కేసీఆర్ మాట‌కు లాజిక్ తో కొట్టాడుగా?

Update: 2018-04-29 05:05 GMT
మాటల మొన‌గాడ‌న్న మాట వినిపించినంత‌నే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ గుర్తుకు వ‌స్తారు. మాట ఏదైనా.. ఆయ‌న నోటి నుంచి వ‌స్తే అదో మంత్రంలా వినిపిస్తూనే ఉంటుంది. వింటున్నది వింటున్న‌ట్లుగా న‌మ్మేసేలా ఆయ‌న మాట‌లు ఉంటాయి. విచ‌క్ష‌ణ‌ను కాసేపు ప‌క్క‌న పెట్టే శ‌క్తి కేసీఆర్ సొంతం. అదే ఆయ‌న బ‌లంగా చెప్పాలి.

మొన్న ముగిసి తెలంగాణ ప్లీన‌రీ సంద‌ర్భంగా మాట్లాడిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎప్ప‌టిలానే చాలా మాట‌లు చెప్పారు. గ‌తంలో విప‌క్షాలుగా ఉన్న టీడీపీని ఎక్కువ‌గా టార్గెట్ చేసే వారు. కానీ.. కేసీఆర్ మంత్రాంగం దెబ్బ‌కు తెలంగాణ‌లో టీడీపీ అడ్ర‌స్ ఎలా గ‌ల్లంతైందో అంద‌రికి తెలిసిన ముచ్చ‌టే. ఇప్పుడు కాస్తాకూస్తో మిగిలిన పార్టీలు రెండే రెండు ఒక‌టి కాంగ్రెస్‌.. బీజేపీలే. ఈ రెండింటిలోనూ బీజేపీని న‌మ్మే ప‌రిస్థితి లేదు. ఒక‌ప్పుడు ఏ మోడీ అయితే ఆ పార్టీకి బ‌ల‌మో.. ఇప్పుడదే మోడీ ఆ పార్టీకి శాపంగా మారారు.

కేంద్రంలో చ‌క్రం తిప్పుతున్నా.. రాష్ట్రంలో పార్టీ బ‌లోపేతం కావ‌టంపై పెద్ద‌గా దృష్టి పెట్ట‌ని కార‌ణంగా.. నాలుగేళ్ల క్రితం తెలంగాణ‌లో ఆ పార్టీ ఎలా ఉందో.. ఇప్పుడూ అదే మాదిరి ఉంది. మార్పు ఏమైనా ఉందంటే.. ఒక‌రిద్ద‌రు పార్టీ నేత‌లు వేరే పార్టీలోకి వెళ్లిపోవ‌టం. అంత‌కు మించి ఇంకేం లేదు.

ఇక‌.. తెలంగాణ అధికార‌ప‌క్షానికి స‌వాల్ విసిరే ద‌మ్ము.. ధైర్య‌మున్న ఏకైక పార్టీ కాంగ్రెస్‌. ప‌దేళ్ల నాన్ స్టాప్ అధికారాన్ని అనుభ‌వించిన ఆ పార్టీ నేత‌లు తమ ఒక‌నాటి అధినేత్రి సోనియా ఇచ్చిన రాష్ట్రంతో అధికారం త‌మ‌దేన‌ని ఫీల‌య్యారు. కానీ.. కేసీఆర్ దెబ్బ‌కు విప‌క్షంగా మారాల్సి వ‌చ్చింది. ఐదేళ్ల ప‌ద‌వీకాలంలో నాలుగేళ్లు గ‌డిచినా.. కేసీఆర్ స‌ర్కారు చేసింది త‌క్కువే అయినా.. ఆ భావ‌న ప్ర‌జ‌ల్లో క‌లిగేలా చేయ‌టంలో కాంగ్రెస్ నేత‌లు మ‌రోసారి ఫెయిల్ అయ్యారు.

ఆ మాట‌కు వ‌స్తే.. కేసీఆర్ అండ్ కో చేసే విమ‌ర్శ‌ల్ని సైతం బ‌లంగా తిప్పికొట్టే ప‌రిస్థితి లేని దుస్థితి. ఇలాంటి వేళ.. టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ప్లీన‌రీ వేదిక‌గా చేసుకొని కాంగ్రెస్ పైనా.. త‌న‌పైనా చేసిన విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌ల్ని తిప్పి కొట్టే ప‌ని చేశారు.

ఉత్త‌మ్‌ ను ఉద్దేశించి.. ప్ర‌గ‌తిభ‌వ‌న్లో 150 గ‌దులు ఉన్న‌ట్లుగా వ్యాఖ్య‌లు చేశార‌ని.. ఆ ఆరోప‌ణ‌ను నిరూపిస్తే త‌న సీఎం ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని స‌వాల్ విసిరారు కేసీఆర్. అంతేనా.. టీపీసీసీ అధ్య‌క్షుడ‌న్న పేరుతో ప‌ద‌విలో ఉన్నావు క‌దా.. ఆ ప‌ద‌వి కూడా టీఆర్ ఎస్ పుణ్య‌మే అంటూ పంచ్ వేశారు. కేసీఆర్ చేసిన విమ‌ర్శ‌ల్ని బ‌లంగా తిప్పి కొట్టే ప్ర‌య‌త్నం చేశారు ఉత్త‌మ్‌. తాను రూ.150 కోట్ల‌తో ప్ర‌గ‌తిభ‌వ‌న్ ను నిర్మించుకున్నార‌ని చెప్పానే కానీ.. 150 గ‌దుల‌తో ప్ర‌గ‌తి భ‌వ‌న్ ను నిర్మించార‌ని ఎప్పుడూ అన‌లేద‌న్న వివ‌ర‌ణ ఇస్తూ.. అన‌ని మాట‌ల్ని అన్న‌ట్లుగా చెప్ప‌టం స‌రికాదంటున్నారు.

ఇక‌.. త‌మ పుణ్య‌మా అని ఉత్త‌మ్ ప‌ద‌వి వ‌చ్చిన‌ట్లుగా కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఉత్త‌మ్ ఘాటుగా రియాక్ట్ అవుతూ.. నీ వ‌ల్ల టీపీసీసీ రాలేదు.. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వ‌టం వ‌ల్లే నీకు ముఖ్య‌మంత్రి ప‌ద‌వి వ‌చ్చింది. సోనియా తెలంగాణ ఇవ్వ‌క‌పోతే మా సంగ‌తి కాదు.. ముందు మీ సంగ‌తి ఎలా ఉండేదో ఆలోచించండి అంటూ ఫైర్ అయ్యారు. ఉత్త‌మ్ చెప్పిన‌ట్లుగా సోనియా కానీ తెలంగాణ ఇచ్చేది లేదు.. ఏం చేసుకుంటారో చేసుకోడంటూ చెప్పేసి.. ఇప్పుడు ఉద్య‌మాల విష‌యంలో కేసీఆర్ ఎంత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించారో అంతే క‌ఠినంగా సోనియా అండ్ కో వ్య‌వ‌హ‌రించి ఉంటే.. పంచ్ లు వేసే అవ‌కాశం కేసీఆర్ కు ఉండేది కాద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. ఎన్నాళ్ల‌కు కేసీఆర్ కు స‌రైన పంచ్ ప‌డింద‌న్న అభిప్రాయం ప‌లువురి నోటి నుంచి వినిపిస్తోంది.


Tags:    

Similar News