కులాల‌కు కోట్లు ఇచ్చే కేసీఆర్..జీతాలు పెంచ‌రా?

Update: 2018-06-09 05:12 GMT
ఆర్టీసీ కార్మికుల స‌మ్మెపై తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసిన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు షాకింగ్ గా మార‌ట‌మే కాదు..పెద్ద ఎత్తున రాజ‌కీయ దుమారాన్ని రేపాయి. అధికార‌పార్టీలోనూ భారీ చ‌ర్చ‌కు తెర తీశాయి. వేలాది మంది కార్మికులు ఉన్న సంస్థ‌కు సంబంధించి కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు స‌రికావ‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే..ఈ  వ్యాఖ్య‌పై విప‌క్ష నేత‌లు ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

అడ‌గ‌కుండానే కులాల‌కు రూ.5 కోట్లు చొప్పున వరాలు ప్ర‌క‌టించి.. భూములు ఇస్తాన‌నే ముఖ్య‌మంత్రి క‌ష్ట‌ప‌డి ప‌ని చేసే కార్మికుల‌కు జీతాలు పెంచ‌మ‌ని డిమాండ్ చేయ‌టం ఏ మాత్రం స‌రికాద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. ఉద్యోగాలు తీసేస్తాన‌ని ఆర్టీసీ కార్మికుల్ని భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తున్నార‌న్నారు.

నోరు తెరిచి అడ‌గ‌కున్నా. . కుల సంఘాల‌కు కోట్లు ఇచ్చే ముఖ్య‌మంత్రి కార్మికుల‌కు జీతాలు ఇవ్వ‌రా? అంటూ సూటిగా ప్ర‌శ్నించారు తెలంగాణ కాంగ్రెస్ నేత వీహెచ్ హ‌నుమంత‌రావు. ప్ర‌జ‌ల‌కు.. ఉద్యోగుల‌కు ఇబ్బంది క‌లిగే ప‌నులు చేయొద్దంటూ కేసీఆర్ స‌ర్కారును కోరారు. మ‌రో సీనియ‌ర్ నేత..మాజీ మంత్రి చిన్నారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్య‌మంలో ఆర్టీసీ కార్మికులు కీల‌క పాత్ర పోషించిన వైనాన్ని మ‌ర్చిపోకూడ‌ద‌న్నారు.

50వేల మంది ఉద్యోగులున్న ఆర్టీసీ న‌ష్టాల్లోకి వెళ్ల‌టానికి కేసీఆర్ విధానాలే కార‌ణంగా ఆయ‌న త‌ప్పు ప‌ట్టారు. ఆర్టీసీ అధికారుల వ‌ల్ల ఆ సంస్థ న‌ష్టాల్లో లేద‌ని.. ప్ర‌భుత్వ విధానాల వ‌ల్లే ఆ సంస్థ న‌ష్టాల్లో కూరుకుపోయిన‌ట్లుగా త‌ప్పు ప‌ట్టారు. సీఎం క‌క్ష సాధింపు చ‌ర్య‌లు మంచివి కావ‌ని.. ప్రైవేటు బ‌స్సుల్ని నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా న‌డ‌ప‌టంతో ఆర్టీసీ న‌ష్టాల్లో కూరుకుపోయింద‌న్నారు. ఆర్టీసీ కార్మికుల‌కు కాంగ్రెస్ పార్టీ అండ‌గా ఉంటుంద‌ని హామీ ఇచ్చారు.
Tags:    

Similar News