పోలీసులందు సంజయ్ మిశ్రా వేరయా!

Update: 2015-07-24 03:49 GMT
ఎన్నో సంఘటనల్లో చూస్తుంటారు... తమఏరియాలోకి రాని కేసుల్లో చాలామంది పోలీసులు పెద్దగా పట్టించుకోరు!  పోలీసులంటే కరుకుగా ఉంటారు, అదిరిస్తారు, బెదిరిస్తారు, అవసరమైతే లాఠీచార్జ్ చేస్తారు అని ఒక రకమైన అభిప్రాయం సమాజానికి పోలీసుపై ఏర్పడిపోయింది! అలా ఉండేది అతితక్కువమందే అయినా అది నాణానికి ఒకవైపు మాత్రమే... పోలీసుల్లో కూడా మంచి బుద్ది ఉన్న వాళ్లూ ఉంటారు, స్పందించే మనసున్న వారూ ఉంటారు! అలాంటి స్పందించే మనసున్న పోలీసు, మానవత్వానికి ఆరడుగుల నిలువెత్తు రూపం ఈయనే అంటూ సోషల్ నెట్ వర్క్ లో ఒక విషయం హల్ చల్ చేస్తోంది!

వివరాళ్లోకి వెళితే... ఒకబాలికపై ఒక మధ్యవయసున్న కామాందుడు అత్యాచారం చేశాడు. వాడిని పట్టుకుని అరెస్టు చేశారు పోలీసులు! అది సరే... ఇంతకూ అత్యాచారికి గురైన పాప పరిస్థితి ఏమిటి? ఆమెను ఒక చిన్న ఆస్పత్రిలో జాయిన్ చేశారు. ఆ ఆస్పత్రిలో ఆ బాలిక చాలా దారుణమైన పరిస్థితుల మధ్య ఉందన్న విషయం తెలుసుకున్న వారణాసిలోని పూల్ పూర్ పోలీస్ స్టేషన్ ఇన్ చార్జి ఇన్ స్పెక్టర్ ఆ సమస్య తన ఏరియాలోకి రాకపోయినా స్పందించాడు. హుటాహుటిన ఆ హాస్పటల్ కి వెళ్లి మెరుగైన వైద్యం కోసం ఆమెను అక్కడినుండి వేరే పెద్ద హాస్పటల్ కు తరలించాలని చూశాడు! ఆ ప్రయత్నంలో ఆస్పత్రి వర్గాలు ఏమాత్రం సహకారం అందించలేదట. అయినా సరే ఎవరో వస్తారు స్ట్రెచర్లు తెస్తారు, అంబులెన్స్ లు పంపిస్తారు అని వేచి చూడలేదు. ఆ బాలికను చేతుల్లోకి తీసుకుని హుటాహుటిన ఒక ప్రైవేటు హాస్పటల్ కు తీసుకువెళ్లి... ఆమె చికిత్సకు అయ్యే ఖర్చు "నేనే భరిస్తా" అని చెప్పారట ఇన్ స్పెక్టర్ సంజయ్ మిశ్రా!

పోలీసుల స్థాయిని, వారిపై ప్రజలకు ఉన్న ఒకరకమైన అభిప్రాయాన్ని చిన్న పనితో తుడిచేశారు మిశ్రా! ప్రస్తుతం ఈయన సోషల్ నెట్ వర్క్స్ లో పెద్ద హీరో అయిపోయారు! సమాజానికి అవసరం ఇటువంటి పోలీసులే... పోలీస్ అంటే వీడేరా... ఈయన మనసున్న పోలీస్... పోలీసులందు మిశ్రా వేరయా... అని కామెంట్స్ పెట్టి మరీ ఈ విషయాని షేర్ చేసేస్తున్నారు నెటిజన్లు!
Tags:    

Similar News