కోర్టు తీర్పు-జ‌గ‌న్ ఆనందం- టీడీపీ కౌంట‌ర్‌..!

Update: 2022-04-29 17:30 GMT
ఇంజినీరింగ్‌ విద్యార్థిని రమ్య హత్యకేసులో గుంటూరు కోర్టు ఇచ్చిన తీర్పుపట్ల  సీఎం జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 'దిశ' స్ఫూర్తితో ఈ కేసు దర్యాప్తులో సమర్థవంతంగా వ్యవహరించిన పోలీసులను, ప్రాసిక్యూషన్‌ న్యాయవాదిని సీఎం అభినందిం చారు. మహిళల రక్షణ, భద్రత పట్ల ప్రభుత్వ సంకల్పాన్ని ఈ కేసు చాటిచెప్పిందన్నారు. మహిళలు, యువతులు, బాలికలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి  ఈ కోర్టు తీర్పు గట్టి సందేశాన్ని పంపిందని సీఎం వ్యాఖ్యానించారు.

నేరాల నిరోధంలో, నేరాల దర్యాప్తులో పోలీసులు ఇదే స్ఫూర్తితో పనిచేసి మహిళల భద్రత, రక్షణలకు పెద్దపీట వేయాలన్నారు. దర్యాప్తులో, విచారణలో ఉన్న ఈ తరహా కేసుల సత్వర పరిష్కారం కోసం ఇదే చిత్తశుద్ధితో పనిచేసి, దోషులకు కఠినంగా శిక్షలు పడేలా కృషిచేయాలన్నారు.

''విద్యార్థిని రమ్య హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును స్వాగతిస్తున్నాను. ఈ కేసు విషయంలో వేగంగా దర్యాప్తు పూర్తిచేసి, నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్ శాఖకు అభినందనలు'' అని సీఎం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. గుంటూరులో గత ఏడాది ఆగస్టు 15న జరిగిన బీటెక్‌ విద్యార్థిని నల్లపు రమ్య(20) హత్య కేసులో ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడు శశికృష్ణకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. సుదీర్ఘ వాదనల తర్వాత కోర్టు ఉరిశిక్ష విధించింది.

హత్య జరిగిన రెండోరోజే సీఎం ప్రకటించిన ఎక్స్‌గ్రేషియా రూ.పది లక్షల్ని రమ్య తల్లి జ్యోతికి అప్పటి హోంమంత్రి సుచరిత అందించారు. ఆ కుటుంబానికి మూడునెలలపాటు నిత్యావసరాలకు నగదు ఇచ్చారు. అదేనెల 20వ తేదీకల్లా రమ్య తల్లికి నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకం కింద గుంటూరులో ఇంటిస్థలం పట్టా ఇచ్చారు. అనంతరం ప్రభుత్వం మరో రూ.8,25,000 అందజేసింది. ఇంటి నిర్మాణానికి రూ.1.8 లక్షలు ఇచ్చింది.

విప‌క్షం ఏమందంటే

ఏపీ సీఎం జ‌గ‌న్.. తాజా తీర్పుపై హ‌ర్షం వ్య‌క్తం చేయ‌డం ప‌ట్ల ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ ఆచి తూచి స్పందించింది. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు అంటే.. జ‌గ‌న్ పాల‌న ప్రారంభించిన త‌ర్వాత‌.. 800 మంది మ‌హిళ‌లు/  యువ‌తులపై అత్యాచారాలు, హ‌త్యాచారాలు జ‌రిగాయ‌ని.. కానీ, ఒకే ఒక్క కేసులో ఇప్పుడు శిక్ష ప‌డింద‌ని.. అది కూడా 8 నెల‌లు ప‌ట్టింద‌ని.. మ‌రి ప్ర‌భుత్వం ఆర్భాటంగా తీసుకువ‌చ్చిన దిశ చ‌ట్టం అమ‌లు ఎక్క‌డ‌ని.. టీడీపీ తెలుగు మ‌హిళ అధ్య‌క్షురాలు.. వంగ‌ల‌పూడి అనిత ప్ర‌శ్నించారు. ఇలా చూస్తే.. మిగిలిన 799 మంది బాధిత కుటుంబాల‌కు ఎప్పుడు న్యాయం జ‌రుగుతుంద‌ని నిల‌దీశారు. ఈ ఒక్క కేసులోనే సీఎం అమితానందం పొందుతున్నార‌ని.. ఆ 799 మంది కుటుంబాల క‌న్నీరు ఇంకా కారుతూనే ఉంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

చంద్ర‌బాబు రియాక్ష‌న్ ..
ర‌మ్య కేసులో దోషికి ఉరి శిక్ష ప‌డ‌డాన్ని స్వాగ‌తిస్తున్నాన‌న్న టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు.. మ‌రి రాష్ట్రంలో మిగిలిన బాధిత కుటుంబాల ప‌రిస్థితి ఏంట‌ని ప్ర‌శ్నించారు. వారికి కూడాస‌త్వ‌ర‌మే న్యాయం జ‌ర‌గాల‌ని కోరుకుంటున్నాన‌ని పేర్కొన్నారు. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు.
Tags:    

Similar News