ప‌వ‌న్‌ను పొగ‌డ్త‌ల‌తో పిసికేసిన హ‌నుమంత‌న్న‌

Update: 2016-08-09 08:02 GMT
ఎవ‌రిపైన అయినా ఫోక‌స్ చేశారే త‌ర‌చూ వారినే ప్ర‌స్తావిస్తూ.. వారి గురించి మాట్లాడే త‌త్వం తెలంగాణ కాంగ్రెస్ నేత వీహెచ్ హ‌నుమంత‌రావు కాస్త ఎక్కువ‌. ఆయ‌న‌కు ఏ మాత్రంన‌చ్చ‌ని వ్య‌క్తి ఎవ‌ర‌ని అడిగితే.. ఉమ్మ‌డి తెలుగురాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ అని చెప్పేయొచ్చు. ఆయ‌న‌తో హ‌నుమంత‌న్న‌కు పేజీ ఏందోకానీ.. అవ‌స‌రం ఉన్నా.. లేకున్నా.. ఏదో ఒక అంశంలో ఆయ‌న పేరును లాగి మ‌రి ర‌చ్చ చేయ‌టం క‌నిపిస్తుంది.

గ‌వ‌ర్న‌ర్ వ్య‌క్తిగ‌త ఇష్టాయిష్టాల మీద కూడా త‌ర‌చూ విమ‌ర్శ‌లు చేసే హ‌నుమంత‌న్న‌.. గ‌వ‌ర్న‌ర్ త‌ర్వాత ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి త‌ర‌చూ ప్ర‌స్తావిస్తుంటారు. తాజాగా తిరుమ‌ల‌కువెళ్లిన ఆయ‌న‌.. రాజ‌కీయాల గురించి కాసేపు మాట్లాడారు. సాధార‌ణంగా తిరుమ‌ల కొండ మీద‌.. అందునా శ్రీవారి ద‌ర్శ‌నం త‌ర్వాత మీడియా ప‌లుక‌రించినా రాజ‌కీయాల గురించి కొండ మీద మాట్లాడ‌టానికి ప్ర‌ముఖులు ఎవ‌రూ ఇష్ట‌ప‌డ‌రు. అందుకు భిన్నంగా హ‌నుమంత‌న్న మాత్రం  రాజ‌కీయాల గురించి మాట్లాడేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కొన్ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

తాజాగా చోటు చేసుకుంటున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ల్ని చూస్తే.. ఏపీలో కాపులే నాయ‌క‌త్వం వ‌హిస్తారంటూ జోస్యం చెప్పారు. ఏపీలో కాపులే నాయ‌క‌త్వం వ‌హించాల‌న్న మాట వినిపిస్తోంద‌ని.. త‌న అభిప్రాయం కూడా అదేన‌ని వ్యాఖ్యానించారు. న‌డుస్తున్న‌ది కాపుల కాల‌మ‌ని.. ఇప్ప‌టివ‌ర‌కూ రెడ్డి.. క‌మ్మ‌లే నాయ‌క‌త్వం వ‌హించార‌ని.. రాష్ట్రంలో 28 వాతం మంది ఉన్న కాపులు నాయ‌క‌త్వం వ‌హిస్తే అభివృద్ధిలో మార్పులు వ‌స్తాయ‌న్న ఆశాభావాన్ని వ్య‌క్తం చేశారు.

త‌ర‌చూ ప‌వ‌న్ క‌ల్యాణ్ మీద విమ‌ర్శ‌లు చేసే వీహెచ్ తాజాగా మాత్రం అందుకుభిన్నంగా ఆయ‌న్ను పొగిడేయ‌టం గ‌మ‌నార్హం. ప‌వ‌న్ క‌ల్యాణ్ నాయ‌క‌త్వం వ‌హిస్తే కుల‌మ‌తాల‌కు అతీతంగా అంద‌రి బ‌తుకులు బాగుప‌డ‌తాయ‌ని న‌మ్మ‌కం ఉంద‌ని వ్యాఖ్యానించారు. బ్రిటీష్ కాలంలో ఉన్న రిజ‌ర్వేష‌న్లు ఇప్పుడు లేక‌పోవ‌టం ఏమిట‌ని ప్ర‌శ్నించిన ఆయ‌న‌.. వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల్లో కాపుల‌ను చేర్చాల‌న‌టం న్యాయ‌మైన కోర్కెగా అభివ‌ర్ణించిన వీహెచ్‌.. త్వ‌ర‌లో ఆ కోరిక తీరుతుంద‌న్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాపులు అధికారంలోకి వ‌స్తార‌ని జోస్యం చెప్పిన వీహెచ్‌.. తొలుత ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా కాపు నేత‌ను ఎందుకునియ‌మించ‌లేదో చెబితే బాగుంటుందేమో. ప‌దేళ్లు  ప‌వ‌ర్ లో ఉన్న వేళ‌.. కాపులకు రిజ‌ర్వేష‌న్ల గురించి మాట్లాడ‌ని వీహెచ్ కు ఇప్పుడే అవ‌న్నీ గుర్తుకు రావ‌టం ఏమిటో? ఇవ‌న్నీ ఒక ఎత్తు అయితే.. సొంత పార్టీ గురించి మాట్లాడ‌కుండా ప‌వ‌న్ జ‌పం చేయ‌టం ఏమిటో..!
Tags:    

Similar News