గులాబీ బ్యాచ్‌ కు మండే మాట అన్న ఉత్త‌మ్‌

Update: 2017-09-06 12:53 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి. కేసీఆర్ పాల‌న‌పై ఆయ‌న నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రంలో తుగ్ల‌క్ పాల‌న సాగుతుంద‌ని మండిప‌డ్డ ఆయ‌న‌.. త‌న‌కు ఇష్టం వ‌చ్చిన‌ట్లుగా పాల‌న సాగించి ప్ర‌జాధ‌నాన్ని దుర్వినియోగం చేస్తున్నార‌న్నారు.

సికింద్రాబాద్ బైస‌న్ పోలో మైదానాన్ని ప‌రిశీలించేందుకు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి.. జానారెడ్డి.. ష‌బ్బీర్ అలీ.. వీహెచ్.. త‌దిత‌రులు వెళ్లే ప్ర‌య‌త్నం చేశారు.

అయితే.. బైస‌న్ పోలో మైదానంలోకి వెళ్ల‌టానికి కాంగ్రెస్ నేత‌ల్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సంద‌ర్భంగా పోలీసుల‌తో కాంగ్రెస్‌నేత‌లు వాగ్వాదానికి దిగారు. ఈ సంద‌ర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ.. బైస‌న్ పోలో మైదానంలో స‌చివాల‌యాన్ని.. అసెంబ్లీ భ‌వ‌నాన్ని నిర్మించ‌టానికి తాము తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నామ‌న్నారు. ముఖ్య‌మంత్రి నిర్ణ‌యం ఏ మాత్రం స‌రికాద‌న్నారు. ప్రాణ‌త్యాగం చేసైనా బైస‌న్ పోలో మైదానాన్ని కాపాడుకుంటామ‌న్నారు.

బైస‌న్ మైదానంలో సచివాల‌యం.. అసెంబ్లీని నిర్మించ‌టాన్ని ఎవ‌రూ అంగీక‌రించ‌కున్నా కేసీఆర్ మాత్రం త‌న పంతాన్ని కొన‌సాగిస్తున్నార‌ని ఇది స‌రైన ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఇక‌.. షబ్బీర్ అలీ మాట్లాడుతూ కేసీఆర్ ఏమైనా రాజు అని అనుకుంటున్నారా? అని ప్ర‌శ్నించారు.

ప్ర‌జాధ‌నాన్ని ఇలా త‌గ‌లేస్తారా? అని నిల‌దీస్తున్న కాంగ్రెస్ నేత‌లు ప‌లువురు కేసీఆర్ ది తుగ్ల‌క్ పాల‌న‌గా అభివ‌ర్ణించారు. సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ నేత‌లు విరుచుకుప‌డిన వైనం చూస్తే గులాబీ నేత‌లు త‌మ నోటికి ప‌ని చెప్పాల్సిన అవ‌స‌రం వ‌చ్చింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. త‌మ అధినేత‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డిన‌ కాంగ్రెస్ నేత‌ల‌పై గులాబీ ద‌ళం విరుచుకుప‌డ‌టం ఖాయ‌మంటున్నారు. అధినేత ఊళ్లో లేని వేళ‌.. కాంగ్రెస్ నేత‌లు ఈ స్థాయిలో విరుచుకుప‌డిన నేప‌థ్యంలో.. అధికార‌ప‌క్ష నేత‌లు ఎవ‌రెంత‌గా చెల‌రేగిపోతారో చూడాలి.
Tags:    

Similar News