మోడీ బ్యాచ్ అన్ని రకాలుగా తొక్కేసిన వేళ.. వరుణ్ తర్వాతి అడుగేంది?

Update: 2021-10-10 10:55 GMT
తప్పు చేసినోడి మీద చర్యలు తీసుకునే విషయంలో మోడీ అండ్ కో పెద్దగా రియాక్టు కాలేదు కానీ.. ఆ తప్పును వేలెత్తి చూపిన వారిపై చర్యలు తీసుకోవటానికి మాత్రం అస్సలు ఆలస్యం చేయలేదు. దీంతో మోడీ చెప్పే మాటలకు.. చేతలకు మధ్యనున్న అంతరం మరోసారి స్పష్టమైందని చెప్పాలి. యూపీలో ఆందోళన చేస్తున్న రూతులపై తన వాహనాన్ని తొక్కించేసిన కేంద్ర సహాయమంత్రి కుమారుడి దుశ్చర్యను కనీసం ఖండించటం తర్వాత.. అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవటంలో మోడీ సర్కారు అనుసరించిన తీరుపై విస్మయం వ్యక్తమవుతోంది. అంతేకాదు.. వైరల్ వీడియోలు.. ప్రత్యేక సాక్ష్యుల మాటల్ని విన్నంతనే.. కేంద సహాయమంత్రిగా ఉన్న అజయ్ మిశ్రాను పదవి నుంచి తప్పించి.. ఆయన కుమారుడు ఆకాశ్ మిశ్రాపై చర్యలు తీసుకోవాల్సింది పోయి.. అలాంటిదేమీ లేకుండా చేయటంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ అంశంపై వెంటనే స్పందించిన అతి తక్కువమంది బీజేపీ నేతల్లో వరుణ్ గాంధీ ఒకరు. అందుకు బహుమానంగా అతన్ని..అతని తల్లి మేనకాగాంధీని పార్టీ జాతీయ కార్యవర్గం నుంచి తప్పించటం తెలిసిందే. దేశంలోని 80 మంది బీజేపీ కీలక నేతలు ఉండే ఈ కార్యవర్గం నుంచి తమను తప్పించిన వైనాన్ని వరుణ్ గాంధీ చాలా లైట్ తీసుకున్నారు. గడిచిన నాలుగైదేళ్లుగా తాను సదరు కార్యవర్గ సమావేశాలకు హాజరైనదే లేదని.. అలాంటప్పుడు తనను తప్పించినంత మాత్రం జరిగే నష్టం ఏమీ ఉండదని తేల్చేశారు.  

వాస్తవానికి యూపీ రైతులపై కేంద్రమంత్రి కొడుకు వాహనాన్ని తొక్కించేసిన వైనంలో పలువురు మరణించినా.. పార్టీ నేతలు సైలెంట్ గా ఉండిపోవటం తెలిసిందే. అయితే.. ఈ హత్యలకు జవాబు చెప్పాల్సి ఉంటుందన్న వరుణ్ ట్వీట్ సంచలనంగా మారింది. అదే సమయంలో మోడీ పరివారానికి ఏ మాత్రం మింగుడుపడనిదిగా మారింది. వాస్తవానికి మోడీ విషయంలో వరుణ్ గాంధీ.. అతడి విషయంలో మోడీకి మధ్య సరైన సంబంధాలు లేని విషయం తెలిసిందే.

వరుణ్ కు.. మోడీకి మధ్యనున్న పంచాయితీ ఏమిటంటే.. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రతిపాదిస్తే.. దాన్ని వ్యతిరేకించిన అతి కొద్దిమందిలో వరుణ్ గాంధీ ఒకరు. మోడీకి బదులుగా రాజ్ నాథ్ సింగ్ ను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలన్న డిమాండ్ ను వినిపించేవారు. తన విషయంలో చిన్నపాటి నష్టాన్ని చేకూర్చే వారినైనా సరే.. ఏళ్లకు ఏళ్ల తర్వాత అయినా ప్రతీకారం తీర్చుకునే మైండ్ సెట్ ఉన్న మోడీ వరుణ్ ను ఊరుకుంటారా? అందుకే.. 2014 ఎన్నికల్లో పార్టీ విజయం సాధించి ప్రధానిగా కుర్చీలో కూర్చున్న నాటి నుంచి వరుణ్ కున్న ప్రాధాన్యతను తగ్గించేయటం షురూ చేశారు.

మొదటి మంత్రివర్గంలో మేనకాగాంధీకి అవకాశం ఇచ్చినా.. ఆ తర్వాత ఆమెను తప్పించేయటం తెలిసిందే. అంతేకాదు.. యూపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా వరుణ్ బలప్రదర్శన చేసిన వైనాన్ని అడ్డుకొని.. అతడి ప్రాధాన్యతను మరింత తగ్గించేయటం తెలిసిందే. ఇలా తనకు నచ్చని వరుణ్ ను.. ఆయన తల్లి మేనకా గాంధీ విషయంలో అదే పనిగా చర్యలు తీసుకుంటున్న మోడీ.. తాజాగా పార్టీ జాతీయ కార్యవర్గం నుంచి తొలగించారు. ఈ క్రమంలో వరుణ్ ఏం చేస్తారన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News