ఆయ‌న చేరిక‌తో కేసీఆర్ సెంచ‌రీ!

Update: 2019-03-18 05:27 GMT
టీఆర్ ఎస్ తొలి సెంచ‌రీ సాధించింది. ద‌శాబ్దాల పోరాటం త‌ర్వాత ఏర్ప‌డిన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 119.  అందులో వంద సీట్లను ఒక పార్టీనే సొంతం చేసుకోవ‌టం అంత తేలికైన విష‌యం కాదు.  కానీ.. త‌న రెండో ప్ర‌య‌త్నంలోనే స‌క్సెస్ ఫుల్ గా పూర్తి చేశారు కేసీఆర్.

ఇటీవ‌ల ముగిసిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ ఎస్ కు 91 స్థానాలు ల‌భించాయి. అయితే.. పార్టీ ప‌వ‌ర్ లోకి వ‌చ్చిన త‌ర్వాత నుంచి టీడీపీ.. కాంగ్రెస్ నుంచి వ‌ల‌స‌లు షురూ కావ‌టం.. ఒక్కొక్క‌రుగా వ‌స్తున్న ఎమ్మెల్యేల‌తో పార్టీ బ‌లం అంత‌కంత‌కూ పెరుగుతూ వ‌చ్చింది. తాజాగా ఖ‌మ్మం జిల్లాకు చెందిన కొత్త‌గూడెం కాంగ్రెస్ ఎమ్మెల్యే వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర‌రావు టీఆర్ ఎస్ లో చేర‌టంతో ఆ పార్టీ తాజా బ‌లం వంద‌కు చేరిన‌ట్లైంది.

కేసీఆర్ సెంచ‌రీ చేసేందుకు కార‌ణ‌మైన వ‌న‌మా.. అందుకు త‌గ్గ‌ట్లే కేసీఆర్ ఫాంహౌస్ లో అధినేత చేతుల మీదుగా గులాబీ కండువా కప్పించుకొని గులాబీ కారులో త‌న జ‌ర్నీని షురూ చేశారు. త్వ‌ర‌లోనే తన ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని ఆయ‌న చెబుత‌న్నారు. వ‌న‌మా చెప్పిన రాజీనామా మాట ఎలా ఉన్నా.. ఎన్నిక‌ల త‌ర్వాత పార్టీలోకి చేరుతున్న ఇత‌ర పార్టీల ఎమ్మెల్యే కార‌ణంగా తెలంగాణ అసెంబ్లీలో టీఆర్ఎస్ బ‌లం వంద‌కు చేరుకుంద‌ని చెప్పొచ్చు.

ఇప్ప‌టివ‌ర‌కూ వినిపిస్తున్న స‌మాచారం ప్ర‌కారం.. రానున్న రోజుల్లో మ‌రికొంత‌మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గులాబీ కారు ఎక్కేందుకు ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తున్న‌ట్లు చెబుతున్నారు. ఎన్నిక‌ల వేళ త‌మ‌కు వంద‌కు పైగా సీట్లు వ‌స్తాయ‌ని చెప్పిన కేసీఆర్‌.. ఒక‌ద‌శ‌లో 115 సీట్లు వ‌ర‌కూ రావ‌టం ఖాయ‌మ‌ని చెప్పేవారు. కేసీఆర్ మాట‌ల్ని ప‌లువురు లైట్ తీసుకున్నా.. ఆయ‌న సంధించిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ తో 115 కాకున్నా.. 110 సీట్లు టీఆర్ ఎస్ ఖాతాలో ఉంటాయ‌న్న మాట వినిపిస్తున్నాయి. మిగిలిన సంగ‌తులు ఎన్ని ఉన్నా.. కేసీఆర్ సెంచ‌రీ చేసేందుకు కార‌ణమైన వ‌న‌మాకు త‌గిన గుర్తింపు ల‌భిస్తుంద‌న్న మాట వినిపిస్తోంది. తొలి సెంచ‌రీని కేసీఆర్ అంత సింఫుల్ గా తీసుకోరు క‌దా!
Tags:    

Similar News