తనకు రాజకీయ ఓనమాలు నేర్పిన తెలుగుదేశం పార్టీని వీడిన టీటీడీపీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి ఏ ఒక్కరూ ఊహించనంత మంచి భవిష్యత్తు ఉందని తేటతెల్లమైపోయింది. టీడీపీకి రారాం పలికిన రేవంత్ రెడ్డి త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్నది ఇప్పటిదాకా ఊహాగానమే. ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో రేవంత్ భేటీ అయినప్పటికీ... ఇప్పటిదాకా రెండు వైపుల నుంచి కూడా రేవంత్ ఆ పార్టీలో చేరుతున్నట్లుగా స్పష్టమైన ప్రకటన రాలేదనే చెప్పాలి. ఈ క్రమంలో కాసేపటి క్రితం హైదరాబాదులో జరిగిన ఓ సభ... రేవంత్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారనే విషయాన్ని సుస్పష్టం చేసేసింది. ఆ సభకు నిజంగానే అనుకోని ముఖ్య అతిథి విచ్చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారనే చెప్పాలి. ఆయన వేరెవరో కాదు... టీ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డే.
ఆ సభ వివరాల్లోకి వెళితే... టీటీడీపీ గుడ్ బై కొట్టేసిన రేవంత్ రెడ్డి *ఆత్మీయులతో మాట- ముచ్చట* పేరిట ఓ భారీ సభను నిర్వహించారు. ఈ సభకు రేవంత్ రెడ్డితో అప్పటిదాకా కలిసి సాగిన పలువురు టీడీపీ నేతలు వస్తారని అందరూ అంచనా వేశారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పలువురు కీలక నేతలు - రేవంత్ సొంత నియోజకవర్గం కొడంగల్‌కు చెందిన టీడీపీ కీలక నేతలు - పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కూడా హాజరవుతారని భావించారు. అయితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారన్న సమాచారం ఉండటంతో ఆ పార్టీకి చెందినర పలువురు కీలక నేతలు కూడా హాజరవుతారని విశ్లేషకులు అంచనా వేశారు. అయితే ఏ ఒక్కరూ ఊహించని విధంగా ఈ సభకు టీ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. అంతేకాదండోయ్... సమావేశానికి రావడంతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి... సభా వేదికపై రేవంత్ పక్కనే కూర్చున్నారు.
ఇక పనిలో పనిగా జిల్లాల విభజనకు ముందు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వెరసి ఆ సభలో రేవంత్ తో పాటు ఇంతకాలం పాటు టీడీపీలో కొనసాగిన నేతలు - కార్యకర్తల కంటే కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు - కార్యకర్తల సందడే ఎక్కువగా కనిపించింది. వెరసి రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని నిన్నటిదాకా కొనసాగిన ఊహానాగాలు ఈ ఒక్క సభతో నిజమని తేలిపోయాయి. ఇదిలా ఉంటే... ఈ సభకు హాజరైన టీడీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి చాలా ఆవేశంగా ప్రసంగించారు. తాను ఇప్పుడే కాదు ఎప్పుడూ రేవంత్ వెంటే నడుస్తానని ఘనంగా ప్రకటించారు. మొత్తానికి ఈ సభ ఉత్తమ్ రాకతో మరింతగా ప్రాధాన్యం సంతరించుకుందని చెప్పాలి.