తెలంగాణ‌లోనూ నిరుద్యోగ భృతి?!

Update: 2017-04-17 13:48 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన నిరుద్యోగ భృతిని ఎట్ట‌కేల‌కు సుమారు 3 ఏళ్ల త‌ర్వాత అమ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. స‌రిగ్గా అలాంటి హామీయే తెలంగాణ‌లో కూడా తెర‌మీద‌కు వ‌చ్చింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ - మాజీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌క‌ట‌న చేశారు. 2019లో తాము అధికారంలోకి రాయ‌డం ఖాయ‌మ‌ని తెలిపిన ఉత్త‌మ్ కుమార్ అప్పుడు యువ‌త సంక్షేమం కోసం నిరుద్యోగ భృతి ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. తెలంగాణ స‌ర్కారు విస్మ‌రించిన యువ‌త‌కు తాము భ‌రోసాగా నిలుస్తామ‌న్నారు.

ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్‌ ను తరలించాలన్న యోచనను ప్ర‌భుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలన్న డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ ధ‌ర్నాకు దిగింది. ట్యాంక్ బండ్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద బైఠాయించిన కాంగ్రెస్ నేతలను పోలీసలు అరెస్టు చేశారు. కాంగ్రెస్ నేతల బైఠాయింపు కారణంగా అక్కడ భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. దీంతో ధర్నా విరమించాల్సిందిగా పోలీసులు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి విజ్ణప్తి చేశారు. అందుకు ఆయన నిరాకరించారు. దీంతో పోలీసులు అక్కడ బైఠాయించిన కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి - సబితా ఇంద్రారెడ్డి - వంశీ - పొంగులేటి తదితరులను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంత‌రం గాంధీ భ‌వ‌న్‌ లో ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రైతులకు ఉచితంగా ఎరువులు అందిస్తామని గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్... రాబోయే ఏడాది నుంచి కాకుండా ఈ ఏడాది నుంచే ఎరువుల కోసం ఎకరాకు నాలుగు వేల రూపాయలు రైతులకు ఎందుకివ్వరని ప్రశ్నించారు. ఈ మే నుంచే రైతులకు ఎరువుల కోసం ఎకరాకు రూ. నాలుగువేల రూపాయలు ఇవ్వాలన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినట్లుగా మిర్చిరైతుకు గిట్టుబాటు ధర ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఉద్యోగాల ప్ర‌క‌ట‌న‌లు విడుద‌ల చేయ‌కుండా నిరుద్యోగుల‌తో రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌నోవేధ‌న‌కు గురి చేస్తోంద‌ని ఉత్త‌మ్ మండిప‌డ్డారు. అందుకే తాము 2019లో అధికార పగ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత పెద్ద ఎత్తున రిక్రూట్ మెంట్లు చేప‌ట్ట‌నున్న‌ట్లు వివ‌రించారు. అంతేకాకుండా నిరుద్యోగ భృతిని కూడా ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News