వంగవీటి చూపు.. మళ్లీ వైసీపీ వైపు..?

Update: 2019-03-11 04:57 GMT
ఇటీవలే వైఎస్సార్  కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వెళ్లిన వంగవీటి రాధాకృష్ణ మళ్లీ ఆ పార్టీ వైపే చూస్తున్నారా? ఆ ప్రయత్నంలో ఉన్నారా? ఇందుకు సంబంధించి ఊహాగానాలు రేగుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత - గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానితో వంగవీటి రాధ సమావేశం కావడంతో.. ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

ఒకవేళ నాని వెళ్లి రాధాతో సమావేశం అయి ఉంటే.. ఏ బుజ్జగింపులకో అనుకోవచ్చు. అయితే రాధానే వెళ్లి నానితో సమావేశం కావడంతో.. రాజీ చర్చలు జరుగుతున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయవాడ సెంట్రల్ సీటును ఆశించి.. రాధ భంగపడ్డారు. అక్కడ మల్లాది విష్ణుకు జగన్ సీటును కేటాయించారు. ఈ నేపథ్యంలో అలిగి రాధ బయటకు వెళ్లిపోయారు. తెలుగుదేశం పార్టీలోకి చేరతారనే ఊహాగానాలు వచ్చాయి.

మొదటేమో మనుషులను పంపి ఏవో హామీలు  ఇచ్చిన చంద్రబాబు నాయుడు.. ఆ తర్వాత మాత్రం పట్టించుకోలేదు. ఒకవేళ వైసీపీలోనే ఉండి ఉంటే.. రాధాకు మచిలీపట్నం లేదా - విజయవాడ సెంట్రల్ కాకుండా మరో అసెంబ్లీ సీటు టికెట్ దక్కదనే మాట వినిపిస్తోంది. అయితే ఆయన బయటకు వెళ్లి ఏ పార్టీ నుంచి కూడా హామీ పొందలేకపోయారు. 

ఇలాంటి నేపథ్యంలో నాని తో రాధ సమావేశం చర్చనీయాంశంగా మారింది. జరిగిందేదో జరిగిపోయిందని, మళ్లీ రాధ వైసీపీలోకి వచ్చినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదనే కామెంట్ వినిపిస్తూ ఉంది. గుడివాడ నియోజకవర్గం పరిధిలో కాపు ఓట్ల సంఖ్య గణనీయంగా ఉన్న నేపథ్యంలో కూడా ఈ భేటీ ఆసక్తిదాయకంగా మారింది.
Tags:    

Similar News