‘‘హైదరాబాదీ’’ పంచాయితీ మొదలైంది

Update: 2015-12-26 16:12 GMT
ఇప్పటివరకూ జరిగిన గ్రేటర్ ఎన్నికలకు భిన్నంగా ఈసారి ఎన్నికలు జరిగేటట్లు కనిపిస్తున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో విజయం కోసం తెలంగాణ అధికారపక్షం వ్యూహాత్మకంగా ముందుకెళుతుంటే.. మజ్లిస్ మరో తీరులో ముందుకు అడుగులేస్తోంది. తెలంగాణ అధికారపక్షం మీద తప్పించి.. మిగిలిన విపక్ష పార్టీల మీద విమర్శలు చేస్తున్న మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ.. తాజాగా ‘‘హైదరాబాదీ’’ ఫీలింగ్ బయటకు తీసుకొచ్చారు.

హైదరాబాద్ తమదని.. బయటోళ్లకు అవకాశం లేదని.. తమ నగరాన్ని తామే ఏలుకోవాలన్నట్లుగా ఓవైసీ వ్యాఖ్యలు చేయటం.. పనిలో పనిగా కాంగ్రెస్.. తెలుగుదేశం.. బీజేపీతో సహా మిగిలిన పార్టీల మీద మండిపడటం తెలిసిందే. ఓవైసీ చేసి తాజా వ్యాఖ్యలపై మండిపడ్డారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు.

హైదరాబాద్ తమదేనని చెప్పుకునే ఓవైసీలది అసలు హైదరాబాదే అంటూ తేల్చేసిన వీహెచ్.. వారిది అవకాశవాద పార్టీగా అభివర్ణించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎంతోలాభపడి.. ఇప్పుడు టీఆర్ ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. వారి వంచన చేశారంటూ మండిపడ్డారు. పాతబస్తీలో ఓవైసీ ఫ్యామిలీకి పలు విద్యాసంస్థలు.. కాంగ్రెస్ కారణంగానే సమకూరినట్లుగా చెప్పారు.

పేద ముస్లింలను పట్టించుకోని మజ్లిస్ ను నమ్మొద్దంటూ వీహెచ్ విమర్శలు చేశారు. నిన్న మొన్నటి వరకూ చట్టాపట్టాలేసుకొని తిరిగేసి.. కాస్త లెక్క తేడా వచ్చిన వెంటనే.. ఒకరి లెక్కలు ఒకరు బయటకు తీసుకుంటున్న వైనం చూసినప్పుడు అసలుసిసలు రాజకీయం ఏమిటో వీరిని చూసే తెలుసుకోవాలన్న భావన కలగటం ఖాయం. అధికారంలో ఉన్నప్పుడు.. ఒకరి తప్పులు ఒకరికి కనిపించని కాంగ్రెస్.. మజ్లిస్ లను మరి గ్రేటర్ ప్రజలు ఎంతవరకూ నమ్ముతారో చూడాలి.
Tags:    

Similar News