వ్యాక్సిన్ కంపెనీలకు వచ్చే లాభాలు ఎంతో లెక్క కట్టారు

Update: 2021-05-18 03:20 GMT
ఇప్పుడు ఎక్కడ చూసినా.. కరోనా.. వ్యాక్సిన్.. వీటి చుట్టూనే తిరుగుతోంది. వ్యవస్థలు మొత్తం వ్యాక్సినేషన్ ఎలా పూర్తి చేయాలన్న దానిపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి. ఇదే తెలివి ఆర్నెల్లు ముందు ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. సెకండ్ వేవ్ పుణ్యమా అని.. పెద్ద ఎత్తున వైరస్ వ్యాప్తి జరిగిన నేపథ్యంలో.. దాన్ని అడ్డుకునేందుకు టీకా వేయటం తప్పించి మరో మార్గం లేకుండా పోయింది. ప్రస్తుతానికి కోవిషీల్డ్.. కోవాగ్జిన్ రెండు వ్యాక్సిన్లు దేశీయంగా అందుబాటులో ఉండటం.. రష్యాకు చెందిన స్పుత్నిక్ - వి వ్యాక్సిన్ మార్కెట్లోకి వచ్చేస్తున్న విషక్ష్ం తెలిసిందే. రానున్న కొద్ది వారాల వ్యవధిలో మరో ఐదు వ్యాక్సిన్లు దేశీయంగా అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు.

ఒక అంచనా ప్రకారం రోజుకు దేశం మొత్తమ్మీదా 70 నుంచి 80 లక్షల వ్యాక్సిన్లు వేసే సామర్థ్యం ఉంది. కానీ.. టీకాలు వేయటానికి అందుకు సరిపడా సరఫరా లేని పరిస్థితి. దేశవ్యాప్తంగా 18 ఏళ్ల వయసు పైబడిన వారందరికి టీకా వేయించాలని కేంద్రం పెట్టుకున్న టార్గెట్ కు చేరుకోవటం అంత తేలికైన విషయం కాదని చెబుతున్నారు.  జులై నుంచి దేశంలో పలువ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో అక్టోబరు నాటికి పరిస్థితిలో కాస్త మెరుగుదల ఉంటుందన్న అంచనా వ్యక్తమవుతోంది.

ఇదిలా ఉంటే.. దేశీయంగా వ్యాక్సిన్లు తయారు చేసే కంపెనీలకు లాభాల మోత మోగుతుందన్న అంచనా వ్యక్తమవుతోంది. ఇన్వెస్టెక్ సెక్యూరిటీస్ సంస్థ అంచనా ప్రకారం టీకాలు తయారు చేసే కంపెనీలకు దాదాపు రూ.15వేల కోట్ల మేర ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. వ్యాక్సినేషన్ కోసం కేంద్రం రూ.75వేల కోట్ల వరకు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని చెబుతున్నారు. టీకా లాభంలో అధికంగా దేశీయంగా వ్యాక్సిన్ల ఉత్పత్తి మొదలు పెట్టిన సీరం.. భారత్ బయోటెక్ సంస్థలకే ఎక్కువగా వెళుతుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
Tags:    

Similar News