నీళ్లు..నిజాలు అంటూ ఉతికి ఆరేస్తున్న ఉత్తమ్

Update: 2016-08-17 11:32 GMT
కోటి ఎకరాలకు సాగునీళ్లు అందిస్తామని చెబుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర అసెంబ్లీలో ఇచ్చిన ఇరిగేషన్ ప్రజంటేషన్ మీద కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇరిగేషన్ ప్రజంటేషన్ ను ఇస్తున్నారు. జలదృశ్యం పేరిట నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ తెలంగాణ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఇచ్చిన ప్రజంటేషన్ మొత్తం తప్పుల తడకగా అభివర్ణించిన ఆయన కేసీఆర్ చెబుతున్న కోటి ఎకరాలకుసాగునీటి మాట ఉత్త అబద్ధమని.. అందులో ఇసుమంత కూడా నిజం లేదంటూ తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

తన ప్రజంటేషన్ సందర్భంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాటల వీడియోను ప్రదర్శిస్తూ.. ఆయన చెప్పిన అంకెల్లోని మాయాజాలాన్ని విప్పి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరిట భారీ అవినీతికి కేసీఆర్ సర్కారు పాల్పడుతుందని ధ్వజమెత్తారు తెలంగాణ అవిర్భావ సమయానికి తెలంగాణకు ఉన్న అప్పుడు   రూ.69వేల కోట్లు అయితే.. కేవలం మూడేళ్ల వ్యవధిలో ఈ అప్పు రూ.1.3లక్షల కోట్లకు చేరుకుంటుందని.. ఇంతకంటే దారుణమైన ప్రభుత్వం ఏముందని ప్రశ్నిస్తున్నారు. అరవైఏళ్ల అప్పు రూ.69వేల కోట్లు అయితే.. కేవలం మూడేళ్లకు అంతే మొత్తం అప్పు కావటంలో అర్థం ఉందా? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు.

కాకి లెక్కలతో కేసీఆర్ కల్లబొల్లి మాటలు చెబుతున్నారని.. ఆయన చెబుతున్న గణాంకాలు ఏమాత్రం నిజం కావని చెబుతున్నారు. రూ.1.5లక్షల కోట్ల పనులకు టెండర్ల పనులు షురూ చేశారని.. పెద్ద ఎత్తున అప్పులు తీసుకురావటం.. ఆస్తుల అమ్మకంతో దేశంలోనే అతిపెద్ద అవినీతి కుంభకోణాన్ని కేసీఆర్ నడిపిస్తున్నారని చెబుతున్నారు. కేసీఆర్ ప్రజంటేషన్ లోని ప్రతి అంశానికి కౌంటర్ ఇస్తూ సాగుతున్న రియల్ జలదృశ్యం ఆసక్తికరంగా మారింది. నీళ్లు.. నిజాల పేరిట.. రియల్ జలదృశ్యం అంటూ తెలంగాణ కాంగ్రెస్ ఇస్తున్న ప్రజంటేషన్ ను ఒక్క మాటలో చెప్పాలంటే.. కేసీఆర్ ప్రజంటేషన్ లోని ప్రతి అంశాన్ని.. అందులో ప్రస్తావించిన ప్రతి అంకెను బండకేసి బాదుతున్నారు.
Tags:    

Similar News