వ‌రుణ్ మాట‌!...ఆ ఎంపీల‌ను ఇంటికి పంపాల్సిందే!

Update: 2017-10-15 05:09 GMT
దేశ రాజ‌కీయాల‌పై గాంధీల వార‌సుడు, బీజేపీ యువ నేత‌ వ‌రుణ్ గాంధీ వెరైటీగా రియాక్ట్ అయ్యారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌కీయాల్లో సంస్క‌ర‌ణలు తేవాల‌న్న వారేకానీ, వాటి కోసం పోరాడిన వారు లేర‌ని ఆయ‌న నేతాశ్రీల‌ను నిలువునా క‌డిగేశారు. దేశంలో పేద‌లు పేద‌లుగానే ఉండిపోతున్నార‌ని, కానీ నేత‌లు మాత్రం మూట‌లు క‌ట్టేస్తున్నార‌ని, నేత‌లు త‌మ వార‌సులు, వార‌సుల‌ వారసుల‌కు కూడా ఆస్తులు కూడ‌గ‌ట్టేస్తూ నిర్భీతిగా సంపాయించేస్తున్నార‌ని నిష్క‌ర్ష‌గా మాట్లాడారు.  ఇందిరా గాంధీ కుమారుల్లో ఒక‌రైన సంజ‌య్ గాంధీ కుమారుడే ఈ వ‌రుణ్ గాంధీ. నాయ‌న‌మ్మ పార్టీ కాకుండా ఈయ‌న‌, ఈయ‌న త‌ల్లి మేన‌కా గాంధీలు బీజేపీలో ఉన్న విష‌యం తెలిసిందే.

ప్ర‌స్తుతం వ‌రుణ్ గాంధీ బీజేపీ త‌ర‌ఫున సుల్తాన్ పూర్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచి లోక్‌స‌భ‌లో ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఈయ‌న నిన్న‌ హైద‌రాబాద్ వ‌చ్చారు. ఇక్క‌డి  నల్సార్‌ విశ్వవిద్యాలయంలో ‘భారత్‌లో రాజకీయ సంస్కరణలు’ అనే అంశంపై నిర్వహించిన చర్చాగోష్ఠిలో వ‌రుణ్ గాంధీ ప్ర‌ధాన వ‌క్త‌గా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. దేశంలో రాజకీయ సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందన్నారు.  ముఖ్యంగా గడిచిన ఐదేళ్లలో ఎంపీల జీతం నాలుగు సార్లు పెరిగిందని అన్నారు.  అయితే జీతానికి తగ్గట్లు వారు పనిచేస్తున్నారా? లేదా? అన్న‌ది మాత్రం ప్ర‌శ్నార్థకంగానే మారింద‌ని ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఇలాంట‌ప్పుడు ప‌నిచేయ‌ని ఎంపీల‌ను రీకాల్‌(ఇంటికి పంప‌డం) ఎందుకు చేయ‌కూడ‌ద‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌స్తుతం ఈ ప‌ద్ధ‌తి బ్రిట‌న్‌లో ఉంద‌ని మ‌న ద‌గ్గ‌ర కూడా ఎందుకు అమ‌లు చేయ‌కూడ‌ద‌ని ప్ర‌శ్నించారు. ఈ విష‌యాల‌ను కేంద్రం పరిశీలించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని నొక్కి చెప్పారు. అదేవిధంగా ఎన్నికల్లో విరాళాల పేరిట జాతీయ పార్టీలు కోట్ల రూపాయలు సేకరిస్తున్నాయ‌ని దుయ్య‌బ‌ట్టారు.  గత 2014 ఎన్నికల్లో జాతీయ పార్టీలు రూ.860 కోట్లు సమకూర్చుకున్నాయని గ‌ణాంకాల‌తో స‌హా వ‌రుణ్ వివ‌రించారు. ఇక‌, దేశ ఎన్నిల‌క వ్య‌వ‌స్థ కూడా దాదాపు భ్ర‌ష్టుప‌ట్టి పోయింద‌ని వ‌రుణ్ విమ‌ర్శించారు.

ఎన్నికల నిర్వహణ ఖర్చు కూడా భారీగా పెరిగిపోతోంద‌ని, 2014లో సార్వత్రిక ఎన్నికలకు ఈసీ ఏకంగా రూ.594 కోట్లు ఖర్చుచేసింద‌ని వివ‌రించారు. అదే స‌మ‌యంలో త‌న పార్టీ బీజేపీని మాత్రం వ‌రుణ్ వెనుకేసుకు రావ‌డం గ‌మ‌నార్హం. తమిళనాడు రైతులు, ఇతర రాష్ట్రాల ప్రజలు నిత్యం దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళనలు చేస్తుంటే ఎవరూ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే అపోహ ప్రజల్లో బలంగా ఉంద‌న్నారు.  కానీ, ప్ర‌తి విష‌యంపైనా కేంద్రం స్పందిస్తుంద‌ని వివ‌రించారు. ఏదేమైనా వ‌రుణ్ వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా సంచ‌ల‌నం సృష్టించాయి. గాంధీ వార‌సునిగా వ‌రుణ్ చ‌క్క‌గా మాట్లాడాడ‌ని విమ‌ర్శ‌కులు సైతం మెచ్చుకునేలా ఆయ‌న వ్య‌వ‌హ‌రించ‌డం గ‌మ‌నార్హం.


Tags:    

Similar News