స‌భ‌)కు ప్రతి ఏటా అధ్యక్షుడు నివేదించాలనే చట్టాన్ని 1986లో తీసుకొచ్చారు. జాతీయ భద్రతా వ్యూహానికి చెందిన ఈ నివేదికలో ప్రపంచవ్యాప్తంగా అమెరికా ప్రయోజనాలు, లక్ష్యాలు ఉంటాయి. ఈ లక్ష్యాల సాధనకు జాతీయ ప్రాబల్యానికి చెందిన రాజకీయ, ఆర్థిక, సైనిక అంశాలను స్వల్పకాలంలోను, దీర్ఘకాలంలోను ఉపయోగించడం గురించిన ప్రతిపాదనలు ఉంటాయి. అయితే... ఇప్పుడు ఈ వ్యూహాల్లో సానుకూల‌త పెర‌గ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News