వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు రెండు మాటలు ఎక్కువగా చెప్పటం రాజకీయ నాయకులకు అలవాటు. అది ఒకందుకు మంచిదే అయినా.. ఆ ఉత్సాహంలో అనవసరమైన మాటలు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది. తాజాగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ రథసారధి ఉత్తమ్ మాంచి జోష్ లో ఉన్నారు. 110 సీట్లలో విజయం పక్కా అని కేసీఆర్ అంటున్నా.. అంత సీన్ లేదన్న విషయంపై పూర్తి అవగాహన ఉన్న ఆయన.. కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
కేసీఆర్ ఇలాకా నుంచి ఇంత భారీగా పార్టీలో చేరితే ఉత్తమ్ లో ఉత్సాహం తన్నుకు రావటం ఖాయం. దీనికి తగ్గట్లే ఆయన మాటల్లో ఉత్సాహం కొట్టొచ్చినట్లు కనిపించింది. కేసీఆర్ తీరును తప్పు పడుతూ.. కేసీఆర్ పాలనలో బంగారు తెలంగాణ సంగతి తర్వాత.. కేసీఆర్ కుటుంబం మాత్రం బంగారు కుటుంబంగా మారిందన్నారు.
నాలుగున్నరేళ్ల పాటు సీఎంగా కేసీఆర్ దగుల్బాజీ మాటలతో తెలంగాణ రాజ్యాన్ని ఏలాడన్న ఉత్తమ్.. ఉద్యమ ఆకాంక్షలు.. అమరుల.. యువత త్యాగాల్ని మరిచారన్నారు. విలాసాలతో కేసీఆర్ విహరించారన్నారు. కేసీఆర్ ముదనష్టపు పాలనకు చరమగీతం పాడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో 4500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్క కుటుంబాన్ని కూడా కేసీఆర్ పరామర్శించలేదన్న ఉత్తమ్.. ముఖ్యమంత్రిగా నియంతలా వ్యవహరించి ప్రజాస్వామ్య వ్యవస్థల్ని అణిచివేశారన్నారు. రైతు బంధు ఎన్నికల డ్రామాగా ఆయన అభివర్ణించారు.
తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామన్న ఉత్తమ్.. గతంలో ఇదే హామీని కేసీఆర్ చెప్పినా నిలబెట్టుకోలేదన్నారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ ఉంటుందని.. ప్రగతి భవన్ ను పెద్దాసుపత్రిగా మారుస్తామన్నారు. ఇలా వరాల వర్షం కురిపించిన ఉత్తమ్.. తమ ప్రభుత్వం డిసెంబరు 12న ఏర్పడుతుందంటూ అనవసరమైన మాటను చెప్పేశారు. డిసెంబరు 11న ఎన్నికల ఫలితాలు వెల్లడవుతున్న నేపథ్యంలో తుది ఫలితం తమకు అనుకూలంగా వస్తుందన్న భావన ఉత్తమ్ కు ఉండటంలో తప్పు లేదు కానీ.. ఆ పేరుతో వెనుకా ముందు చూసుకోకుండా మాట్లాడితే.. ఉత్తమ్ కాన్ఫిడెన్స్ ను ప్రజలు.. ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఫీల్ అవ్వొచ్చు. అదే జరిగితే మొదటికే మోసం రావటం ఖాయం. సో.. మాట్లాడేటప్పుడు బడాయి మాటల్ని కాస్త కట్టిపెడితే మంచిది.