బాబుకు కామ‌న్‌ సెన్స్ లేదుః వంగ‌వీటి రాధా

Update: 2017-09-06 11:53 GMT
తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌ధాన‌ప్ర‌తిప‌క్ష‌మైన‌ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆ పార్టీ సీనియ‌ర్ నేత వంగవీటి రాధాకృష్ణ ఘాటుగా స్పందించారు. క్ర‌మ‌శిక్ష‌ణ లేద‌ని, వైసీపీ నాయ‌కులు గుండాల్లా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఏపీ సీఎం వ్యాఖ్యానించడం స‌రికాద‌ని అన్నారు. చంద్రబాబు సీఎం స్థాయికి తగ్గట్టు హుందాగా మాట్లాడాల‌ని కోరారు. అదే స‌మ‌యంలో వాస్త‌వాల‌ను గ‌మ‌నించి కామెంట్లు చేయాల‌ని వంగ‌వీటి రాధా సూచించారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు తప్పు చేసినా వెంటనే చర్యలు తీసుకుంటారని పేర్కొంటూ తెలుగుదేశం పార్టీలో ఎంపీగా ఉన్న జేసీ దివాకర్ రెడ్డి సాక్షాత్తు ముఖ్య‌మంత్రిని విమర్శించినా పట్టించుకోని పరిస్థితి ఉంద‌ని ఎద్దేవా చేశారు. దీన్ని బ‌ట్టే ఏ పార్టీ నేత‌లు క్ర‌మ‌శిక్ష‌ణ‌ను పాటిస్తారో అర్థ‌మ‌వుతోంద‌ని వంగ‌వీటి రాధా అన్నారు.

విజయవాడలో రంగాపై వ్యాఖ్యల నేపథ్యంలో అస‌లు ఏం జరిగిందో తెలుసుకోకుండా చంద్రబాబు మాట్లాడారని వంగ‌వీటి రాధా వ్యాఖ్యానించారు. ఓ మాజీ శాసనసభ్యురాలిని రోడ్డుపై పోలీసులు ఈడ్చుకుంటూ వెళ్ళారని పేర్కొంటూ దీనికి సంబంధించిన అధికారుల తీరుపై సీఎం కనీసం స్పందించకపోవడం దారుణమ‌ని అన్నారు. చంద్రబాబుకు కనీస కామన్ సెన్స్ లేదని మండిప‌డ్డారు. లా అండ్ ఆర్డర్ పై సీఎంకు పట్టులేదని అన్నారు. చంద్ర‌బాబుకు చిత్తశుద్ధి ఉంటే ఈ ఘటనలో పోలీసుల వ్యవహార శైలిపై విచారణ జరపాలని వంగ‌వీటి రాధా డిమాండ్ చేశారు.అనుచితంగా వ్యవహరించిన పోలీసుల పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయబోతున్నామ‌ని ప్ర‌క‌టించారు. అంతేకాకుండా దీనిపై న్యాయపోరాటం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన నేప‌థ్యంలో ఉద్రిక్త‌త‌లు త‌లెత్త‌కుండా రంగా అభిమానులు సంయమనం పాటించాలని కోరేందుకే ప్రెస్ మీట్ పెట్టాలని భావించామ‌ని వంగ‌వీటి రాధాకృష్ణ‌ తెలిపారు. అయితే పోలీసులు ఎవరి ఆదేశాలతో మమ్మల్ని అడ్డుకున్నారో తెలియదని కానీ ఆ స‌మ‌యంలో వారీ తీరు తీవ్ర అభ్యంత‌ర‌క‌రంగా ఉంద‌ని అన్నారు. వైఎస్ ఆర్‌ సీపీలో పూర్తి క్రమశిక్షణ ఉంది కాబ‌ట్టే...వంగవీటి రంగాపై మాట్లాడిన వారిని వెంటనే సస్పెండ్ చేశారని ఆయ‌న పునరుద్ఘాటించారు. తెలుగుదేశం పార్టీలో అధిష్టానంను విమర్శించినా ఎటువంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి ఉంద‌ని అన్నారు. అటువంటి చంద్రబాబు త‌మ‌ని విమర్శించడం హాస్యాస్పదమ‌ని ముందుగా సొంత పార్టీ సంగ‌తి చూసుకోవాల‌ని కోరారు.
Tags:    

Similar News