ఒద్దికగా సాధించిన వద్దిరాజు..

Update: 2022-05-19 15:30 GMT
"రాజకీయాల్లో అవకాశాలు వాటంతటవే రావు. ఓపికగా ఎదురుచూడాలి. తొందరపడితే అంతా గాయిగత్తేరే" తెలంగాణ వచ్చాక  ప్రభుత్వం ఏర్పాటుకు ముందు తొలిసారి నిర్వహించిన పార్టీ ప్రతినిధుల సభలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యలివి. రాజకీయాల్లో ఇవి నిజంగా నిజం. సొంత వ్యక్తిత్వంతో.. పదవులు కావాలంటే నిరీక్షణ తప్పనిసరి. అలాకాదంటే సొంతంగా పార్టీ ఏర్పాటు చేసుకుని పోరాడాలి. అదీ కాదంటే అవకాశవాదిలా పార్టీలు మారాలి. మూడో ఆప్షన్ అన్నివేళలా సాధ్యం కాదు. అలా చేసినా వెంటనే పదవులు దక్కుతాయని చెప్పలేం. ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తోందంటే.. తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున సీఎం కేసీఆర్ ప్రకటించిన ముగ్గురు రాజ్య సభ అభ్యర్థుల్లో వద్దిరాజు రవిచంద్ర పేరు ఉండటాన్ని చూసి..

ఎవరీయన..?ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన రవిచంద్ర గ్రానైట్ వ్యాపారి. పుట్టింది వరంగల్ జిల్లానే అయినా.. కార్యక్షేత్రం మాత్రం ఖమ్మం జిల్లానే. కాగా, రవిచంద్ర గత మూడు, నాలుగేళ్లలో వెలుగులోకి వచ్చారు. రాజకీయంగా ఉనికిని చాటుకున్నారు. గత ఎన్నికల సమయంలో ఈయనకు టికెట్ ఇస్తారనే ప్రచారమూ జరిగింది. అయితే, అవేవీ వాస్తవ రూపం దాల్చలేదు. అయినా నిరుత్సాహానికి గురికాకుండా పార్టీనే నమ్ముకుని పనిచేశారు. దీంతోపాటు సొంత సామాజిక వర్గం మున్నూరు కాపులను చేరదీశారు.

వివిధ సంఘాలుగా విడిపోయి.. వేర్వేరుగా ఉన్నవారిని ఒక్కతాటిపైకి తెచ్చారు. సామాజిక వర్గ సమావేశాల్లో కీలక పాత్ర పోషించారు. ముఖ్యమైన పదవిలో అంటూ అందరినీ సమన్వయం చేశారు. మరోవైపు ఇటీవల రవీంద్ర భారతిలో మున్నూరు కాపుల మహాసభను పెద్ద ఎత్తున నిర్వహించారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు భారీగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సమావేశం నిర్వహణలో వద్దిరాజు రవిచంద్ర పోషించిన పాత్రను చూస్తే ఆయన పరపతి ఏమిటో తెలిసిపోయింది.

ఎలా వరించింది..?మూడు, నాలుగేళ్ల కిందటిదాకా పెద్దగా వెలుగులో లేని రవిచంద్ర.. నేడు ఎంపీ కానున్నారు. ఇది అనూహ్యమే అయినా.. దీనివెనుక ఆయన ప్లానింగ్ ఉంది. పార్టీని, సామాజికవర్గాన్ని బ్యాలెన్స్ చేస్తూ రవిచంద్ర ముందుకెళ్లారు.

సామాజిక వర్గంపై ఆయన పట్టను చూసి .. సీఎం కేసీఆర్ రాజ్య సభ సభ్యత్వం కట్టబెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరోవైపు కొంతకాలంగా రాజకీయ ప్రాధాన్యం పెరిగిన మున్నూరు కాపులకు ఈ విధంగా న్యాయం చేయడం అనేది కూడా కేసీఆర్ ప్లాన్లో ఉంది.

డీఎస్ స్థానం.. సంజయ్ కు చెక్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ (డీఎస్)ది మున్నూరు కాపు సామాజిక వర్గమే. పీసీసీ చీఫ్, మంత్రిగా, కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా పాత్రలు పోషించిన డీఎస్.. 2015లో టీఆర్ఎస్ లో చేరారు. రాజ్యసభ సభ్యుడయ్యారు. కానీ, 2018 నాటికి పార్టీతో చెడింది. దీనికితోడు డీఎస్ కుమారుడు అర్వింద్ బీజేపీ తరఫున దూకుడుగా ముందుకురావడం, ఎంపీగానూ గెలవడం, అదికూడా కేసీఆర్ కుమార్తె కవితను ఓడించి గెలవడంతో డీఎస్ కు టీఆర్ఎస్ కు మధ్య బంధం తెగిపోయింది. ఇప్పుడు అరవింద్ బీజేపీలో రాష్ట్ర స్థాయి నేత. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ ది కూడా మున్నూరు కాపు కులమే. వీరికి చెక్ పెట్టాలంటే రవి చంద్రకు టికెట్ ఇవ్వాలని నిర్ణయించారు.
Tags:    

Similar News