సుజ‌నా కోసం ఆ మంత్రిని ప‌క్క‌న‌పెట్టేశార‌ట‌

Update: 2016-09-10 17:30 GMT
నవ్యాంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపిన నేపథ్యంలో సీనియర్ నేతలు తెరమీదకు వస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప‌రిణామాల‌కు వేదిక‌గా నిలిచే సంఘ‌ట‌న‌ల‌ను గుర్తు చేస్తూ వారు కొత్త విశ్లేష‌ణ‌లు చేస్తున్నారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్రదేశ్‌ మాజీ వ్యవసాయ శాఖ మంత్రి - సీనియ‌ర్ నాయ‌కుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు ఇదే త‌ర‌హాలో ప్ర‌స్తుత కేంద్ర మంత్రి సుజ‌నా చౌద‌రి తీరును త‌ప్పుప‌ట్టారు. ఆయ‌న్ను భ‌రోసాగా ఉన్న ఏపీ సీఎం చంద్ర‌బాబు తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

14వ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులు ప్రత్యేక హోదాకు అడ్డుపడుతున్నాయంటూ కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ - వెంకయ్యనాయుడు మాట్లాడుతుండటం హాస్యాస్పదమ‌ని వ‌డ్డే అన్నారు. ప్ర‌త్యేక హోదా విష‌యంలో జరుగుతున్న చర్చల్లో సీనియర్ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజును ఉద్దేశపూర్వకంగా పక్కనపెట్టార‌ని వ‌డ్డే మండిప‌డ్డారు. వ్యాపారవేత్త - అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కుంటున్న సుజనా చౌదరికి పూర్తిస్థాయిలో లావాదేవీలు అప్పగించడంలో ఆంతర్యం ఏమిటని ఆయ‌న నిల‌దీశారు.  పైగా ఆంధ్రులంతా ప్ర‌త్యేక హోదా గురించి ఆందోళ‌న చెందుతుంటే సుజ‌నా మాత్రం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల గురించి భ‌రోసా ఇవ్వ‌డం విస్మ‌యంగా ఉంద‌న్నారు. ప్ర‌స్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న‌ అశోక్ గజపతిరాజు గతంలో రాష్ట్ర ఆర్థిక - రెవెన్యూ మంత్రిత్వ శాఖలు నిర్వర్తించిన అనుభవం ఉన్నప్ప‌టికీ, ఆయ‌న ప‌రిపాల‌న‌ అనుభ‌వాన్ని - సీనియారిటీ పక్కనపెట్టటంలో లాజిక్ ఏంటో చంద్ర‌బాబే చెప్పాల‌ని ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదాను ఏ రాష్ట్రం కూడా వ్యతిరేకించడం లేదని పేర్కొన్న వ‌డ్డే ఈ విష‌యాన్ని సుజ‌నా చౌద‌రి ఎక్క‌డా బ‌లంగా వినిపించ‌లేక‌పోయార‌ని అన్నారు. స్వాతంత్య్రం వచ్చి 60 ఏళ్లు గడిచినా ఇంకా వెనుకబడిన బీహార్ - జార్ఖండ్ - చత్తీస్‌ గఢ్ వంటి రాష్ట్రాలు హోదాను ఆశిస్తున్న‌పుడు ఏపీకి హోదా ఇవ్వ‌డంలోనూ తప్పు ఏముంద‌ని ప్ర‌శ్నించారు. ప్రధాని - కేంద్ర మంత్రులు - రాష్ట్రాల ముఖ్యమంత్రులు - ప్లానింగ్ కమిషన్ సభ్యులు (ప్రస్తుతం నీతి ఆయోగ్) - ఫైనాన్స్ కమిషన్ సభ్యులుగా ఉండే జాతీయ అభివృద్ధి మండలికే ఉంటుందని వడ్డే గుర్తుచేశారు. స‌రైన నాయ‌కుల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం చంద్ర‌బాబు నేర్చుకోవాల‌ని హిత‌వుప‌లికారు.
Tags:    

Similar News