గులాబీ నేతలకు కొత్త టెన్షన్.. వాణీదేవికి పాజిటివ్

Update: 2021-03-29 04:40 GMT
హోరాహోరీగా సాగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్ స్థానం నుంచి విజయం సాధించిన పీవీ కుమార్తె పీవీ సురభి వాణీదేవి తాజాగా కరోనా పాజిటివ్ గా తేలారు. ఈ విషయాన్ని ఆమె ట్విటర్ ద్వారా ప్రకటించారు. జలుబు.. జ్వరం లాంటి లక్షణాలు కనిపించటంతో ఆమె కోవిడ్ టెస్టు చేయించుకున్నారు. ఈ పరీక్షలో ఆమెకు పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో.. ఆమె క్వారంటైన్ కు వెళ్లారు.

ఈ వార్త గులాబీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తోంది. వాణీదేవి గెలుపు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా గులాబీ నేతలు ఎంతలా కష్టపడ్డారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాదు.. ఫలితం వెలువడిన తర్వాత కూడా ఆమె బిజీబిజీగా ఉంటూ.. పెద్ద ఎత్తున కలుస్తున్నారు. తనకు పాజిటివ్ కావటంతో.. ఇటీవల కాలంలో తనను కలిసిన వారంతా టెస్టు చేయించుకోవాలని ఆమె కోరారు.

‘టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు నా మనవి. నాకు కోవిడ్ పాజిటివ్ గా నిర్దారణ అయినందున గత కొన్ని రోజులుగా నాతో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న వారు హోమ్ ఐసోలేషన్ తో పాటు అవసరమైతే కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను.’’ అంటూ ఆమె చేసిన ట్వీట్ గులాబీ నేతల్లో గుబులు రేపుతోంది. ఇదిలా ఉంటే.. ఇటీవలే సీఎం కుమార్తె కమ్ మరో ఎమ్మెల్సీ కవిత భర్త కూడా ఇటీవల కరోనా పాజిటివ్ గా తేలటం తెలిసిందే. తమ కుటుంబమంతా క్వారంటైన్ లో ఉందని.. తమను కలిసిన ప్రైమరీ కాంటాక్టులోని వారు టెస్టులు చేయించుకోవాలని.. తమను కలిసేందుకు ఎవరూ రావొద్దంటూ నాలుగు రోజుల క్రితమే ఆమె ట్వీట్ చేశారు. మొత్తంగా వాణీదేవి పాజిటివ్ వ్యవహారం టీఆర్ఎస్ నేతలకు కొత్త టెన్షన్ గా మారిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News