ముందుంది..మహా కష్టం..వ్యాక్సిన్ డెలివరీ అసాధ్యమే?

Update: 2020-09-20 07:50 GMT
కరోనాకు ప్రపంచంలోని అగ్ర దేశాలన్నీ వ్యాక్సిన్ తయారీలో తలమునకలై ఉన్నాయి. రష్యా ఇప్పటికే తమ వ్యాక్సిన్ సిద్ధమైందంటూ మార్కెట్లోకి కూడా తీసుకొచ్చింది. అమెరికాలో అతి తొందర్లోనే వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొస్తామని ప్రజలందరికీ ఉచితంగా పంపిణీ చేస్తామని ఆ  దేశాధినేత డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇంకా చాలా దేశాల్లో కరోనా టీకా  తయారీ వివిధ దశల్లో ఉంది. రష్యా ఇప్పటికే వ్యాక్సిన్ తయారు చేసినా అది మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసుకోకుండానే మార్కెట్లోకి వచ్చింది. పైగా అది వాడిన వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ తలెత్తుతున్నాయి. ఇక అమెరికా తయారుచేసిన వ్యాక్సిన్ ఏమేరకు ఫలితాలను ఇస్తుందో త్వరలో చూడాలి. కాగా  ఏదో ఒక దేశంలో వ్యాక్సిన్ తయారీ సఫలమై విజయవంతమైతే.. ఆ వ్యాక్సిన్ ని మిగతా అన్ని దేశాలకు పంపిణీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వ్యాక్సిన్ ఒక దేశంలో కనుగొన్నా.. దాని ఫార్ములా ను ఫార్మా సంస్థలకు చెబితే వ్యాక్సిన్ తయారీ సులభమే.అయితే దాని డెలివరీ మాత్రం కష్టసాధ్యంగా ఉంటుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.

 ప్రస్తుత ప్రపంచ జనాభా 780 కోట్లు. అంటే 780 కోట్ల టీకాలను సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇక టీకా  సిద్ధమైనా  ఉత్పత్తి మాత్రం ఏ 20 దేశాల్లోనో  30 దేశాల్లోనో ఉత్పత్తి చేసే అవకాశం మాత్రమే ఉంది. ప్రపంచంలో ఒక్కో మనిషికి ఒక్కో డోసు వేసిన 780 కోట్ల  డోసులు ఉత్పత్తి చేయాలి. ఈ డోసుల పంపిణీకి 8 వేల బోయింగ్  జెట్ విమానాలు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. విమాన సౌకర్యాలు ఉన్న ప్రాంతాలకు సరే.. ప్రపంచంలో అన్ని దేశాల్లో..  అన్ని ప్రాంతాల్లో విమానాల సదుపాయం లేదు. ఆయా ప్రాంతాలకు రోడ్డు మార్గాల ద్వారానే టీకాల చేరవేత కార్యక్రమం చేపట్టాల్సి ఉంటుంది. అది అంత సులభమైన పని కాదు.

ఇక ఒక్కో మనిషికి రెండు డోసులు వేయాల్సివస్తే ఇక  విమానాలు, వాహనాలు రెట్టింపు సంఖ్యలో అవసరమవుతాయి. ఇప్పుడు వ్యాక్సిన్ సిద్ధమైనా ప్రపంచంలోని అన్ని దేశాలకు సరఫరా చేయడం అంత సులభం కాదు. చాలా సమయం పడుతుంది. ఇక  టీకా అన్ని దేశాలకు చేరుకొని.. ప్రతి మనిషికి చెంతకు చేరేందుకు ఎన్నో రోజుల వ్యవధి పడుతుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. రవాణే కాదు వ్యాక్సిన్  కొనుగోలు కూడా అన్ని దేశాలకు కష్టమే. కాస్తో కూస్తో ఉన్న దేశాలు వ్యాక్సిన్లు ఏదోవిధంగా కొనుగోలు చేసినా  ప్రపంచంలోని పేద  దేశాలన్నీ ఈ ఖర్చును భరించడానికి సిద్ధంగా లేవు. కరోనా  పరిస్థితుల కారణంగా చితికి పోయి ఉన్నాయి. ఆ దేశాలకు  అంత పెద్ద మొత్తంలో వెచ్చించడానికి తగినంత ఆర్థిక వనరులు లేవు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గానీ, యునిసెఫ్ గానీ ముందుకు వచ్చి పేద దేశాలకు ఉచితంగా ఇస్తే తప్ప అన్ని దేశాలకు వ్యాక్సిన్  చేరే అవకాశం కనిపించడం లేదు.
Tags:    

Similar News