పవన్ కి జై కొడుతున్న వంగవీటి ?

Update: 2021-10-04 07:32 GMT
జగన్ ది అక్షరాలా పన్నెండేళ్ల రాజకీయం. ఆయన తండ్రి వైఎస్సార్ దుర్మరణం తరువాత రాజకీయంగా ఒక్కో అడుగూ ముందుకు వేస్తూ ఎదుగుతూ వచ్చారు. ఈ రోజున 151 సీట్లతో ఆయన ముఖ్యమంత్రిగా బలంగా ఉన్నారు. అంతే కాదు, ఏపీలో ఉన్న మొత్తం లోకల్ బాడీ ఎన్నికల్లో నూటికి తొంబై శాతం గెలుచుకున్న పార్టీ వైసీపీ. మరి ఇలాగే వదిలేస్తే జగన్ని ఓడించడం కష్టమే. మరో మారు కనుక జగన్ అధికారంలోకి వస్తే ఇక పాతుకుపోయినట్లే. అందుకే జగన్ని ఓడించాలనే విపక్షాలు డిసైడ్ అయ్యాయి. ఈ విషయంలో వారూ వీరూ తేడా లేదు.

జగన్ని ఓడించాలి అంటే ఏం చేయాలన్న దాని మీద నిన్నటి దాకా ఆయన మతాన్ని ఆసరాగా చేసుకుని బాణాలు వదిలారు. జగన్ క్రిస్టియన్ మతాన్ని గట్టిగా నమ్ముతారు. ఆయన తాతల కాలం నుంచే ఆ మతంలోకి మారిపోయారు. అది ఆయన వ్యక్తిగతం. దాన్ని ఎవరూ తప్పుపట్టలేరు. మరో వైపు చూస్తే ఏపీలో మత రాజకీయాలు పెద్దగా  పంట పండవు. వాటికి ఓట్లు కూడా రాలవు. అది ఎన్నో సార్లు రుజువు అయింది. మరి మతం కంటే బలమైనది ఏంటి అంటే కులం. దాన్ని ప్రయోగిస్తే కచ్చితంగా ఏపీలో పొలిటికల్ గా సక్సెస్ అవుతారు. ఇది కూడా చాలా సార్లు నిరూపించబడింది.

అందుకే జగన్ మీద ఇపుడు బలమైన సామాజిక వర్గాన్ని ప్రయోగిస్తున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది. ఏపీలో కాపు కులస్థులకు రాజ్యాధికారం కావాలి. వారు ఆ దిశగా గతంలో ఎన్నో ప్రయోగాలు చేశారు. కానీ ఈసారి మాత్రం గట్టి పట్టుదల మీదనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ రాజమండ్రీ సభలో బహిరంగంగానే కాపులకు అప్పీల్ చేశారు. కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి అని కూడా ఆయన గట్టిగా కోరుకున్నారు. కాపులు అంటే వైసీపీలో ఉన్న వారు కాదు అంటూ మంత్రి పేర్ని నాని సొంత కులాన్నే విమర్శించారు అన్న దానిని కూడా ముందుకు తీసుకువచ్చారు. కాపులు రాజకీయంగా బలవంతులు అని చెప్పాలని కూడా జనసేన కోరుకుంటోంది.

మొత్తానికి పవన్ ఇచ్చిన పిలుపునకు కాపు పెద్దలు కూడా సానుకూలంగా రియాక్ట్ అయ్యారు. రాజకీయ కురు వృద్ధుడు అనతగిన మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య కూడా పవన్ మంచి మాట అన్నారని కీర్తించారు. కాపులు అంతా ఒక్కటిగా వచ్చే ఎన్నికల నాటికి ఉండాలని పిలుపు ఇచ్చారు. ఇపుడు అదే వరసలో మరో నేత మాట్లాడారు. ఆయన ఎవరో కాదు, కాపులకు ఆరాధ్య దైవంగా ఉన్న వంగవీటి మోహన రంగా కుమారుడు వంగవీటి రాధా. రాధా ఖమ్మం జిల్లా టూర్లో కీలకమైన వ్యాఖ్యలే చేశారు. ఆయన కాపులంతా ఒక్కటి కావాలని నినదించారు. తన తండ్రి కాపుల కోసం ఎంతో చేశారని, వారి అభ్యున్నతి కోరుకున్నారని కూడా రాధా చెప్పుకొచ్చారు. కాపులు ఎందులోనూ తక్కువ వారు కారని ఆయన అన్నారు.

మరో వైపు మంత్రి పేర్ని నాని కామెంట్స్ ని కూడా ఇండైరెక్ట్ గా రాధా తప్పు పట్టడం ఇక్కడ  విశేషం. ప్రతీ వారికీ సొంత కులాన్ని విమర్శించడం అలావాటు అయిపోయింది అని రాధా అన్న మాటలు నిజంగా పేర్ని నానిని ఉద్దేశించి అన్నవే అంటున్నారు. అంటే రాధా వైసీపీని టార్గెట్ చేశారు అనుకోవాలి. అంతే కాదు, కాపులు గతంలో అనేక అవకాశాలు కోల్పోయారని, ఇపుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పిలుపు ఇవ్వడం అంటే పవన్ కామెంట్స్ ని పూర్తిగా సపోర్ట్ చేస్తున్నట్లే. మొత్తానికి ఏపీలో కుల రాజకీయం మళ్ళీ మొదలైంది. అది ఎటు వైపు టర్న్ అవుతుంది. దాని వల్ల ఏ పార్టీకి భారీ నష్టం అన్నది ముందు ముందు తేలనుంది. మొత్తానికి జగన్ని ఎదుర్కోవడానికి ఇది బలమైన ఆయుధమే అని ప్రత్యర్ధులు భావించడంతో తప్పులేదు. దీనికి విరుగుడు వ్యూహం ఏంటి అన్నదే చూడాలి.
Tags:    

Similar News