బాబును చూసి వీహెచ్ ఎందుకు నోరెళ్లబెట్టారు

Update: 2016-06-12 09:34 GMT
 రాజకీయ ఎత్తుగడల్లో ఆరితేరిపోయిన ఏపీ సీఎం చంద్రబాబు తెలివితేటలు చూసి తెలంగాణకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ నోరెళ్ల బెట్టారు. ఏపీలో ప్రభుత్వాన్ని గడగడలాడిస్తున్న కాపు ఉద్యమ నేత ముద్రగడ విషయంలో చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తూనే ఆయన ఆ విషయంలో చంద్రబాబు రాజకీయ చతురతను మెచ్చుకుంటున్నారు. ముద్రగడను చూసి చంద్రబాబు తెగ భయపడుతున్నారన్న ఆయన చంద్రబాబు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారని కూడా అన్నారు.  "చంద్రబాబు చానా ఇంటలిజెంట్. ముద్రగడను వేరే ఎవ్వరితోనో తిట్టిపిస్తలేడు. వాళ్ల సామాజిక వర్గం వాళ్లతో - కాపులతోనే తిట్టిపిస్తున్నడు. వారంతా చంద్రబాబుకు భజన చేస్తుండ్రు" అని విమర్శించారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్ న్యాయమైనదేనని, ముద్రగడను పరామర్శించేందుకు వచ్చిన తనను గదిలో నుంచి కదలనీయలేదని ఆయన ఆరోపించారు.

అదేసమయంలో ఆయన కాపుల విషయంలో సరిగా రెస్పాండుకాని జనసేన అధినేత - సినీ హీరో - కాపు ప్రముఖుడు పవన్ కళ్యాణ్ తీరునూ తప్పుపట్టారు.  వన్ కల్యాణ్ కూడా నోరు విప్పాలని సూచించారు. ‘‘పవన్ కళ్యాణ్ నోరు విప్పాలి.. ఎందుకు విప్పొద్దు? వాస్తవాలు చెప్పేందుకు భయమెందుకురా బాబూ నీకు? రా... వచ్చి వాస్తవాలు చెప్పు. ముద్రగడ తప్పు చేస్తుంటే తప్పని చెప్పు. కరెక్ట్ చేస్తుంటే కరెక్టని చెప్పు. అంతేగానీ, నేను న్యాయం గురించి కొట్లాడతా. నేను అవినీతిని నిర్మూలిస్తా. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ వాలిపోతా అని ఊకే మాటలు చెప్పొద్దు... ఆయన పెట్టిన పార్టీ పేరేంటి... జనసేనా... మరి జనసేన ఎక్కడా కనిపిస్తలేదే? ఇప్పటికన్నా నోరిప్పు మిత్రమా... మా మిత్రుడిది తప్పంటే తప్పని చెప్పు. కాపుల ఉద్యమం తప్పంటే తప్పని చెప్పు. లేకుంటే తప్పుకాదని చెప్పు. రెండూ చెప్పకుంటే ఎలా?" అని అన్నారు.

కాగా, మూడు రోజులుగా దీక్ష చేస్తూ వైద్య చికిత్సకు కూడా ససేమిరా అంటున్న ముద్రగడను కలిసేందుకు వీహెచ్ ఆదివారం వచ్చారు. అయితే, ఆయన్ను పోలీసులు ముద్రగడను కలిసేందుకు అనుమతించలేదు. ఆయన్ను బస చేసిన హోటల్ గదిలోనే నిర్బంధించారు. దీంతో వీహెచ్ అక్కడే విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబును, పవన్ కళ్యాణ్ ను విమర్శించారు. అయితే, ఇన్ని మాటలు చెప్పిన వీహెచ్ తమ పార్టీకే చెందిన కాపు ప్రముఖుడు చిరంజీవి గురించి మాటమాత్రమైనా ప్రస్తావించలేదు. చిరంజీవి కూడా ఈ విషయంలో సరిగా రెస్పాండ్ కాలేదని కాపులు అనుకుంటున్న తరుణంలో వీహెచ్ ఆయన విషయం వదిలేసి చంద్రబాబు, పవన్ లనే విమర్శించడంపై వ్యతిరేకత వస్తోంది. చిరంజీవికి కూడా గడ్డి పెడితే వీహెచ్ చిత్తశుద్ధి తెలిసేదని.. కానీ, ఆయన అలా చేయకుండా కాంగ్రెస్ బుద్ధిని బయటపెట్టుకున్నారని ఆరోపిస్తున్నారు.
Tags:    

Similar News