కేసీఆర్ కాదంటే పెద్దాయన వద్దకు వెళ్తార‌ట‌!

Update: 2016-10-19 07:01 GMT
గులాబీ ద‌ళ‌ప‌తి కే చంద్ర‌శేఖ‌ర్ రావు నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వంపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి కొత్త ప్ర‌క‌ట‌న చేశారు. ‘ తెలంగాణ‌లో తొలిసారి అధికార ప‌గ్గాలు చేప‌ట్టిన టీఆర్‌ ఎస్ హానీమూన్ ముగిసింది. ప్రభుత్వంపై ప్రజల భ్రమలు తొలగిపోతున్నాయి. అగ్ని పర్వతం ఎప్పుడైనా బద్దలు కావచ్చు’ అని అన్నారు. హైద‌రాబాద్‌లోని ఓ హోటల్‌ లో వివిధ పత్రికలు - టీవీ ఛానళ్ళ ఎడిటర్లతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ టీఆర్‌ ఎస్ ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని ఉత్త‌మ్‌ కుమార్ రెడ్డి చెప్పారు. భారీగా కురిసిన వర్షాలతో నష్టపోయిన పంటను అంచనా వేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందన్నారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా స్పందించడం లేదని ఉత్త‌మ్‌ కుమార్ రెడ్డి విమర్శించారు. మిషన్‌ భగీరథ - మిషన్‌ కాకతీయ పథకాలల్లో దేశంలో ఏ రాష్ట్రంలో జరగనంత అవినీతి చోటు చేసుకుందన్నారు. రుణమాఫీ ఏకకాలంలో చేయకపోవడంతో రైతులు - రూ.మూడు వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌ మెంట్స్‌ బకాయిలు పడటంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  అందుకే ఈ నెల 20 నుంచి ప్రజా సమస్యలపై పోరాటం ప్రారంభించనున్నట్లు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి తెలిపారు.

ఈనెల‌ 20న మహబూబాబాద్‌ లో రైతు గర్జన నిర్వహించనున్నట్లు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ప్ర‌క‌టించారు. రుణ మాఫీని దశలవారీగా కాకుండా ఒకేసారి మాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 21న అన్ని కళాశాలల విద్యార్థులతో ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ పై ఆందోళన చేయనున్నట్లు ఆయన వివరించారు. అన్ని కళాశాలల విద్యార్థుల నుంచి తమ పార్టీ అనుబంధ విభాగమైన ఎన్‌ ఎస్‌ యుఐ - యువజన విభాగం సంతకాలు సేకరించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు అందజేస్తామని అన్నారు. ఒకవేళ సీఎం అప్పాయింట్‌ మెంట్ ఇవ్వ‌క‌పోతే గవర్నర్‌ కు - రాష్టప్రతికి అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. మ‌రోవైపు ఆయా స‌మ‌స్య‌ల‌న్నింటిపై డిసెంబర్ 2న భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ప్ర‌క‌టించారు. ఇంటింటికీ నల్లా నీరు కార్యక్రమాన్ని 20 శాతం కూడా పూర్తి చేయలేరని, అలా చేస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారు. పార్టీని విజయవంతంగా ముందుకు నడిపించడంలో కాంగ్రెస్ అధిష్టానం విఫలమైందన్న వాదనను ఉత్తమ్‌ కుమార్ రెడ్డి తోసిపుచ్చారు. పార్టీ ఫిరాయించి టీఆర్‌ ఎస్‌ లో చేరిన ప్రజాప్రతినిధులు అమ్ముడుపోయారని ఆయన విమర్శించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు - ఎంపీలు టీఆర్‌ ఎస్‌ కు టోకున అమ్ముడుపోయారని, లెక్కలతో సహా తమ దగ్గర ఆధారాలున్నాయని చెప్పారు. అసెంబ్లీలో అరిచిగీపెడితేనే మంచిపాత్ర పోషించినట్టు కాదని, ప్రజా సమస్యలను ప్రస్తావించడమే సమర్థవంతమైన పాత్ర అని అన్నారు. ప్రతిపక్ష పార్టీలకు ఏడెనిమిది సీట్లు వస్తాయన్న సీఎం వ్యాఖ్యలను ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఖండించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News