బీజేపీ మ‌హిళా ఎమ్మెల్యేకు చేదు అనుభవం!

Update: 2018-07-31 17:18 GMT
కొన్ని ద‌శాబ్దాల క్రితం ద‌ళితుల‌కు ఆల‌య ప్ర‌వేశాలు లేవ‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే, అంట‌రానిత‌నం - అస్పృశ్య‌త అమానుషం అని ప్ర‌జ‌ల్లో ప్ర‌భుత్వం అవ‌గాహ‌న క‌ల్పించ‌డం.....ప్ర‌జ‌ల్లో అక్ష‌రాస్య‌తా శాతం పెర‌గ‌డం వంటి ప‌రిణామాల‌తో ఆ త‌ర‌హా ఘ‌ట‌న‌లు కొద్దిగా త‌గ్గుముఖం ప‌ట్టాయి. అయితే, దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఇప్ప‌టికీ....ఆ త‌ర‌హా దుర‌దృష్ట‌క‌ర ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌డం బాధాక‌రం. సామాన్యుల సంగ‌తి ప‌క్క‌న‌బెడితే....సెల‌బ్రిటీల‌కు కూడా ఈ త‌ర‌హా అవ‌మానాలు ఎదుర‌వ‌డం శోచ‌నీయం. కొద్ది రోజుల క్రితం....స‌తీ స‌మేతంగా ఓ ఆల‌యద‌ర్శ‌నానికి వెళ్లిన రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్....ఆల‌యం బ‌య‌టే పూజ‌లు నిర్వ‌హించార‌న్న వార్త వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. ఆ ఘ‌ట‌న స‌ద్దుమ‌ణ‌గ‌క ముందే అదే త‌ర‌హాలో జ‌రిగిన మ‌రో ఘ‌ట‌న తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. యోగి సీఎం ఇలాఖాలో సాక్ష్యాత్తూ ఓ బీజేపీ మ‌హిళా ఎమ్మెల్యేకు ప‌రాభ‌వం జ‌ర‌గ‌డం చ‌ర్చనీయాంశ‌మైంది. యూపీలోని ఓ ఆల‌యంలో స‌ద‌రు మ‌హిళా ఎమ్మెల్యే పూజ‌లు చేసిన అనంతరం....ఆ ఆల‌యాన్ని గంగాజలంతో శుధ్ది చేసి విగ్రహాలను ప్రయాగ (శుద్ది) చేయించిన ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

ఉత్తర ప్రదేశ్ లోని రాత్ నియోజక వర్గం బీజేపీ ఎమ్మెల్యే మనీషా అనురాగి (దళిత) జులై 12న‌ హమీర్ పూర్ జిల్లాలోని మస్కారా ఖుర్జ్ గ్రామంలో పర్యటించారు. ఆ సమయంలో కార్యకర్తల ఒత్తిడి ప్ర‌కారం....స్థానిక ధ్రుమ్ రుషి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వ‌హించారు. అయితే, ఆమె పూజ‌లు నిర్వ‌హించ‌డం.... గ్రామ పెద్దలకు ఇష్టం లేదు. కానీ, అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో వారు మిన్న‌కున్నారు. కానీ, మనీషా వెళ్లిన తర్వాత ఆ ఆలయాన్ని గంగాజలంతో  గ్రామ పెద్దలు శుద్ధి చేయించారు. దాంతోపాటు, ఆ ఆల‌యంలోని దేవ‌తా విగ్రహాలను ప్రయాగకు పంపించారు. మహాభారతం కాలం నాటి ఈ ప్ర‌సిద్ధి చెందిన ఆలయంలో మహిళలు - దళితులు ప్రవేశించరాదని స్థానికులు నియమ‌నిబంధ‌న‌లు విధించుకున్నారు. ద‌ళితురాలు అయిన మ‌హిళ ఆల‌యంలో అడుగుపెట్టార‌ని, అందునా...ఋషి ధ్యానం చేసిన ప్రాంతంలో ఆమె కాలు మోపార‌ని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. త‌మ‌ ఆచారాలను మంటగలిపేందుకు ప్రయత్నిస్తే సహించబోమ‌ని గ్రామ‌స్థులు హెచ్చరిస్తున్నారు. మ‌రోవైపు, దళిత మహిళ ఆ దేవాలయంలో అడుగుపెట్ట‌డంతో త‌మ గ్రామానికి కీడు జ‌రుగుతుంద‌ని గ్రామస్తులు భ‌య‌ప‌డుతున్నార‌ని, అందుకే ఆ ఆలయాన్ని గంగాజలంతో శుద్ధి చేయించామని గ్రామ పెద్దలు వివ‌ర‌ణ ఇస్తున్నారు. మ‌రి, ఈ ఘ‌ట‌న‌పై యోగి స్పంద‌న ఎలా ఉంటుందో వేచి చూడాలి.
Tags:    

Similar News