ఉత్తమ్ వార్నింగ్.. కేసీఆర్‌ ను చూసుకుని పోలీసులు ఎగిరిపడొద్దు

Update: 2021-01-03 04:57 GMT
టీపీసీసీ రథసారధి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంత ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పతనం మొదలైందన్న ఆయన.. పోలీసులకు సూటిగా వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ ను చూసుకొని పోలీసులు ఎగిరిపడొద్దని.. ఎక్స్‌ట్రాలు చేసే వారెవరినీ వదిలిపెట్టబోమని వ్యాఖ్యానించటం గమనార్హం. జనగామ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డిని ఇటీవల అరెస్టు చేసిన పోలీసులు జైలుకు పంపటంపై కాంగ్రెస్ నేతలు సీరియస్ అయ్యారు.

జైల్లో ఉన్న ఆయన్ను ఉత్తమ్.. కోమటిరెడ్డితో సహా పలువురు నేతలు ములాఖత్ అయ్యారు. అనంతరం మాట్లాడారు. అధికార పార్టీ నేతలు రాఘవరెడ్డిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని.. టీఆర్ఎస్ నేతలు బందిపోటు దొంగల్లా ప్రవర్తిస్తున్నారన్నారు. వారికి పోలీసులు వత్తాసు పలుకుతున్నట్లుగా ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని.. రెండేళ్లలో కాంగ్రెస్ అధికారంలోకి రానున్నట్లు పేర్కొన్నారు. ఉత్తమ్ లాంటి నేతలకు సొంత పార్టీకి చెందిన నేతను పోలీసులు అరెస్టు చేయటం ఆగ్రహాన్ని తెప్పించి ఉండొచ్చు. అంత మాత్రాన పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు సరికావన్న మాట వినిపిస్తోంది.

ఎందుకంటే.. జంగా చరిత్రచూస్తే.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఆయనపై పలు కేసులు ఉన్న నేపథ్యంలో.. క్లీన్ ఇమేజ్ ఉన్న ఉత్తమ్ లాంటివారు ఇలా పోలీసులపై ఘాటు వ్యాఖ్యలు చేయటం సరికాదంటున్నారు. ఏమైనా జంగా అరెస్టుపై కాంగ్రెస్ నేతల నిరసన ఉద్రిక్త పరిస్థితులకు కారణమైందని చెప్పక తప్పదు. రాజకీయంగా సవాలచ్చ ఉండొచ్చు. ముఖ్యమంత్రిపై తీవ్ర వ్యాఖ్యలు చేయొచ్చు.కానీ.. పోలీసు అధికారుల మీద తొందరపడి వ్యాఖ్యలు చేయటం సరికాదన్న మాట వినిపిస్తోంది.


Tags:    

Similar News