యూపీ సీఎం పదవి రేసులోకి మరో ‘గాంధీ’

Update: 2016-06-11 12:52 GMT
దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్ని జాతీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటాయి. ఈ ఎన్నికల్ని పార్టీలన్నీ సెమీఫైనల్స్ గా భావిస్తాయి. ఈ రాష్ట్రంలో మెజార్టీ సీట్లు సాధించిన పార్టీకే జాతీయస్థాయిలో పగ్గాలు అందుకునే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే..ఈ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికల మీద ప్రత్యేక దృష్టిని సారిస్తుంటాయి. మరో ఏడాది వ్యవధిలో జరిగే.. యూపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిగా ప్రియాంక గాంధీని దింపటానికి రంగం సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక దశలో రాహుల్ గాంధీ పేరు వినిపించినా.. ఇప్పుడు మాత్రం  ప్రియాంక గాంధీ పేరే ప్రముఖంగా వినిపించే పరిస్థితి.

ఇదిలా ఉంటే బీజేపీ సీఎం అభ్యర్థిగా నితిన్ గడ్కరీ లాంటి వారి పేర్లు వినిపించినా.. ఇప్పుడు మాత్రం కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తే ఎలా ఉంటుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా కేంద్రమంత్రి మేనకాగాంధీ కుమారుడు వరుణ్ గాంధీ పేరు తెరపైకి వచ్చింది. అయితే.. ఈ పేరును పార్టీ వర్గాలు కాకుండా.. ఆయనకు ఆయనే ప్రమోట్ చేసుకోవటంపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి.

బీజేపీ అధినాయకత్వానికి ఇష్టం లేకున్నా వరుణ్ గాంధీ తనకు తానే యూపీ సీఎం అభ్యర్థిగా ప్రచారం చేసుకోవటం.. హోర్డింగ్ లు.. ఫ్లెక్సీలు.. కటౌట్లు ఏర్పాటు చేసే సమయంలో ప్రధాని మోడీ ఫోటోల స్థాయిలోనే వరుణ్ గాంధీ ఫోటోల్ని ఏర్పాటు చేయటం గమనార్హం. దీనిపై బీజేపీ లోని ఒక వర్గం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. వరుణ్ గాంధీ నేతృత్వం వహిస్తున్న సుల్తాన్ పూర్ ను దాటి బయటకు రావొద్దని ఆదేశాలు జారీ చేసినా.. వాటిని పట్టించుకోకుండా బయటకు వస్తున్న వరుణ్ గాంధీని ఎలా కంట్రోల్ చేయాలన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. బీజేపీ అగ్రనేతలకు ఇష్టం లేకుండా బరిలో ఉండటం వరుణ్ కు అంతమంచిది కాదన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News