కాంగ్రెస్ కాన్ఫిడెన్స్ మామూలుగా లేదుగా?

Update: 2018-01-03 17:28 GMT
ఇటీవ‌లి కాలంలో తెలంగాణలో కాంగ్రెస పార్టీ బ‌లోపేత‌మైన‌ట్లు వార్త‌లు వ‌స్తున్న‌ సంగ‌తి తెలిసిందే. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేస్తున్న ప‌లు త‌ప్పిదాలను ప్ర‌ధాన‌ ప్ర‌తిప‌క్షంగా ఎత్తిచూప‌డం వ‌ల్ల తమ గ్రాఫ్ పెరుగుతోంద‌ని కాంగ్రెస్ నేత‌లు సంతోష‌ప‌డుతున్నారు. అయితే ఈ ఆత్మ‌విశ్వాసం కాస్త అతి విశ్వాసం అయిన‌ట్లుగా ఉంద‌ని పలువురు అంటున్నారు. ఇందుకు నిద‌ర్శ‌నంగా టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి చేసిన కామెంట్ల‌ను ప్ర‌స్తావిస్తున్నారు. గాంధీభవన్‌ లో ఉత్తమ్‌ కుమార్ రెడ్డి అధ్యక్షతన జ‌రిగిన టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో ఆయ‌న మాట‌ల‌ను ఉటంకిస్తూ ఈ విశ్లేష‌ణ చేస్తున్నారు.

స‌మావేశానికి ముందు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ ఛార్జీ ఆర్‌సి కుంతియా నేతృత్వంలో ఉత్తమ్‌ కుమార్ రెడ్డి - భట్టి విక్రమార్క - అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కె. జానారెడ్డి - కౌన్సిల్‌ లో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ - మాజీ ఎంపి వి. హనుమంత రావు తదితరులు సమావేశమయ్యారు. ఈ సంద‌ర్భంగా ఉత్త‌మ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు. అంత‌టితోనే ఆగ‌కుండా...ఇప్పుడు ఎన్నికలు జరిగితే తమ పార్టీకి 70 స్థానాలు లభిస్తాయని ఆయన తెలిపారు. ఒకవేళ గడువు ప్రకారమే వచ్చే ఏడాది ఎన్నికలు జరిగితే - అప్పటి వరకు తమ పార్టీకి ఇంకా సీట్లు పెరుగుతాయని ఆయన నమ్మకంగా చెప్పడం గ‌మ‌నార్హం. ఇంతేకాకుండా...ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్వతహాగా చేయించుకున్న సర్వేలోనూ కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నట్లు వెల్లడైందన్న సమాచారం తమ వద్ద ఉందన‌డం విశేషం. మ‌రీ ఇంత న‌మ్మ‌కంగా ఎలా చెప్పారా అని కాంగ్రెస్ పార్టీ నేత‌లే ఆలోచ‌న‌లో ప‌డ్డ‌ట్లుగా తెలుస్తోంది.

రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు - అన్ని ప్రాంతాల వారూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ కే ప్రజలు పట్టం కట్టనున్నారని అన్ని సర్వేల్లోనూ వెల్లడవుతున్నదని ఉత్త‌మ్ కుమార్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని అన్నీ సర్వేల్లోనూ స్పష్టమవుత్నుదని ఆయన తెలిపారు. తమ పార్టీలోకి వివిధ పార్టీల నుంచి ప్రతి రోజూ అనేక మంది చేరుతున్నారని ఆయన తెలిపారు. సంక్రాంతి పండుగ తర్వాత ఇంకా అనేక మంది తమ పార్టీలో చేరనున్నారని ఆయన చెప్పారు. టీఆర్‌ ఎస్‌ లోని పెద్ద నాయకులు - పలువురు సిట్టింగ్‌ లూ పార్టీలో చేరేందుకు ‘టచ్’లో ఉన్నారని ఆయన తెలిపారు.

తెలంగాణలో డీలిమిటేషన్ ప్రక్రియ విషయంలో ఒక కమిటీని వేసి పరిశీలిస్తామని - పార్లమెంటులో బిల్లు పెడితే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపైనా చర్చిస్తున్నామని ఉత్తమ్‌ కుమార్ రెడ్డి తెలిపారు. టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో ప్రధానంగా సోషల్ మీడియాను మరింత విస్తృతంగా వినియోగించుకునే అంశంపై చర్చించామన్నారు. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని నాయకులు సీరియస్‌ గా తీసుకోవాలని - ప్రతి ఒక్క ఓటరును పరిశీలించాలని, పోలింగ్ బూత్ స్థాయిలో సమగ్రంగా చూడాలన్నారు. పార్టీ నేత‌లు శ్ర‌మిస్తే విజ‌యం కాంగ్రెస్ పార్టీదేన‌ని అన్నారు.
Tags:    

Similar News