కాపులను రెచ్చగొట్టడానికి మరో కుట్రా?

Update: 2016-04-03 07:11 GMT
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వంగవీటి రంగా విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. రాష్ట్రంలో పరిస్థితులు ప్రశాంతంగా ఉన్న ప్రస్తుత తరుణంలో రంగా విగ్రహాన్ని ధ్వంసం చేయడం వెనుక కుట్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాపులను రెచ్చగొట్టే లక్ష్యంతోనే ఎవరో ఈ కుట్ర చేసి ఉంటారని భావిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

కాగా రంగా విగ్రహం ధ్వంసంపై కాపు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ఘటనా స్థలాన్ని పరిశీలించారు. విగ్రహ ధ్వంసానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విగ్రహ ధ్వంసం ఘటన వెనుక కచ్చితంగా రాజకీయ కుట్ర ఉందని ఆయన ఆరోపించారు.  కాపులను రెచ్చగొట్టేందుకే ఈ ఘటనకు పాల్పడ్డారని వెల్లడించిన ఆయన, నిందితులు ఎంతటి వారైనా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ధ్వంసమైన విగ్రహం స్థానంలోనే కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని మంత్రి ప్రకటించారు. దుష్ప్రచారాలు నమ్మవద్దని, ఎక్కడా విధ్వంసాలకు పాల్పడవద్దని కాపులకు ఆయన పిలుపునిచ్చారు.

కొద్ది నెలలుగా రాష్ట్రంలో కాపు ఉద్యమం తీవ్రతరమై కొంత ఉద్రిక్తతలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అవన్నీ చల్లారి ప్రశాంత వాతావరణం నెలకొన్న సమయంలో మళ్లీ రంగా విగ్రహం ధ్వంసం ఎలాంటి పరిస్థితులను దారితీస్తుందో అన్న ఆందోళన అంతటా కనిపిస్తోంది.
Tags:    

Similar News