ఉత్త‌మ్ ప్లాన్ టోట‌ల్ ఫెయిల‌యిన‌ట్లుందే

Update: 2017-02-15 10:13 GMT
టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్లాన్ పూర్తిగా విఫ‌ల‌మ‌యింద‌ని కాంగ్రెస్ పార్టీ నేత‌ల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. పార్టీ నేత‌ల‌ను ఉత్సాహ‌ప‌రిచేందుకు స‌ర్వే రిపోర్ట్ పేరుతో షో చేద్దామ‌ని అనుకుంటే అది కాస్త పార్టీ నేత‌ల్లో ఆగ్ర‌హానికి కార‌ణ‌మ‌యింది. ఇటీవల గాంధీభవన్‌ లో జాతీయ ఎస్సీ విభాగం చైర్మెన్‌ కొప్పుల రాజు మాట్లాడుతూ తెలంగాణలో పార్టీ చేస్తున్న కార్యక్రమాల పట్ల రాహుల్‌ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమావేశంలో ప్రస్తావించారు. దీంతో కాంగ్రెస్‌ పార్టీకి కాయకల్ప చికిత్స చేయాలని భావించిన ఉత్త‌మ్ స‌ర్వే ఫలితాలు అని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పార్టీకి 50 సీట్లు వస్తాయని, 25 సీట్లలో పార్టీ బలహీనంగా ఉందని ప్ర‌క‌టించారు. ఉత్త‌మ్ ఉద్దేశం పార్టీ మ‌రింత బ‌లోపేతం కావాల‌ని నొక్కి చెప్ప‌డ‌మ‌ని అయితే ఆయ‌న ప్ర‌స్తావించిన అంకెల‌తోనే కాంగ్రెస్ బ‌ల‌హీన‌ప‌డింద‌నే భావ‌న తేట‌తెల్లం అయింద‌ని కాంగ్రెస్ నాయ‌కులు అంటున్నారు.

పార్టీ బ‌లంగా ఉందాల‌ని చూపించాల‌నుకునే నాయ‌కులు ఎవరైనా పార్టీకి వంద సీట్లు వస్తాయనో, వచ్చే ఎన్నికల్లో పార్టీకి భారీ మెజార్టీ వస్తుందని చెప్పి కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపుతారని కానీ పార్టీ ఇంకా దిగ‌జారిపోతోంద‌ని చెప్ప‌డం ఏంట‌ని పార్టీ నేత‌లు కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే ఫీజు రీయింబ‌ర్స్ మెంట్‌ ఉద్యమం - రైతు ఉద్యమం - మల్లన్నసాగర్‌ లో భూసేకరణపై నిరసనలు - ప్రాజెక్టులపై పవర్‌ పాయింట్‌ ఇవ్వడం వంటి కారక్రమాలు చేపట్టినా జనం పార్టీ వెంట ఎందుకు రావడం లేదనే అధిష్టానం ప్రశ్నకు టీపీసీసీ వద్ద సమాధానాలు లేదు. కార్యక్రమాలు చేపట్టినా ప్రజల నుంచి స్పందన రావడం లేదు. ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ టీఆర్‌ ఎస్‌ ను ఎదుర్కొలేక చతికిల పడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. టీఆర్‌ ఎస్‌ కు కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యామ్నాయం అన్న భావన ప్రజల్లో కలగడం లేదు. పార్టీ పరిస్థితిపై ఆయన చెబుతున్నదానికి...అసలు జరుగుతున్నదానికి పొంతన లేదని అధిష్టానం భావిస్తోంది. ఈ క్ర‌మంలో తాజా స‌ర్వే ఫ‌లితాలు కాంగ్రెస్‌ ను మ‌రింత‌గా దిగ‌జార్చాయ‌ని అంటున్నారు.

ఇటీవ‌లే తెలంగాణ జాయింట్‌ యాక్షన్‌ కమిటి చాలా బలహీనపడిందని ఇటీవల వ్యాఖ్యానించిన ఉత్తమ్‌... పార్టీ అంతర్గత చర్చల్లోనూ, టీజేఏసీ చైర్మెన్‌ కోదండరామ్‌ నుంచి ఆయన విమర్శలు ఎదుర్కొన్నారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా టీజేఏసీ ఉద్యమాలు చేపడుతున్న సమయంలో ప్రతిపక్ష పార్టీ నేతగా ఈ విధంగా మాట్లాడటం పట్ల పార్టీ నేతలు పెదవి విరిచారు. ఎన్నికలకు రెండున్నరేళ్ల‌ సమయం ఉండడంతో పార్టీ కీలకమైన నేత ఇటువంటి వ్యాఖ్యలు చేయడంతో పార్టీకి ఇబ్బందికరంగా మారుతాయన్న ప్రచారం జరుగుతోంది. సమీప భవిష్యత్తులో ఎన్నికలు లేకపోయినా, ఎన్నికల ఫలితాలతో పార్టీకి ఉపయోగం లేకపోయినా..ఎన్నికల సర్వే ఫలితాలు వెల్లడించి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్నారు. పార్టీ పెద్దలను సంప్రదించకుండా సొంత ఇమేజ్‌ పెంచుకోవడానికి సర్వే ఫలితాలు వెల్లడించడంతో ఆయన పదవికే గండమని  సీనియర్లు అంటున్నారు. అంతర్గత సమావేశాలు, సన్నిహితుల వద్ద 2019 వరకు తానే అధ్యక్షుడిగా ఉంటానంటూ ప్రచారం చేసుకుంటున్నారని కానీ ఈ దెబ్బ‌తో ఉత్త‌మ్ సెల్ఫ్ గోల్ చేసుకున్నార‌ని  విశ్లేషిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News