జ‌డ్జీల‌ను విస్తుపోయేలా చేసిన సామాన్యుడు

Update: 2016-07-27 05:50 GMT
కార్బైడ్ ఉపయోగించ‌డం ద్వారా పండ్ల‌ను ప‌క్వానికి వ‌చ్చేలా చేయడం-వాటిని వినియోగదారుల‌కు అమ్మ‌కుండా చూడాల‌ని తీర్పివ్వడమే కాకుండా ఈ ఉత్త‌ర్వుల‌ను కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర హైకోర్టు కొద్దికాలం క్రితం ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే కార్బైడ్‌తో పండించిన పండ్లు సాక్షాత్తు హైకోర్టు న్యాయమూర్తులే వినియోగదారులుగా కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఈ విషయాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బి.బొస్లే - న్యాయమూర్తి ఎవి శేషసాయిలతో కూడిన డివిజన్ బెంచ్ తెలిపింది.

హైదరాబాద్ లోని ఒక ప్రముఖ పండ్ల షాపులో న్యాయమూర్తుల కోసం పండ్లు కొనుగోలు చేశారు. అయితే అనంతరం ఎందుకో అనుమానం వచ్చింది. పండ్లను కార్బైడ్ తో పండించారన్న సందేహంతో కొనుగోలు చేసిన ఆరు రకాల పండ్లను పరీక్షలకు పంపితే ఫలితాలు విస్తుపోయేలా ఉన్నాయని తెలిపింది. ఆరు రకాల పండ్లలో మూడు రకాల పండ్లు తినేందుకు ఏ మాత్రమూ యోగ్యంగా లేవని - వాటిని తింటే రోగాన్ని కొని తెచ్చుకున్నట్టేనని పరీక్షల్లో తేలిందని తెలిపింది. కార్బైడ్ తో పండ్లను పండించి అమ్మకాలు జరపడంపై దినపత్రికల్లో వచ్చిన వార్తలను హైకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యంగా పరిగణించి విచారిస్తోంది. మంగళవారం విచారణలో స్వయంగా తమకు ఎదురైన చేదు అనుభవాన్ని బెంచ్ పైవిధంగా తెలిపింది.

ఈ కేసులో కోర్టుకు సహాయకారిగా నియమితులైన అమికస్ క్యూరీగా వ్యవహరిస్తున్న న్యాయవాది నిరంజన్ రెడ్డి చేసిన సూచనను తెలుగు రాష్ట్రప్రభుత్వాలు అమలు చేయాలని సూచన చేసింది. కార్బైడ్ వినియోగంతో పండ్లను పండించే వ్యాపారుల ఆగడాలను అడ్డుకునేందుకు తూనికలు-కొలతల శాఖ అధికారుల సేవల్ని వినియోగించుకోవాలని - ఇథలైన్ ఛాంబర్లు ఏర్పాటు చేయాలన్న ఆయన సూచనను అమలు చేయాలని బెంచ్ తెలుగు ప్రభుత్వాలకు సలహా ఇచ్చింది. తెలంగాణ తరఫు న్యాయవాది సంజీవ్ కుమార్ వాదిస్తూ ఆహార భద్రతాధికారి పోస్టులు 26 భర్తీ చేశామని - మిగిలిన ఖాళీలన్నీ భర్తీ చేస్తామని చెప్పారు. కార్బైడ్ వినియోగ దుకాణాలపై దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. ఏపి తరఫు న్యాయవాది డి. రమేష్ వాదిస్తూ మండలానికో ఆహార భద్రతాధికారి పోస్టు ఉంటే బాగుంటుందని సంబంధిత శాఖ కమిషనర్ నుంచి ప్రతిపాదనలు వచ్చాయని దీనిని ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు. పాలకుల ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి మరి.
Tags:    

Similar News