గన్నవరం వైసీపీలో విభేదాల భగ్గు.. వల్లభనేని వర్సెస్ యార్లగడ్డ వర్గాల ఘర్షణ

Update: 2022-08-06 06:58 GMT
పండుగ పూట అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి గన్నవరం వైసీపీలో. నివురుగప్పిన నిప్పులా ఉన్న ఇద్దరు నేతల మధ్య విభేదాలు.. ఏ క్షణంలో అయినా రాజుకోవటం ఖాయమన్న విషయాన్ని తాజా పరిణామాలు చెప్పేశాయి.

సొంత పార్టీకి చెందిన నేతలే అయినా.. ఇరు వర్గాల మధ్య ఉన్న విభేదాల కారణంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న వైనం షాకింగ్ గా మారింది. స్థానికంగా సంచలనంగా మారిన ఈ ఉదంతం.. వైసీపీకి కొత్త తలనొప్పిగా మారినట్లు చెబుతున్నారు. వైసీపీలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. యార్లగడ్డ వెంకట్రావు వర్గాల మధ్య విభేదాల గురించి తెలిసిందే.

టీడీపీకి చెందిన వల్లభనేని వంశీ 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల అనంతరం సొంత పార్టీని వదిలేసి.. వైసీపీలో చేరటం తెలిసిందే. అప్పటివరకు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న వారిద్దరూ.. ఒకే పార్టీకి చెందిన వారుగా మారారు. దీన్ని యార్లగడ్డ వర్గం అస్సలు జీర్ణించుకోలేకపోతోంది. మొదట్నించి పార్టీ తరఫున పని చేసిన తమను కాదని.. వంశీని పార్టీలో చేర్చుకోవటంపై వైసీపీకి చెందిన పలువురు గుర్రుగా ఉన్నారు. దీనికి తోడు.. ఒకే పార్టీలో చేరిన తర్వాత ఈ ఇద్దరు నేతల మధ్య మొదలైన అధిపత్య పోరు పలు మార్లు ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది.

రెండో శ్రావణ శుక్రవారం సందర్భంగా ఏర్పాటు చేసే వరలక్ష్మీ వ్రతంలో భాగంగా ప్రభలతో వేడుకలు నిర్వహించటం గన్నవరంలో ఎప్పటి నుంచో ఉన్నదే. అయితే.. ఈ రెండు ప్రభలు వేడుకల ఊరేగింపులో వివాదం చోటు చేసుకోవటం.. చిలికి చిలికి గాలివానలా మారిన వైనంతో ఇరు వర్గాల వారు బాహాబాహీలకు పాల్పడ్డారు.

తమ ఆఫీసు ఎదురుగా వచ్చిన యార్లగడ్డ వర్గీయులే తమపై దాడికి పాల్పడినట్లుగా వంశీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. తమను కవ్వించారని.. మాటలతో రెచ్చగొట్టారని చెబుతున్నారు.పార్టీలోకి వంశీ రావటాన్ని యార్లగడ్డ వర్గం మొదట్నించి వ్యతిరేకిస్తోంది. తమకున్న అసమ్మతిని బాహాటంగా వ్యక్తం చేసేందుకు అస్సలు వెనకాడని పరిస్థితి. దీనికి తోడు.. యార్లగడ్డ.. వల్లభనేని వంశీలు ఇద్దరు తగ్గేదేలే అన్న రీతిలో వ్యవహరిస్తున్న వైనం ఈ ఇద్దరి మధ్య దూరాన్ని తగ్గకపోగా.. మరింత పెరుగుతోంది.

అదే సమయంలో పార్టీ అధినేత జగన్ సైతం.. గన్నవరంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులకు ఎలాంటి పరిష్కారాన్ని చూపించాలన్న దానిపై ప్రదర్శిస్తున్న అలసత్వం పార్టీ పరువు ఈ రీతిలో బజారున పడేలా చేస్తుందంటున్నారు. శుక్రవారం రాత్రి జరిగిన ఘర్షణల్లో ఇరు వర్గాలకు చెందిన వారు గాయపడినట్లుగా చెబుతున్నారు. ఇలాంటి ఉదంతాలు ఈ రెండు గ్రూపుల మధ్య మరింత దూరం పెరగటమే కాదు.. విభేదాల్ని ఎవరూ తగ్గించలేనంత వరకు వెళ్లటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News