గన్నవరం ఎమ్మెల్యే వంశీ సంచలన నిర్ణయం

Update: 2019-10-27 16:06 GMT
కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలుగు దేశం పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబుకు రాసిన లేఖను విడుదల చేశారు. రాజీనామాకు గల కారణాన్ని కూడా వంశీ వెల్లడించారు.

తనను, తన అనుచరులను వైసీపీ నేతలు, ప్రభుత్వ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని.. నమ్ముకున్న వారిని కాపాడుకునేందుకు పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వంశీ పేర్కొన్నారు.

వల్లభనేని వంశీ కొద్దిరోజులుగా వైసీపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. ఇటీవలే ఆయన బీజేపీ ఎంపీ సుజనా చౌదరిని కలిసి పార్టీ మార్పుపై చర్చించారు. బీజేపీలో చేరితే తనపై ఉన్న కేసుల నుంచి ఉపశమనం కలుగుతుందని ఆశించారు. కానీ  ఆ తర్వాత వంశీ చూపు వైసీపీ వైపు మళ్లినట్టు వార్తలు వచ్చాయి. నిన్న జగన్ తో భేటి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజీనామా చేసి వైసీపీలో చేరితే సముచిత స్థానం కల్పిస్తానని  వంశీకి జగన్ హామీ ఇచ్చినట్టు ప్రచారం సాగుతోంది.

అయితే చంద్రబాబుకు రాసిన లేఖలో వైసీపీ వల్లే రాజీనామా చేస్తున్నానని.. రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నానని.. వంశీ పేర్కొనడంతో ఆయన వైసీపీలో చేరుతారా? లేక నిజంగానే వైసీపీ చర్యలతో రాజకీయాలకు పూర్తిగా దూరం జరుగుతారా అనేది తేలాల్సి ఉంది.
    

Tags:    

Similar News