సుప్రీం హెచ్చ‌రించిన రోజే కేసీఆర్ రెచ్చిపోయారు

Update: 2016-08-25 08:49 GMT
విప‌క్షాల‌పై అదేప‌నిగా ప‌రువు న‌ష్టం దావాలు వేయ‌డం స‌రికాదంటూ త‌మిళ‌నాడు సీఎం జ‌య‌ల‌లిత‌పై సుప్రీం కోర్టు ఆగ్ర‌హించిన విష‌యం తెలంగాణ సీఎం కేసీఆర్ కు తెలుసో లేదో కానీ అదే స‌మ‌యంలో ఆయ‌న సుప్రీం సూచ‌న‌ల‌కు భిన్నంగా వ్య‌వ‌హ‌రించారు. ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శిస్తే జైళ్లో పెడ‌తామ‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ఇష్టానుసారంగా ఆరోప‌ణ‌లు చేసేట‌ప్పుడు ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోవాల‌ని టీడీపీ - కాంగ్రెస్‌ ల‌ను ఘాటుగా విమ‌ర్శించారు. ఇక మీద‌ట ఎడాపెడా విమ‌ర్శ‌లు చేస్తే జైల్లో  పెడ‌తా.. చిప్ప కూడు తినిపిస్తా అంటూ తీవ్ర స్వ‌రంతో హెచ్చరించారు. ఇంత‌కుముందు కూడా కేసీఆర్ ఇలా కేసులు పెడ‌తామ‌ని బెదిరించారు. అయితే - తాజాగా సుప్రీం ఈ విష‌యంలో త‌మిళ‌నాడు సీఎంపై ఆగ్ర‌హించిన వేళలోనూ కేసీఆర్ మొండిగా ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డ‌మే చ‌ర్చ‌నీయ‌మైంది. సుప్రీం సూచ‌న‌లు ఆయ‌న వ‌ర‌కు రాలేదా.. లేదంటే ఎవ‌రికీ భ‌య‌పడ‌బోన‌ని చెప్ప‌డానికే ఇలా తెగించారా అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

 తెలంగాణ స‌ర్కారు మ‌హారాష్ట్రతో ఒప్పందం చేసుకున్న అనంత‌రం హైద‌రాబాద్ లో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ సంద‌ర్భంగా ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ స‌న్నాసులు క‌ళ్ల‌ల్లో నిప్పులు పోసుకుంటున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. 40 ఏళ్ల పాల‌న‌లో మీరేం సాధించారంటూ ప్ర‌శ్నించారు. గ‌త రెండేళ్లుగా తెలంగాణ ప్ర‌భుత్వం చేప‌డుతున్న ప్ర‌జా సంక్షేమ ప‌థ‌కాలు చూసి కాంగ్రెస్ పార్టీ ఓర్వ‌లేక‌నే ఇలాంటి అర్థం ప‌ర్థం లేని ఆరోప‌ణ‌ల‌కు దిగుతోంద‌ని ఆరోపించారు. ఉత్త‌ర తెలంగాణ స‌స్య‌శ్యామలం అయితే.. జ‌నాల్లో తిర‌గ‌లేమ‌న్న దుగ్ధ‌తోనే ఇలాంటి చ‌వ‌క‌బారు విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. ఇక‌పై విమ‌ర్శ‌లు చేస్తే జైళ్లో పెడ‌తాన‌ని బ‌హిరంగంగానే అన్నారు.

అయితే... దీనిపై టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అదే స్థాయిలో స్పందించారు. జైల్లో పెడ‌తానంటూ బెదిరించ‌డం ముమ్మాటికీ క‌క్షాసాధింపు చ‌ర్య‌లేన‌ని స్పష్టం చేశారు. అయితే.. త‌మిళ‌నాడు కేసుల నేప‌థ్యంలో ఇక్క‌డ కేసీఆర్ విష‌యాన్ని సుప్రీం దృష్టికి తీసుకెళ్లే ఉద్దేశం ఉందో లేదో మాత్రం ఆయ‌న చెప్ప‌లేదు. ఒక‌వేళ అన్న‌ట్లుగానే కేసీఆర్ క‌నుక కేసులు పెడితే మాత్రం సుప్రీం కోర్టుకు వెళ్లాల‌ని కాంగ్రెస్ నేత‌లు అంటున్న‌ట్లు స‌మాచారం.
Tags:    

Similar News