వంగవీటి మావాడే... టికెట్ కన్ ఫర్మ్...?

Update: 2023-01-13 01:30 GMT
అధికార వైసీపీ అయితే మాజీ మంత్రి కొడాలి నానికి ఈ విషయంలో ప్రయోగించింది అని ప్రచారం జరిగింది. నాని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాధా ముగ్గురూ మంచి మిత్రులు. దాంతో రాధాను తిరిగి వైసీపీలోకి తీసుకురావాలని ఎంతో చూశారు. కానీ రాధా మాత్రం వైసీపీ వైపు మొగ్గలేదు. ఈ మధ్యనే ఆయన వైసీపీ మీద ఘాటు విమర్శలు చేశారు.   వైసీపీలో  తనను కట్టడి చేశారని, ఆంక్షలు పెట్టారని కూడా ఫైర్ అయ్యారు.

దాంతో రాధా వైసీపీలో చేరరని తేలిపోయింది. అయితే ఆయన జనసేన వైపు చూస్తున్నారు అన్న టాక్ నడుస్తోంది. ఆ మధ్యన నాదెండ్ల మనోహర్ రాధా ఇంటికి వెళ్ళి మరీ మాటా మంతీ జరిపారు. ఇక రాధా పొలిటికల్ ట్రాక్ రికార్డు చూస్తే ప్రజారాజ్యం పార్టీలో ఆయన చేరి 2009 ఎన్నికల్లో పోటీ చేశారు, ఓడిపోయారు. దాంతో ఆయనకు పీఆర్పీ నుంచే పవన్ కళ్యాణ్ తో మంచి రిలేషన్స్ ఉన్నాయని అంటున్నారు.

ఈ నేపధ్యంలో రాధా జనసేనలోకి వెళ్తారు అని ప్రచారం సాగుతూ వచ్చింది. రాధా అయితే విజయవాడ సెంట్రల్ సీటుని కోరుకుంటున్నారు. అసలు ఆ సీటు వివాదమే ఆయన వైసీపీ నుంచి 2019 ఎన్నికల్లో బయటకు వెళ్లిపోవడానికి కారణం అయింది అని అంటారు. అయితే విజయవాడ సెంట్రల్ సీటు విషయంలో చూస్తే మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత బోండా ఉమ ఉన్నారు. ఆయన 2014లో ఆ సీటు నుంచి ఒకసారి గెలిచారు. పార్టీ వాయిస్ ని బలంగా వినిపిస్తూ వస్తున్నారు.

ఇక వచ్చే ఎన్నికల్లో అదే సీటు నుంచి పోటీ చేసి పార్టీ గెలిస్తే కచ్చితంగా మంత్రి అయ్యే అవకాశాలు ఉన్న వారిగా బోండా ఉమా ఉన్నారు. దాంతో రాధా టీడీపీ కంటే జనసేనలోకి వెళ్తేనే పొత్తుల బేరాలలో ఆ సీటు దక్కించుకోవచ్చు అని ఆలోచిస్తున్నారు అని టాక్ నడచింది. దీన్ని తెలుగుదేశం అధినాయకత్వం జాగ్రత్తగా గమనిస్తోంది. దాంతో రాధా కోరుకున్న సీటుని ఆయనకు ఇవ్వడానికి డిసైడ్ అయింది అని అంటున్నారు.

అంటే బోండా ఉమాకు ఆ సీటు లేదు అని చెబుతారు అన్న మాట. మరి సీనియర్ నేతకు ఇది ఇబ్బందికరమైన విషయమే. కానీ రాధా విషయం తీసుకుంటే ఆయన వంగవీటి రంగా కుమారుడు. రంగా వారసత్వాన్ని తమ వైపే ఉంచుకోవడం అన్న వ్యూహంలో భాగంగానే తెలుగుదేశం ఈ నిర్ణయం తీసుకుంది అని అంటున్నారు. అలా కనుక రాధాను గౌరవించినట్లుగా సంకేతం బయటకు వెళ్తే కాపుల మొత్తం మద్దతు తెలుగుదేశానికి దక్కుతుంది అని కూడా ఆలోచిస్తున్నారు అని తెలుస్తోంది.

ఇక రాధాకు టికెట్ కన్ ఫర్మ్ చేయకపోతే ఆయన జనసేనలోకి వెళ్తారు. ఆ విధంగా తమకు డైరెక్ట్ గా రావాల్సిన పొలిటికల్ మైలేజ్ మిస్ అవుతుంది అన్న ఆలోచనతోనే వైసీపీ అధినాయకత్వం ఈ దిశగా అడుగులు వేసింది అని అంటున్నారు. నిజం చెప్పాలీ అంటే బోండా ఉమ విజయవాడ సెంట్రల్ లో గత నాలుగేళ్లుగా పనిచేస్తున్నారు. ప్రతీ రోజూ పార్టీ జనాలతో పాటు సాధారణ జనాలలతోనూ అందుబాటులో ఉంటున్నారు.

ఆయన 2019 ఎన్నికల్లో కూడా జగన్ వేవ్ లో సైతం వైసీపీకి టఫ్ ఫైట్ ఇచ్చారు. కేవలం పాతిక ఓట్ల తేడాతోనే ఇక్కడ నుంచి మల్లాది విష్ణు ఎమ్మెల్యేగా గెలిచారు. దాంతో వచ్చే ఎన్నికల్లో తాను డ్యాం ష్యూర్ గా గెలుస్తాను అని బోండా ఉమా భావిస్తున్నారు. అలాంటి సీట్లో ఇపుడు రాధాకు టికెట్ అని అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది అన్నది ప్రచారంలో ఉంది. మరి దీని మీద బోండా ఉమా ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

అయితే అధినాయకత్వం మాత్రం బోండా ఉమాకు నచ్చచెబుతుందని అంటున్నారు. పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీగా చాన్స్ ఇస్తుందని, ఆయనకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా చూసుకుంటుంది అని అంటున్నారు. ఏది ఏమైనా బోండా ఉమా రాజకీయానికి బ్రేక్ పడిందా లేక రాధా దూకుడుకు సైకిల్ పార్టీ కొత్త హుషార్ తెచ్చిందా అన్నది రోజులు గడిస్తే తప్ప చెప్పడం కష్టం.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News

ఇక ఈడీ వంతు