విప్ ఇచ్చేంత పెద్ద మగాడా? బాబుపై మాజీ తమ్ముడి షాకింగ్ వ్యాఖ్యలు

Update: 2020-06-20 04:30 GMT
ఎవరు అవునన్నా.. కాదన్నా.. విమర్శలు ఎన్ని ఉన్నా చంద్రబాబు నాయుడు సీనియర్ రాజకీయ నేతనే  కాదు.. టీడీపీని విజయవంతంగా నడిపించటంలో కీలకభూమిక పోషించారు. ఒకప్పుడు తన ప్రాపకం కోసం చుట్టూ తిరిగిన ఒక నాయకుడు.. పూచిక పుల్లలా తేల్చేయటమే కాదు.. షాకింగ్ వ్యాఖ్యలు చేయటం సంచలనంగా మారింది. ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న వల్లభనేని వంశీ.. టీడీపీ నుంచి బయటకు వచ్చిన నాటి నుంచి బాబు మీద ఒంటికాలిపై విరుచుకుపడుతున్నారు.

మరే పార్టీలో లేని రీతిలో వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. తాజాగా జరిగిన రాజ్యసభ ఎన్నికల పోలింగ్ లో ఓటు వేయటానికి వచ్చిన ఆయన.. బాబుపై విరుచుకుపడ్డారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికైనా.. తర్వాత బాబును విభేదించి పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇదే క్రమంలో ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీడీపీ పేర్కొంది. అయితే.. ఆయన్ను ప్రత్యేక సభ్యుడిగా ఏపీ స్పీకర్ గుర్తించినట్లు చెబుతున్నారు.

రాజ్యసభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా టీడీపీ (సాంకేతికంగా) ఎమ్మెల్యేగా ఉన్న వంశీకి పార్టీ విప్ అందిందా? అన్న మీడియా ప్రశ్నకు చెలరేగిపోయారు. విప్ ఇవ్వటానికి చంద్రబాబు దగ్గర ఏముంది? ఉడకబెట్టిన నాగడి దుంప అని విరుచుకుపడ్డ వంశీ.. నాకు విప్ ఇచ్చేంత పెద్ద మగాడా? అంటూ చంద్రబాబుపై సంచలన వ్యాఖ్య చేశారు.

పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత విప్ జారీ చేయటం ఏమిటని ప్రశ్నించిన వంశీ బాబు తీరును తప్పు పట్టారు. నాకన్నా సిగ్గుండాలి.. ఆయనకన్నా ఉండాలి కదా?తనకైతే సిగ్గుందన్న వంశీ.. విప్ ఇవ్వటమా? గాడిద గుడ్డు ఇవ్వటమా? అంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన చుట్టూ ఉన్న చెంచాల మాటల్ని విని చంద్రబాబు పార్టీని నాశనం చేశారన్న వంశీ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. చూస్తుంటే.. రానున్న రోజుల్లో చంద్రబాబు ఈ తరహా వ్యాఖ్యల్ని మరెన్ని వినాల్సి వస్తుందో?
Tags:    

Similar News